ENGLISH | TELUGU  

రివ్యూ : ద్వార‌క‌

on Mar 3, 2017

దేవుడనే వాడు లేడని, మనిషికి మనిషే సాయం చేసుకోవాలని ఆస్తికత్వం చెబుతుంది. దేవుడు ఎక్కడో వుండడని సాయం చేసే మనిషిలోనే వుంటాడని తెలివైన వాళ్లు చెబుతారు. సాయం చేసేవాడినే దేవుడని నమ్ముతుంది ఆస్తికత్వం. ఈ మూడింటి నడుమ సాగే ఓ కుర్రాడి కథే ద్వారక. ఇలాంటి కథను, ఒక కుర్రాడి నేపథ్యంలో చెబుతూ, దేవుడు..నమ్మకం, వాటి ఆధారంగా సాగే వ్యాపారాల గురించి చర్చించే ప్రయత్నం చేసాడు కొత్త దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర. సినిమా పడికట్టు సూత్రాలకు కట్టుబడకుండా, కథ,కథనాలను వాటంతట వాటిని నడివనిస్తూనే, అందులోనే కాస్త వినోదం రాబట్టే ప్రయత్నం చేసాడు. ఇలా చేసిన ప్రయత్నం ఎలా వుందీ అన్నది చూద్దాం

* కథ

చిల్లర దొంగతనాలు చేస్తూ బతికేసే కుర్రాడు ఎర్రశీను (విజయ్ దేవరకొండ) అతగాడి ఓ లెఫ్ట్,రైటు ఇద్దరు కుర్రాళ్లు. ఇలాంటి కుర్రాడ్ని అనుకోకుండా దేవుడ్ని చేసేస్తాడు ఓ బిల్డర్. అతని అపార్ట్ మెంట్ లొ వున్న వాళ్లంతా అదే బాట పడతారు. దీంతో అమాంతం దేవుడైపోతాడు ఎర్రశీను. కానీ అక్కడే కథ అడ్డం తిరుగుతుంది. అతగాడు ప్రేమించిన అమ్మాయి (పూజ ఝవేరి) మనిషిగా మారితేనే పెళ్లి చేసుకుంటా అంటుంది. కానీ దేవుడిగా మారిని ఎర్రశీను మనిషిగా మారడం అంత సులువేం కాదు. ఎందుకంటే అతగాడిని అడ్డం పెట్టుకుని కోట్లు గడించాలనుకునే కొందరు అడుగు అడుగునా అడ్డం పడతారు. దీంతో చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.

* విశ్లేష‌ణ‌

సినిమాకు విజయ్ దేవరకొండ ఓ ప్లస్ పాయింట్. అతని అమాయకపు చూపులు, ఫేస్ కలిసి ఈ పాత్రకు అతను అలా సరిపోయాడు అనిపిస్తుంది. తొలి సగంలో అక్కడక్కడ తొంగి చూసే ఫన్ కూడా సినిమాకు కాస్త ప్లస్ అవుతుంది. అదే సమయంలో ఓ మంచి విషయాన్ని, ఒక విధంగా సామాజిక సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లే దర్శకుడి సిన్సియర్ ప్రయత్నం కూడా ప్రేక్షకులను కాస్త ఆలోచింపచేస్తుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ కథలోకి లీడ్ గా మాత్రమే ఉపయోగపడుతుంది. దీంతో మొత్తం ద్వితీయార్థం అంతా కథ, కథనాలతో నిండిపోయి, వినోదానికి ఎక్కడా చోటివ్వదు. దీంతో ద్వితీయార్థం అంతా భారంగా సాగుతుంది. పైగా విజయ్ దేవరకొండ నుంచి ప్రేక్షకులు ఏ వినోదాన్ని అయితే ఆశించి వస్తారో అది సినిమాలో కేవలం పది శాతం మాత్రమే కనిపిస్తుంది. అలా అని మాస్ హీరోయిజం వుందా అంటే అదీ లేదు. ఇదంతా ఎంచుకున్న కథ, దాన్ని నడిపించిన కథనం వల్ల వచ్చిన సమస్య.


దర్శకుడు చేసింది సిన్సియర్ ప్రయత్నం అనడంలో ఎక్కడా ఏ సందేహం అవసరం లేదు. తొలి ప్రయత్నం అయినా, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ కు చెందిన హీరో లభించినా కూడా వైవిధ్యమైన కథను నమ్మి, ఓ మంచి సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకురావాలని, దానిపై చర్చ సాగించాలని దర్శకుడు అనుకోవడం మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఎంత మంచి విషయమైనా కాస్తయినా వినోదం జోడించాలని, సినిమా ఆద్యంత అది అలా అలా అంతర్లీనంగా నడుస్తూనే  వుండాలన్నది ఇప్పటి ట్రెండ్ అని దర్శకుడు విస్మరించడం సినిమాకు పెద్ద మైనస్. పోనీ సబ్జెక్ట్ వినోదానికి తావివ్వనిదా అంటే అదీ కాదు. బోలెడు వినోదం పంచే అవకాశం వున్నదే. దర్శకుడు ఆ దిశగా కాస్త ప్లాన్ చేసాడు కానీ ఆ విద్యలో తన చాతుర్యం పండించలేకపోయాడు. అలా ప్లాన్ చేసిన సీన్లన్నీ అరకొరగా మిగిలిపోయాయి. నవ్వించాయా? అంటే నవ్వించినట్లు, లేదా అంటే లేదు అన్నట్లుగా అన్నమాట.

అదే ద్వితీయార్థానికి వచ్చేసరికి వినోదం అన్నది ఎక్కడా మచ్చుకు కూడా కనిపించలేదు. ఓ సరైన సామాజిక అంశాన్ని చర్చకు తీసుకు వచ్చే ప్రయత్నం కనిపించింది. కానీ అక్కడ ఓ పక్క క్రైమ్, మరో పక్క డిస్కషన్ నడుస్తుంటుంది. దాంతో కామన్ ఆడియన్స్ కు సమయం కాస్త భారంగా సాగుతుంది. చాలా సీన్లలో హీరోను సరిగ్గా వాడుకోవడంలో కూడా దర్శకుడు విఫలమయ్యాడు.  దీంతో సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత మంచి ప్రయత్నం చేసాడు కానీ, అని అర్ధోక్తిలో ఆగిపోవడం ప్రేక్షకుడి వుంతవుతుంది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

నటీనటలు అంతా బాగానే చేసారు. కానీ ప్రేక్షకులు ఆశించేది ఒకటి. వారి నుంచి దర్శకుడు రాబట్టినది మరొకటి. థర్టీ ఇయర్స్ పృధ్వీ అన్నా, విజయ్ దేవరకొండ అన్నా జనాలు ఫన్ ఆశిస్తారు. కానీ సినిమాలో అది అందించలేదు. మురళీశర్మకు మరోసారి మంచి పాత్ర దొరికింది. పూజ ఝవేరి ఓకె. షకలకశంకర్, సాయి, సుదర్శన్ ఒకె. సాంకేతికంగా సినిమా ఉన్నతంగానే వుంది. 

* సాంకేతిక వ‌ర్గం

శ్యామ్ కే నాయడు  సినిమాటోగ్రఫీ చాలా కలర్ పుల్ గా రిచ్ గా కనిపిస్తుంది. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం కాస్త లౌడ్ గా వుంది. ద్వితీయార్థంలో వచ్చే ఓ పాట బాగుంది. సంభాషణలు అక్కడక్కడ ఆలోచింపచేస్తాయి. దర్శకుడి తొలి ప్రయత్నం తడబాటు అన్నది ప్రథమార్థంలో అక్కడక్కడ కనిపిస్తుంది. ద్వితీయార్థంలో మాత్రం తేరుకుని బాగానే ముందుకెళ్లాడు.

* పంచ్ లైన్‌:   ఒక‌టి అనుకొంటే.. ఇంకోటి దొరికింది


* రేటింగ్‌: 2.0

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.