మహేష్‌బాబు సెంటిమెంట్ సంగతేంటి?
on Mar 7, 2019
'మహర్షి' మరోసారి వెనక్కి వెళ్ళాడు. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 25న కాకుండా... మే 9న విడుదల చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. 'మహర్షి' వాయిదా పడుతుందనే వార్త కొన్ని రోజులుగా ఫిలింనగర్‌లో వినపడుతోంది. అదే నిజమని తేలింది. చిత్రీకరణ సకాలంలో పూర్తవుతున్నా... ప్రేక్షకులకు నాణ్యమైన సినిమా అందించాలంటే నిర్మాణానంతర కార్యక్రమాలకు మరింత సమయం అవసరమని గ్రహించి సినిమాను వాయిదా వేశామని దిల్ రాజు చెప్పారు. తనతో పాటు చిత్ర నిర్మాతలలో మరొకరు అయిన అశ్వనీదత్‌కి మే నెల, మే 9వ తేదీ హిట్ సెంటిమెంట్ అని చెప్పారు. మే 9న 'జగదేకవీరుడు అతిలోక సుందరి', 'మహానటి' సినిమాలు విడుదల అయ్యాయి. అశ్వనీదత్‌కు రెండు సినిమాలు విజయాలు అందించాయి. అదే తేదీన 'మహర్షి' చిత్రాన్ని విడుదల చేయాలనుకోవడం యాదృశ్చికంగా జరిగిందని దిల్ రాజు అన్నారు. తాను నిర్మించిన 'ఆర్య', 'పరుగు', 'భద్ర' సినిమాలూ మే నెలలో విడుదలయ్యాయని చెప్పారు. ఆ సెంటిమెంట్ కూడా కలసి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే... మహేష్ బాబుకు మాత్రం ,మే నెల హిట్ సెంటిమెంట్ కాదు. మే నెలలో విడుదలైన మహేష్ సినిమాలు 'నాని', 'నిజం', 'బ్రహ్మోత్సవం' సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. నిర్మాతల హిట్ సెంటిమెంట్ గురించి ఆలోచించిన దిల్ రాజు.. హీరో డిజాస్టర్ సెంటిమెంట్ గురించి ఆలోచించలేదా? మహేష్ బాబు సెంటిమెంట్ సంగతేంటి? అని ఇండస్ట్రీలో డిస్కషన్.