మ్యూజికల్ హిట్ `ఓయ్!`కి 12 ఏళ్ళు!
on Jul 3, 2021

బాలనటిగా స్టార్ డమ్ చూసిన వాళ్ళలో బేబి షామిలి ఒకరు. 90ల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన షామిలిని తెలుగు తెరకు కథానాయికగా పరిచయం చేస్తూ యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం `ఓయ్!`. సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతో ఆనంద్ రంగ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
తొలిచూపులోనే సంధ్య(షామిలి)తో ప్రేమలో పడతాడు ఉదయ్ (సిద్ధార్థ్). అయితే, సంధ్యకి క్యాన్సర్ ఉందని తెలుసుకున్న ఉదయ్.. చివరి రోజుల్లో ఆమె ఆకాంక్షలని ఎలా నేరవేర్చాడు? అనే పాయింట్ తో `ఓయ్!` తెరకెక్కింది. ఉదయ్, సంధ్య పాత్రల్లో సిద్ధార్థ్, షామిలి నటన ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవగా.. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అలీ, నెపోలియన్, ప్రదీప్ రావత్, కృష్ణుడు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, సప్తగిరి, మాస్టర్ భరత్, సురేఖా వాణి, రావి కొండల రావు, రాధాకుమారి దర్శనమిచ్చారు.
యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో యువతరాన్ని విశేషంగా అలరించాయి. టైటిల్ సాంగ్ తో పాటు ``పోవద్దే ప్రేమ``, ``వెయిటింగ్ ఫర్ యు``, `అనుకోలేదేనాడు``, ``సరదాగా``, ``సెహరీ``.. ఇలా ఇందులోని గీతాలన్ని ఆదరణ పొందాయి. 2009 జూలై 3న విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచిన `ఓయ్!`.. నేటితో 12 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



