లై మూవీ రివ్యూ
on Aug 11, 2017
నటీనటులుః నితిన్, మేఘా ఆకాష్, అర్జున్, రవికిషన్, నాజర్, శ్రీరామ్, సురేష్, అజయ్, పృథ్వీ, బ్రహ్మాజీ, మధుసూధన్, రాజీవ్‌కనకాల, పూర్ణిమ తదితరులు
సినిమాటోగ్రఫి: యువరాజ్
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్ః ఎస్.ఆర్.శేఖర్
బ్యానర్: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలుః రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హను రాఘవపూడి
తెలుగు సినిమా అంటే నాలుగు పాటలు, రెండు ఫైట్లు, కాస్తంత కామెడి ఇవి దండిగా ఉంటే చాలు సినిమా అయిపోయినట్లేనని భావించేవారు ఒకప్పుడు. అయితే ఇరుగు పొరుగున ఉన్న చిత్ర పరిశ్రమల నుంచి ప్రయోగాత్మక చిత్రాలు రావడం ..మన సినిమాలను పక్కనబెట్టి వాటినే ప్రేక్షకులు ఆదరించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ కళ్లు తెరిచింది. హీరోలు కూడా ఇమేజ్ చట్రాన్ని దాటి విభిన్నమైన కథలకు సై అంటున్నారు. అలాంటి కథతోనే మన ముందుకు వచ్చారు యంగ్‌హీరో నితిన్. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన నటించిన "లై" ఇవాళ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నితిన్ ప్రయోగాన్ని ఆడియన్స్ సమర్థించారా..? లేక తిరస్కరించారా..? ఒకసారి చూస్తే..!
కథ: పద్మనాభం (అర్జున్) మోస్ట్ వాంటేడ్ క్రిమినల్.. అమెరికాలో ఉన్న అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఇక అసలు పేరు సత్యంకి ఇంటి పేరు "ఎ"ని చేర్చి అసత్యంగా తనను తాను హైలెట్ చేసుకుని..నిజం చెప్పడం ఏ మాత్రం అలవాటు లేని కుర్రాడు సత్యం (నితిన్). తన బిడ్డకి త్వరగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలని సత్యం తల్లి కోరిక. అన్నట్లు మనోడికి అమెరికా అంటే చెప్పలేనంత పిచ్చి. ఎలాగైనా అమెరికా వెళ్లి అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఒక పిసినారి అమ్మాయి చైత్ర ( మేఘా ఆకాశ్)తో పరిచయమై ఇద్దరూ కలిసి అమెరికా వెళతారు..ఈ ప్రయాణంలో ఇద్దరికీ ప్రేమ పుడుతుంది. అయితే ఒక సూట్ కోసం పద్మనాభం (అర్జున్) ప్రయత్నిస్తుంటాడు. అదే సూట్ కోసం సత్యం కూడా స్కెచ్ గీస్తుంటాడు. ఇంతకీ ఆ సూట్‌లో ఏముంది...? పోలీసుల మిషన్‌లో నితిన్ ఎలా ఇరుక్కున్నాడు..? హీరో, విలన్‌కి మధ్య సంబంధం ఏంటీ అన్నది తెరపై చూడాల్సిందే..?
విశ్లేషణ:
ఇంటెలిజెంట్ విలన్..అతన్ని మించిన ఇంటెలిజెంట్ హీరో..వీరిద్దరి మధ్య సాగే మైండ్‌గేమ్‌తో హాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి..ఇప్పుడిప్పుడే ఈ జోనర్ మూవీస్ తెలుగు ఆడియన్స్‌ని పలకరిస్తున్నాయి. గతేడాది జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో యంగ్‌హీరో నితిన్ అదే ఫార్ములాతో వచ్చాడు. స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్‌గా సాగే " లై " కథలో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పద్మనాభం-సత్యంల మధ్య సాగే హైడ్ అండ్ సీక్ గేమ్ చాలా ఇంటెలెక్చువల్‌గా ఉంటుంది. సినిమాను అమెరికాలోని అద్బుతమైన లొకేషన్లలో తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ను సోసోగా నడిపించిన హను ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ప్రేక్షకుల్లో ఏం జరగబోతుందన్న ఆసక్తిని రేపాడు. సెకండాఫ్‌లో సస్పెన్స్ మెయింటైన్స్ కోసం అనవసర సన్నివేశాలతో కథను నడిపించాడు. అయితే పద్మనాభం (అర్జున్) మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ ఎందుకయ్యాడో చెప్పలేదు. అలాగే కొన్ని సీన్లు, ఈక్వేషన్లు మాస్ ప్రేక్షకుడికి అర్థం కావు. సహజంగా ఇలాంటి కథల్లో కామెడీని ఆశించలేం..అందుకు తగినట్లుగానే సినిమా మొత్తం సీరియస్ మోడ్‌లో సాగిపోతుంది. పాటల పిక్చరైజేషన్ బాగున్నా..అసందర్భంగా వచ్చి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. కానీ నితిన్-మేఘా ఆకాష్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ మాత్రం అదిరిపోయింది.
నటీనటుల పనితీరు:
తన తోటి హీరోలంతా లుక్ విషయంలో కొత్తదనం చూపిస్తుంటే నితిన్ మాత్రం కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకే లుక్ మెయింటెన్ చేస్తూ రావడం అతని అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. కానీ లైలో నితిన్ లుక్ పూర్తిగా మారిపోయింది. అదే ఈ సినిమాకు భారీ హైప్ రావడానికి ఉపయోగపడింది. అబద్ధాలు చెప్పే సత్యం పాత్రలో నితిన్ చాలా హుషారుగా కనిపించాడు..తన గత చిత్రాలతో పోలిస్తే నటనలోనూ..డైలాగ్ డెలివరీలోనూ ఎంతో వ్యత్యాసం చూపించి యాక్షన్ చిత్రాలకు సైతం న్యాయం చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక విలన్‌గా అర్జున్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వతహాగా యాక్షన్ స్టారైన అర్జున్ కొత్తరకం విలనిజంతో ఆకట్టుకున్నాడు. కొత్తమ్మాయి మేఘా ఆకాష్ పిసినారి పిల్ల చైత్ర క్యారెక్టర్‌లో ఇమిడిపోయింది. నటనకు స్కోప్ లేకపోయినప్పటికీ నితిన్‌తో రోమాంటిక్ సీన్స్‌లో బాగా చేసింది. ఇక రవికిషన్, నాజర్, శ్రీరామ్, సురేష్, అజయ్, పృథ్వీ, బ్రహ్మాజీ, మధుసూధన్, రాజీవ్‌కనకాల, పూర్ణిమ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు హను రాఘవపూడి గురించే మాట్లాడుకోవాలి. విలన్ వెర్షన్‌తో ఎలివేట్ అయి..ఆ తర్వాత హీరోను స్ట్రాంగ్‌గా చూపించే అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాసుకుని తొలి విజయం సాధించాడు హను. తొలి రెండు సినిమాలుగా ప్రేమకథలను తెరకెక్కించి మూడో చిత్రాన్ని మైండ్‌గేమ్ జోనర్‌లో ఎంచుకోవడం..దానిని అద్భుతంగా డీల్ చేయడం నిజంగా సాహసంగా చెప్పుకోవచ్చు. ఇక యువరాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎన్ని లోకేషన్లు మారుతున్నా..పిక్చరైజేషన్‌లో క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అలరిస్తాయి. ఇక ఫ్యాషనేట్ ఫిలిం మేకర్స్‌గా పేరున్న 14 రీల్స్ సంస్థ ఎక్కడా తగ్గకుండా సినిమాను నిర్మించింది.
ప్లస్ పాయింట్స్:
+ కథ
+ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్లే
+ నితిన్, అర్జున్ నటన
+ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
+ స్టైలిష్ మేకింగ్
మైనస్ పాయింట్లు:
- కామెడీ
- పాటలు
- లాజిక్ లేని సన్నివేశాలు
ఫైనల్ టచ్: "లై"ని లైక్ చేయొచ్చు.
రేటింగ్: 2.25