నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్ రివ్యూ
on Dec 16, 2016

స్వేచ్ఛ పేరు చెప్పి విచ్చలవిడితనానికి పోతానంటే ఎలా? స్వేచ్ఛకీ, దానికి ఓ నిర్దిష్టమైన గీత ఉంది. దాన్ని దాటేసి 'నేనేదో కొత్త ప్రయత్నం చేశా' అని సమర్థించుకోవడం వెర్రిబాగులతనమే. ఓ కూతురి ఇష్టాల్ని కాదనలేని తండ్రిని ది బెస్ట్ డాడ్ అంటాం. అంతేగానీ.. కూతురు ముగ్గుర్ని ప్రేమిస్తే - అలా ప్రేమించడం ఏమాత్రం తప్పు కాదు అని వంతపాడే నాన్నని ఏమనాలి?? నాన్న పాత్రల్లో ఇదే ఎవరెస్ట్ అంటూ చూపించాలా? లేదంటే పాడైపోతున్న కూతుర్ల జీవితాలకు ఇలాంటి నాన్నలే కారణమంటూ ఎత్తి చూపాలా? ఇలాంటి చాలా డౌట్లు.. ` నాన్న నేను నా బోయ్‌ఫ్రెండ్స్` సినిమా చూస్తే మీకూ వస్తాయి.
* కథ
పద్మావతి (హెబ్బా పటేల్)కి మూడంటే సెంటిమెంట్. మూడో నెల, మూడో తారీఖు, మూడింటికి పుడుతుంది. అప్పటి నుంచీ అన్నింట్లోనూ మూడే. ఆఖరికి తాను ప్రేమించిన అబ్బాయిల అంకెతో సహా. ముగ్గుర్ని ప్రేమలోకి దించి, వాళ్లని నానా రకాలుగా పరీక్షించి, చివరికి ఒకడ్ని పెళ్లిచేసుకోవాలని చూస్తుంది. ఇవన్నీ తండ్రి (రావు రమేష్)కీ తెలుసు. కానీ కూతురిపై వల్లమాలిన ప్రేమ (?) తో ఆమె చేసిందనికల్లా.. 'అది నా బంగారంరా..' అంటూ వెనకేసుకొని వస్తాడు. ముగుర్ని ప్రేమించిన పద్మావతి ఈ ముగ్గరిలో ఎవరిని పెళ్లి చేసుకొంది? ఎవర్ని బకరాలుగా మార్చింది? అనేదే కథ.
* విశ్లేషణ
ఓ అబ్బాయి ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమించడం, అందులో ఫైనల్‌గా ఒకరిని పెళ్లి చేసుకోవడం పాత ఫార్ములా. కొత్తదనం ఏంటంటే.. ఓ అమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించడం. దాన్ని ప్రేమ అనలా? బరి తెగించడం అనాలా? లేదంటే అబ్బాయిల జీవితాలతో ఆటాడుకోవడం అనలా? అనేది వేరే పాయింటు. ప్రస్తుతానికి దాని జోలికి వెళ్లొద్దు. ముగ్గుర్ని ప్రేమించి ఒకర్ని సెలెక్ట్ చేసుకోవడం పాయింట్ వరకూ బాగానే ఉంది. కానీ హీరోయిన్ ప్రేమిచింది ఎవర్ని? అమ్మాయిల్ని తన అవసరాల కోసం వాడుకొనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌నా? గుళ్లో పూజారినా? తన బోయ్ ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో కథానాయిక లాజిక్ అర్థం కాదు. నోయెల్‌ని అన్ని రకాలుగా రెచ్చగొట్టి.. `నేను నీ అమ్మకు కోడలు అనుకొంటే నన్ను ముట్టుకో` అనడంతో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కి బలం చేకూర్చినట్టా? పాతాళంలోకి నెట్టేసినట్టా? పైగా చివర్లో ముగ్గుర్ని ప్రేమించి ఒక్కడ్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పెలా అవుతుంది.? అంటూ స్వగతంలో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించింది. దానికి తోడు తండ్రి పాత్ర రంగ ప్రవేశం చేసి.. ఆ ముగ్గురు బకరాలకూ హీతోపదేశం చేస్తాడు. `నా కూతురేం తప్పు చేయలేదు` అని. సెకండాఫ్ అష్టవంకర్లు తిరుగుతుంటుంది సినిమా. షకలక శంకర్‌ని ప్రవేశ పెట్టి అంత్యాక్షరి ఆడించారు. అక్కడే ఈ సినిమా చాలా వరకూ డ్రాప్ అయిపోయింది. ఓ దొంగ ఇంట్లో వాళ్లందరినీ కూర్చోబెట్టి అంత్యాక్షరి ఆడించడం ఏమిటి? వాళ్లంతా దొంగ గారు చెప్పినట్టు పాటలు పాడి డాన్సింగులు చేయడం ఏమిటి? టూమచ్ అనిపించింది. పద్మా వతి పేరు ఓ కుక్కకు పెట్టి అక్కడో స్కిట్ నడిపించారు. అది కూడా నవ్వులు పండించలేకపోయింది. పతాక సన్నివేశాల్లో డ్రామా కూడా ఫోర్డ్స్‌గా పెట్టినట్టే ఉంది. ఏతా వాతా అక్కడక్కడ కొన్ని నవ్వుల కోసం, పాటల కోసం, క్వాలిటీ మేకింగ్ కోసం ఈ సినిమా చూడాలంతే.
* నటీనటుల ప్రతిభ
హెబ్బా పటేల్ గ్లామర్ తో లాక్కొచ్చే ప్రయత్నం చేసింది. సీరియస్ గా భావోద్వేగాలు పండించాల్సిన చోట... తేలిపోయింది. తన కంటే పక్కనున్న తేజస్వినే కాస్త బెటర్ అనిపించింది. నాన్న పాత్రలో రావు రమేష్ ఉన్నాడు కాబట్టి, ఆయనపై తెరకెక్కించిన సీన్లలో లాజిక్‌లు లేకపోయినా చూడలిగాం. మరొకరైతే అవీ తేలిపోయేవి. అశ్విన్ బాగున్నాడు. కాకపోతే పవన్ కల్యాణ్ ఇమిటేషన్ ఎక్కువైంది. నోయెల్ ప్లేసులో కాస్త గుర్తింపు ఉన్న నటుడ్ని ఎంచుకొంటే బాగుండేది. పార్వతీశం ఓకే అనిపించాడు. షకలక శంకర్ మరోసారి పవన్ కల్యాణ్ నామ జపం చేశాడు.... ఏ మాత్రం అవసరం లేని చోట కూడా.
* సాంకేతిక వర్గం
ఈ సినిమా మేకింగ్‌లో రిచ్ నెస్ కనిపించింది. అదంతా చోటా పనితనం వల్లే. ఒక లైలా ముగ్గురు మజునూలూ పాట మాస్‌కి బాగా ఎక్కేస్తుంది. మిగిలిన పాటల్నీ థియేటర్లో చూడ్డం వరకూ బాగున్నాయి. తండ్రీ కూతుర్ల అనుబంధం గురించి చెప్పిన డైలాగులు ఆకట్టుకొన్నాయి. కథ బలహీనంగా ఉండడం, మలుపులేం లేకపోవడం, దాన్ని తీర్చిదిద్దిన విధానం సాధారణంగా ఉండడంతో బోయ్ ఫ్రెండ్స్ కాస్త బోరింగ్‌గా సాగింది. మెయిన్ పాయింట్‌ని కూడా కన్వెన్సింగ్‌గా చెప్పలేకపోవడం మరో ప్రధాన బలహీనత.
* చివరగా: కుమార్ 21 ఎఫ్ లోని హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కి కాస్త ఎక్స్‌టెన్షన్... ఈ సినిమా.
రేటింగ్: 2
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



