నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ
on Aug 11, 2017
సినిమా:- నేనే రాజు నేనే మంత్రి
తారాగణం:- రానా, కాజల్, కేథరిన్, అశుతోష్ రాణా, నవదీప్, శివాజీరాజా...
దర్శకత్వం:- తేజా
నిర్మాత:- డి.సురేశ్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
రెండు సినిమాలు ఫ్లాపైతే చాలు.. ‘ఇక వీడి పని అయిపోయిందిరా’ అంటుంటారు చాలామంది. అది చాలా తప్పు. ఎందుకంటే... మనిషిని ఏదైనా వదిలిపోవచ్చుకానీ... విద్వత్తు వదిలిపోదు. సరిగ్గా ప్రయత్నం చేస్తే.. విజయం తథ్యం.
వరుస ఫ్లాపులిచ్చిన చాలామంది హీరోలు... ఠపీ మని బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. కె.రాఘవేంద్రరావు లాంటి లెజెండ్రీ దర్శకుడే 80ల్లో వరుసగా ఆరు ఫ్లాపులిచ్చారు. కానీ... ఆ తర్వాత ఆయన సృష్టించిన సంచలనాలు గురించి వేరే చెప్పాలా? అందుకే... ఫ్లాపులు వచ్చినంత మాత్రాన పని అయిపోయినట్లు కాదూ... హిట్స్ లో ఉన్నవారంతా మేధావులూ కారు. ఈ విషయం ఇన్నాళ్లకు మళ్లీ నిరూపితం అయ్యింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చూశాక... నాకలా అనిపించింది.
దర్శకుడు తేజా హిట్ ఇచ్చి 15 ఏళ్లయ్యింది. వరుసగా 15 ఫ్లాపులిచ్చాడు. ఒకప్పుడు సిల్వర్ జూబ్లీ హిట్స్ ఇచ్చిన తేజాని.. ఇప్పుడు చాలామంది మరచిపోయారు కూడా. మరి... ఇప్పుడేమైంది?.. సీన్ రివర్స్ అయ్యింది. కాస్త లేటైనా ‘హిట్’కొట్టి చూపించాడు తేజా. ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’కథేంటో తెలుసుకుందాం.
కథ:
అనూహ్యంగా, అనుకోకుండా... జరిగే సంఘటనలే.. జీవితాలను మార్చేస్తుంటాయ్. అలా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల ఓ వ్యక్తి... నిప్పులు కక్కుతూ నింగిని తాకాడు. ఆ తర్వాత నేల రాలాడు. కానీ... జనప్రియుడయ్యాడు. సరిగ్గా చెప్పాలంటే ఈ రెండు లైన్లే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
ఈ కథను తయారు చేసుకోవడంలోనే తేజా కసి కనిపించింది. జీవితానికి ఏదీ అసాధ్యం కాదు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు... వడ్డీ వ్యాపారం చేసుకునే ఓ సామాన్యుడు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే... దాన్ని తెరపై చూపించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ‘ఇది సాధ్యమే’ అని జనాలకు అనిపించేలా సన్నివేశాలు పడాలి. అవి జనరంజకంగా ఉండాలి. అలా ఉండే సినిమా కచ్చితంగా హిట్టే. ‘నేనే రాజు నేనే మంత్రి’విషయంలో జరిగింది అదే. సామాన్యుడికి సిస్టం మీద కోపం వస్తే.. ఎంత దారుణంగా ఉంటుందో చూపించాడు తేజా.
రాజకీయనాయకునిగా ఎదిగే క్రమంలో హీరో.. ఎన్ని కుయుక్తులు పన్నినా.... వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా విడిచిపెట్టడు. పదవి ముఖ్యమా? భార్య ముఖ్యమా? అనే ప్రశ్న ఎదురైన సందర్భంలో ... ముఖ్యమంత్రి పదవిని సైతం అంగుష్టమాత్రంగా చూస్తాడు హీరో. అంటే ఆ పాత్ర స్థాయిని అర్థం చేసుకోవచ్చు. రాధా జోగేంద్రగా రానా నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘లీడర్’ సినిమా చూసి ‘ఇతనో రా మెటీరియల్’అని ఎగతాళిగా మాట్టాడిన వాళ్లకు ‘బాహుబలి’తోనే సమాధానమిచ్చాడు రానా. ఇక ఈ సినిమాతో అయితే చాలామందిని అభిమానులుగా మార్చుకున్నాడు. అతని ఆహార్యం, హావభావాలు, డైలాగ్ డిక్షన్ నిజంగా సూపర్.
జోగేంద్ర భార్య రాధ.. తెరపై అలాంటి ఆడకూతుర్ని చూసి ఎన్నాళ్లయ్యిందో. మొగుడ్ని ప్రేమించడం తప్ప మరొకటి తెలీని పాత్ర. కాజల్ ఇప్పటివరకూ చేసిన పాత్రలన్నీ ఓ ఎత్తు. ఈ పాత్ర ఓ ఎత్తు. హీరోయిన్ గా ఆమెకు జన్మనిచ్చిన తేజానే... ఇప్పుడు ‘నటి’గా ఆమెకు కొత్త జన్మనిచ్చాడు. అందులో నో డౌట్. ఎంత అందంగా ఉందండీ బాబూ.. ఆ అమ్మాయి. అంతే గొప్పగా చేసింది కూడా.
తేజా రాసుకున్న కథ, కథనం, పాత్రల తీరు తెన్నులు అన్నీ సూపర్బ్. అయితే... చివరి అయిదు నిమిషాలూ తడబడ్డాడేమో అనిపించింది. అయితే... చిన్న చిన్న పొరపాట్లున్నా.. కొట్టుకుపోవడం ఖాయం. సాంకేతికం కూడా అన్ని రకాలుగా సినిమా బావుంది.
ఇప్పుడొస్తున్న సినిమాల్లో కచ్చితంగా ఇదొక కొత్త ప్రయత్నం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఇంకెందుకు ఆలస్యం. చూసేయండి!
ఫైనల్ టచ్: రాజు గారు మెప్పించారు... ఒప్పించారు!
రేటింగ్: 3/5
-ఎన్.బీ