ENGLISH | TELUGU  

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూవీ రివ్యూ

on Dec 16, 2016

కాసేపు న‌వ్వుకోవ‌డం అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు. హాయిగా బాధ‌ల‌న్నీ మ‌ర్చిపోయి.. పెద‌వుల‌పై కొన్ని న‌వ్వులు పూయించుకోవ‌డం ఆనందం, ఆరోగ్యం కూడా. అందుకే కామెడీ సినిమాల‌కు గిరాకీ ఎక్కువ‌గా ఉంటుంది. క‌థేంటి? 
హీరోలెవ‌రు? అందులో లాజిక్కులు ఉన్నాయా, లేదా? ఇవి కూడా ప‌ట్టించుకోరెవ‌రు. కాసేపు న‌వ్వుకొని వ‌చ్చేస్తే స‌రిపోతుంద‌నుకొంటారు. అలాంటి సినిమానే.. `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు`.   హాస్య‌న‌టుడు 30 ఇయ‌ర్స్ ఫృద్వీని ఏకంగా హీరోగా మార్చేసిన సినిమా ఇది. మ‌రి.. సినిమాలోనూ ఆ స్థాయి కామెడీ పండిందా?  ఈ సినిమాలో ఎన్ని న‌వ్వులున్నాయి?  ఈ విష‌యాలు తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే. 

* క‌థ‌

ఓ రోజు రాత్రి మ‌ద్యం తాగి మ‌త్తులో ఉన్న ప్రియా (శృతి సోథీ)ని ఎలాంటి ప‌రిచ‌యం లేక‌పోయినా స‌రే.. ఇంట్లో క్షేమంగా దించి వ‌స్తాడు ప్రశాంత్(నవీన్ చంద్ర).  ప్రియా.. ఓ మ‌ల్టీ మిలియ‌నీర్ ఏబీఆర్ (ముర‌ళీ శ‌ర్మ‌) కూతురు.  ప్ర‌శాంత్ మంచి త‌నం చూసి.. త‌న గురించి తెలుసుకొని ప్రేమించ‌డం మొద‌లెడుతుంది ప్రియ‌. ప్ర‌శాంత్ కూడా మెల్లిగా ప్రియ ప్రేమ‌లో ప‌డిపోతాడు. కానీ వాళ్లిద్ద‌రి ప్రేమ‌కు ఏబీఆర్ ఒప్పుకోడు. కేవ‌లం డ‌బ్బు కోస‌మే త‌న కూతుర్ని వ‌ల్లో వేసుకొన్నాడంటూ ప్ర‌శాంత్‌ని అవ‌మానిస్తాడు.  గెల‌వ‌డంలో ఆనందం లేద‌ని.. ఓడిపోతేనే ఆనందం దొరుకుతుంద‌ని, ఒక్క‌సారి ఓడిపోయి చూస్తే త‌న ప్రేమ విలువ తెలుస్తుంద‌ని ఛాలెంజ్ చేస్తాడు ప్ర‌శాంత్‌. ఆ స‌వాల్‌ని  ఏబీఆర్ స్వీక‌రిస్తాడు. న‌ష్టాలొచ్చే వ్యాపారానికి సంబంధించిన ఐడియా ఇస్తే కోటి రూపాయ‌లు బ‌హుమానం ఇస్తాన‌ని ప్ర‌క‌టిస్తాడు. దాంతో..  రోల్డ్ గోల్డ్ ర‌మేష్ (ర‌ఘుబాబు) వేరియేష‌న్‌స్టార్ వీర‌బాబు (ఫృద్వీ) రంగంలోకి దిగుతారు. ఇంత‌కీ వీళ్లిచ్చిన  ఐడియా ఏమిటి?  అది వ‌ర్క‌వుట్ అయ్యిందా?  ప్ర‌శాంత్‌, ప్రియ‌ల ప్రేమ‌క‌థ ఏ మ‌లుపు తిరిగింది?  అనేదే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు క‌థ‌. 

* విశ్లేష‌ణ‌

కామెడీ క‌థ‌ల్ని తెరకెక్కించ‌డంలో ఇ.స‌త్తిబాబు స్పెష‌లిస్ట్‌. ఈసారీ వినోదం పండించ‌డానికి త‌గిన బేస్ .. `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు`తో వేసుకొన్నాడు. క‌థ‌లో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. `అరుణాచ‌లం` టైపు క‌థ ఇది. అందులో  ఓ ఎపిసోడ్‌ని సినిమాగా మ‌లిస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలా ఉంటుంది. అయితే.. కామెడీ సినిమాకి లాజిక్‌తో, అస‌లు క‌థ‌తో ప‌ని లేదు. చేతిలో ఉన్న స‌న్నివేశాల్ని బాగా మ‌ల‌చుకొంటే స‌రిపోతుంది. ద‌ర్శ‌కుడిగా కాస్త లిబ‌ర్టీ తీసుకొన్నా ఫ‌ర్వాలేదు. అయితే... స‌త్తిబాబు త‌న‌కు కావ‌ల్సినంత లిబ‌ర్టీ తీసుకొన్నాడు. సినిమాలో అస‌లు కంటే కొస‌రు క‌థే ఎక్కువ ఉంది. అది ఆక‌ట్టుకొనే రీతిలో సాగ‌డంతో వినోదానికి ఢోకా లేకుండా పోయింది.

ఈ సినిమాలో న‌వీన్ చంద్ర హీరో అయినా.. ఆ పోస్టు మొత్తం ప‌ట్టుకెళ్లిపోయాడు ఫృథ్వీ. త‌న‌పై తెర‌కెక్కించిన సీన్లు హిలేరియ‌స్ గా న‌వ్విస్తాయి. కాలేజీ స్టూడెంట్‌గా, ప్రేమికుడిగా. హీరోగా.. ఫృథ్వీ హావ‌భావాలు, అత‌ని న‌ట‌న‌, డైలాగులు.. వ‌న్స్ మోర్ అనిపించేలా ఉన్నాయి. దూకుడులో ఎమ్మెస్ నారాయ‌ణ  ఎపిసోడ్ త‌ర‌వాత సినీ రంగంపై ఇన్ని సెటైర్లు ఏ సినిమాలోనూ ప‌డ‌లేదేమో..?  అయితే.. రాను రాను.. ఫృద్వీ పాత్ర, అత‌ని స‌న్నివేశాలు కూడా బోర్ కొట్టిస్తాయి. అస‌లు క‌థ‌కీ, సైడ్ ట్రాక్ కీ సంబంధం లేక‌పోవ‌డం... అస‌లు కంటే కొస‌రే ఎక్కువుగా ఉండ‌డం ఈసినిమాలోని ప్ర‌ధాన మైన‌స్‌లు. కాసేపు చూసి న‌వ్వుకొని వ‌చ్చేస్తే స‌రిపోతుంది. అస‌లు హీరో, విల‌న్లు ఛాలెంజ్‌లు విసురుకొనేంత సీన్ ఈ సినిమాలో క‌నిపించ‌దు. ఆయా సన్నివేశాలు కృత్రిమంగానే సాగాయి. అయితే అదంతా న‌వ్వించ‌డం కోస‌మే కాబ‌ట్టి స‌ర్దుకుపోవొచ్చు.  సినిమా మొత్తం క‌లిపి చూడ‌కుండా.. బిట్లు బిట్లుగా వ‌చ్చే స‌న్నివేశాల్ని చూసి ఆనందించేయెచ్చు. 


* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఈ సినిమాకి అస‌లు హీరో న‌వీన్ చంద్ర‌నే అయినా.. కథ కోసం, కామెడీ కోసం త‌న హీరోయిజాన్ని ఫృద్వీకి త్యాగం చేసినందుకు.. న‌వీన్‌ని మెచ్చుకోవాల్సిందే. ఉన్నంత‌లో న‌వీన్ బాగా చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే స‌పోర్టింగ్ రోల్‌.
ఈ సినిమాకి రియ‌ల్ హీరో ఫృద్వీనే. వేరియేష‌న్ స్టార్‌ వీర‌బాబుగా క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్వించాడు.  దూకుడులో ఎమ్మెస్ హిలేరియ‌స్ కామెడీ పండించిన‌ట్టు... ఫృద్వీపై తెర‌కెక్కించిన సీన్లు బాగా న‌వ్వించాయి.
శ్రుతి కంటే స‌లోనీనే అందంగా క‌నిపించింది. గ్లామ‌ర్ ప‌రంగానూ త‌న‌కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. శ్రుతి పాత్ర‌కు అంత ప్రాధాన్యం లేదు. ముర‌ళీ శ‌ర్మ‌కు ఇలాంటి పాత్ర‌లు అల‌వాటే. అవే అరుపులు.. అవే కేక‌లు. పోసాని న‌ట‌న కూడా రొటీన్ గా సాగిపోతుంది. రోల్డ్ గోల్డ్ ర‌మేష్‌గా ర‌ఘుబాబు కూడా న‌వ్వించాడు.


* సాంకేతిక వ‌ర్గం
వ‌సంత్ పాట‌ల్లో నువ్వూ నేను ఇంట‌ర్ అనే పాట, దాన్ని తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకొంటాయి. మిగిలిన‌వ‌న్నీ సోసోనే. పాట‌లు క‌థ‌కు బ్రేకులు వేశాయి. సాంకేతికంగా ఈ సినిమాని కాస్త ఖ‌ర్చు పెట్టి తెర‌కెక్కించార‌నిపిస్తుంది. పంచ్‌లు బాగానే పేలాయి. కాక‌పోతే. ద్వితీయార్థం మ‌రీ నెమ్మ‌దిగా సాగింది. క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం, కొస‌రు కోస‌మే దృష్టి పెట్ట‌డంతో ఈ సినిమా ఎప్పుడో సైడ్ ట్రాక్ ఎక్కేసిన‌ట్టైంది. అయితే.. కామెడీ సీన్లు న‌డిపించ‌డంలో స‌త్తిబాబు త‌న ప్ర‌తిభ మ‌రోసారి చాటుకొన్నాడు.

రేటింగ్ : 1.50

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.