మన్యం పులి మూవీ రివ్యూ
on Dec 2, 2016
మలయాళ సినిమాల విషయంలో ఓ విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. కథ, కథనాలు, నటీనటుల ప్రతిభ అద్భుతంగా ఉన్నా.. సినిమా మేకింగ్ లో క్వాలిటీ ఉండదని, తక్కువ ఖర్చుతో చుట్టేస్తారని, టెక్నికల్‌గా మలయాళం సినిమాలు తక్కువ స్థాయిలో ఉంటాయని చెబుతుంటారు. అయినా ఆ మాట తప్పని నిరూపించిన సినిమా.. మన్యం పులి. మలయాళంలోనూ క్వాలిటీ మేకింగ్ సినిమాలు వస్తాయని భవిష్యత్తులో చెప్పుకోవడానికి... ఈ సినిమా ఓ తార్కాణంగా నిలుస్తుంది. మరి మన్యం పులిలోని క్వాలిటీ ఏ విషయంలో కనిపిస్తుంది? ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
అది పులియూరు అనే ఊరు. అడవికి అత్యంత సమీపంలో ఉండే ఈ ఊరు.. పులులకు ప్రసిద్ది. తరచూ పులులు ఈ గ్రామంపై దాడి చేస్తుంటాయి. పులికుమార్ (మోహన్ లాల్) మన్యం వీరుడు. పులల నుంచి తన గ్రామాన్ని కాపాడుతుంటాడు. డాడీ గిరిజ (జగపతిబాబు ) కన్ను పులికుమార్‌పై పడుతుంది. కాన్సర్ నుంచి ప్రజల్ని కాపాడడానికి ఓ మందు కనుక్కొన్నానని, ఆ మందు గంజాయి నుంచి తయారు చేయాలని, ఈ విషయంలో తనకి సాయ పడాలని పులి కుమార్‌ని సంప్రదిస్తాడు. అయితే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని గ్రహిస్తాడు పులికుమార్. అయితే అప్పటికే తన తమ్ముడ్ని కోల్పోతాడు. డాడీపై పులికుమార్ ఏ విధంగా తన పగ తీర్చుకొన్నాడు. పులి నుంచే కాదు, పులి కంటే భయంకరమైన మనుషుల నుంచి తన ప్రజల్ని ఎలా కాపాడుకొన్నాడు అనేదే కథ.
* విశ్లేషణ
కథ ప్రకారం... వైవిధ్యమూ లేదు. ఊహించని మలుపులూ ఈ సినిమాలో కనిపించవు. సాధారణమైన కథని ఓ విజువల్ ట్రీట్‌గా తెరకెక్కించడానికి మాత్రం చిత్రబృందం చాలా కష్టపడింది. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా తెరపై కనిపిస్తుంది. కథని మొదలెట్టిన విధానం ఉత్కంఠత కలిగిస్తుంది. తొలి సన్నివేశాలు ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. మోహన్ లాల్ చిన్నప్పటి సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. కమలిని ముఖర్జీ, నమితలతో సాగిన సీన్లు బోర్ కొట్టిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి ప్రధాన మైనస్ అదే.
సినిమా ట్రాక్ తప్పుతోందా అనుకొన్నప్పుడు సడన్‌గా ఓ యాక్షన్ సీన్ వచ్చి కట్టిపడేస్తుంది. కథకు సంబంధించిన సన్నివేశాలు బోరింగ్‌గా సాగడం, యాక్షన్ సీన్లు రక్తి కట్టించడం ఈ సినిమా ప్రత్యేకత. పులికి సంబంధించిన సన్నివేశాల్ని చాలా గ్రిప్పింగ్ గా తీశారు. అవన్నీ ఓ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంటాయి. పతాక సన్నివేశాలు కూడా అంతే స్థాయిలో తెరకెక్కించారు. తొలి సగంలో మొదటి అరగంట.. రెండో సగంలో చివరి అగరంట.. ఈ సినిమాకి ప్రాణం పోశాయి. ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం కట్టిపడేస్తాయి. చాలా సందర్భాల్లో.. మనం అడవిలోనో, అడవి పక్కనో ఉన్నట్టు అనిపిస్తుంది. గ్రాఫిక్స్ పనితనం ఆకట్టుకోవడంతో చాలా సన్నివేశాలు సహజంగా వచ్చాయి. యాక్షన్ ప్రియులకు, ఓ కొత్త నేపథ్యం కోరుకొనే ప్రేక్షకులకు తప్పకుండా మన్యం పులి నచ్చుతుంది.
* నటీనటుల ప్రతిభ
మోహన్ లాల్ వన్ మ్యాన్ షో.. మన్యం పులి. ఈ వయసులోనూ చాలా చలాకీగా నటించాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో మోహన్ లాల్ నటన అందరికీ నచ్చుతుంది. మోహన్ లాల్‌తో పోలిస్తే మిగిలిన వాళ్లందరి నటన తేలిపోతుంది. కమలిని ముఖర్జీ మరీ ఓవర్ చేసింది. ఇప్పటి వరకూ చూసిన కమలిని వేరు.. ఈ సినిమాలో కనిపించిన కమలినీ వేరు. పైగా తనకు వేసిన మేకప్ కూడా వరస్ట్ గా ఉంది. నమిత ది మాస్‌ని ఎట్రాక్ట్ చేసే పాత్రే. ప్రతినాయకుడిగా జగపతి బాబు తన పాత్ర పరిధి మేర నటించాడు. మిగిలినవాళ్లంతా జస్ట్ ఓకే.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఈసినిమా చాలా బాగుంది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ. ఈ సినిమానీ, అందులోని సీన్స్ ని పదే పదే చూడాలనిపిస్తుంది. దానికి కారణం.. ఫొటోగ్రఫీనే. లొకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు బాగున్నాయి. మాస్‌కి బాగా నచ్చుతాయి. రెగ్యులర్ సినిమాలో యాక్షన్ సీన్ల కంటే చాలా డిఫరెంట్‌గా కంపోజ్ చేశాడు. నేపథ్య సంగీతం కూడా రక్తికట్టిస్తుంది. అయితే పాటలు అంత వినసొంపుగా లేవు. మాంటేజ్ గీతాలే అయినా కథా క్రమానికి పూర్తిగా అడ్డు తగిలాయి. తొలి అరగంట... చివరి అరగంట ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. వాటి కోసం ఆ మధ్యలో ఉన్న లాగ్ ని భరించాల్సిందే.
* చివరిగా : విజువల్ + మోహన్ లాల్ నటన + యాక్షన్ సీన్స్... వీటి కోసం మాన్యం పులి చూడొచ్చు.
* రేటింగ్: 2.75