జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన 'కార్తికేయ 2'
on Aug 16, 2024
నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ 2' (Karthikeya 2) చిత్రం జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. 2022 ఏడాదికి గాను తాజాగా ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో.. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. (70th National Film Awards)
నిఖిల్, చందు మొండేటి కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'కార్తికేయ'కి సీక్వెల్ గా 'కార్తికేయ 2' రూపొందింది. మైథలాజికల్ టచ్ తెరకెక్కిన ఈ మూవీ.. 2022 ఆగష్టులో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొంది.. పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని సాధించింది. ద్వాపర యుగాన్ని, కలియుగాన్ని ముడిపెడుతూ.. కృష్ణ తత్వాన్ని తెలిపేలా రూపొందిన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం జాతీయ అవార్డుల్లోనూ సత్తా చాటి, ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన 'కార్తికేయ 2'లో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాల భైరవ సంగీతం అందించాడు.
Also Read