`మన్మథుడు`గా నాగ్ మెస్మరైజ్ చేసి నేటికి 19 ఏళ్ళు!
on Dec 20, 2021

తెలుగునాట రొమాంటిక్ డ్రామాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. మరీముఖ్యంగా.. తమ హోమ్ బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో తను స్వయంగా నిర్మించిన ఈ తరహా చిత్రాలు నాగ్ కి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. వాటిలో.. `మన్మథుడు` సినిమా ఒకటి. ఇందులో ప్రేమికుడుగా, స్త్రీ ద్వేషిగా రెండు కోణాలున్న అభిరామ్ పాత్రలో ఒదిగిపోయారు నాగార్జున. అంతేకాదు.. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేసి సినిమా టైటిల్ కి న్యాయం చేకూర్చారు. కె. విజయ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, సంభాషణలు సమకూర్చారు. నాగ్ కి జోడీగా సోనాలి బింద్రే, అన్షు నటించిన ఈ సినిమాలో చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, సుధ, బాలయ్య, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం, సునీల్, రంగనాథ్, జయప్రకాశ్ రెడ్డి, అనంత్, స్వప్న మాధురి, అనితా చౌదరి, శివ పార్వతి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. రేఖ, కీర్తి చావ్లా ఓ పాటలో తళుక్కున మెరిశారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువనచంద్ర సాహిత్యమందించారు. ``నా మనసునే``, ``గుండెల్లో ఏముందో``, ``డోన్ట్ మ్యారీ``, ``అందమైన భామలు``, ``నేను నేనుగా లేనే``, ``చెలియా చెలియా``.. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. `ఉత్తమ చిత్రం` విభాగంలో `నంది` పురస్కారం అందుకున్న `మన్మథుడు`.. కన్నడంలో `ఐశ్వర్య` (దీపికా పదుకోణ్ తొలి సినిమా), బెంగాలీలో `ప్రియోతోమా` పేర్లతో 2006లో రీమేక్ అయింది. 2002 డిసెంబర్ 20న విడుదలై ప్రజాదరణ పొందిన `మన్మథుడు`.. నేటితో 19 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



