ఆల్ టైమ్ క్లాసిక్ `మల్లీశ్వరి`కి 70 వసంతాలు!
on Dec 20, 2021

నటరత్న నందమూరి తారక రామారావుకి 1951 సంవత్సరం ఎంతో ప్రత్యేకం. అప్పుడప్పుడే కథానాయకుడిగా తనదైన బాణీ పలికిస్తూ నటుడిగా ముందుకు సాగుతున్న ఎన్టీఆర్ కి.. ఆ ఏడాది ఆరంభంలో విడుదలైన `పాతాళ భైరవి` సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకువస్తే.. చివరలో తెరపైకి వచ్చిన `మల్లీశ్వరి` నటుడిగా మరింత గుర్తింపుని తీసుకువచ్చింది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి టైటిల్ రోల్ లో నటించిన సంగీతసాహిత్యభరిత ప్రణయదృశ్యకావ్యం `మల్లీశ్వరి`ని దిగ్గజ దర్శకుడు బి.ఎన్. రెడ్డి తనే స్వయంగా నిర్మించి రూపొందించారు. ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, స్క్రీన్ ప్లే సమకూర్చారు.
శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి నేపథ్యంతో తెరకెక్కిన ఈ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా.. బావ, మరదలు అయిన నాగరాజు (ఎన్టీఆర్), మల్లీశ్వరి (భానుమతి) పాత్రల చుట్టూ తిరుగుతుంది. పలు మలుపుల మధ్య సాగే వారి ప్రేమకథ ఎలా సుఖాంతం అయ్యిందన్నదే ఈ చిత్రం. ఇందులో శ్రీ కృష్ణదేవరాయలుగా శ్రీవాత్సవ, తిరుమల దేవిగా కుమారి, అల్లసాని పెద్దనగా న్యాయపతి రాఘవరావు నటించగా టీజీ కమలా దేవీ, రుష్యేంద్రమణి, సురభి కమలా బాయి, బేబి మల్లిక, మాస్టర్ వెంకట రమణ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
దిగ్గజ స్వరకర్త ఎస్. రాజేశ్వరరావు బాణీలు అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``మనసున మల్లెల``, ``కోతి బావకి పెళ్ళంట``, ``పిలిచినా బిగువటరా``, ``ఆకాశ వీధిలో``, ``పరుగులు తీయాలి``.. వంటి జనరంజక గీతాలు ఈ సినిమాలోనివే. ఇక `ఫిదా`లోని ``హే పిల్లగాడా`` పాట ``పరుగులు తీయాలి`` గీతం స్ఫూర్తితో రూపొందినదే కావడం విశేషం. 1951 డిసెంబర్ 20న విడుదలై జననీరాజనాలు అందుకున్న `మల్లీశ్వరి`.. నేటితో 70 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



