'జెర్సీ'ని అప్పుడే పాన్ ఇండియా సినిమాగా తీసి ఉండాల్సింది!
on Dec 22, 2021

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జెర్సీ'. 2019 ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'జెర్సీ' సినిమాను అదే టైటిల్ తో షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు గౌతమ్. ఈ సినిమా డిసెంబర్ 31 ప్రేక్షకుల ముందు రానుంది. అయితే 'జెర్సీ'ని అప్పుడే తాము పాన్ ఇండియా మూవీగా తీసి ఉండాల్సింది అంటూ తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ డిసెంబర్ 24 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా చేయలేమని అన్నారు. 'టక్ జగదీష్' వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసినవని చెప్పారు. సౌత్ కల్చర్ అంతా దాదాపు ఒకేలా ఉంటుంది కాబట్టి, తన సినిమాలను మిగతా సౌత్ ల్యాంగ్వేజ్ లో కూడా విడుదల చేస్తామని అన్నారు. అయితే పాన్ ఇండియా అంటూ హిందీలో కూడా విడుదల చేయాలంటే ఆ కథ, ఆ లెక్కలు వేరే ఉంటాయని చెప్పుకొచ్చారు.
అయితే తాను నటించిన జెర్సీ సినిమాని పాన్ ఇండియా మూవీగా చేసుంటే బాగుండేదని నాని అన్నారు. జెర్సీ పాన్ ఇండియా సబ్జెక్టు అని, కానీ మాకు అప్పుడు ఆ ఆలోచన రాలేదని చెప్పారు. తాము పాన్ ఇండియాగా తీసుంటే ఇప్పుడు షాహిద్ కి రీమేక్ చేసే ఛాన్స్ వచ్చేది కాదుగా అంటూ నాని సరదాగా వ్యాఖ్యానించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



