ఆ డైరెక్టర్ నా రక్తం కళ్లజూశాడు: హీరో నిఖిల్
on Nov 28, 2019
"సంతోష్ అనే అతను రాక్షస డైరెక్టర్. మనకి దెబ్బలు తగిలినా ఫర్వాలేదు, తను ఎలా షాట్ తీయాలనుకుంటాడో అలా తీసేదాకా ఊరుకోడు. అతని ఫాదర్ ఒక జర్నలిస్ట్. అందుకే అతని హృదయానికి బాగా దగ్గరైన సినిమా ఇది. ఒక సీన్‌లో నన్ను చెంపదెబ్బ కొడితే నేను కిందపడాలి. ఆ ఒక్క షాట్‌ను 36 సార్లు తీశాడు. నేను కిందపడి రక్తం కళ్లచూసేదాకా అతను వదల్లేదు" అని చెప్పాడు నిఖిల్. మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన 'అర్జున్ సురవరం'లో ఆయన హీరోగా నటించాడు. తమిళ ఒరిజినల్ ఫిల్మ్ 'కణిదన్'ను డైరెక్ట్ చేసిన టి. సంతోష్ ఈ సినిమాకూ దర్శకుడు. బి. మధు ('ఠాగూర్' మధు) ప్రెజెంట్ చేస్తోన్న ఈ సినిమా నవంబర్ 29 శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...
ఈ సినిమా విడుదలలో ఎందుకింత జాప్యం జరిగింది? కారణం ఎవరు?
ప్రతి సినిమానీ ఒక బేబీలా ఫీలవుతాం. ఎప్పుడైనా ఆ బేబీ డేంజర్‌లో ఉందంటే భయమేస్తుంది. భయంతో పాటు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే మే 1న రిలీజ్ అవ్వాల్సిన సినిమా అవకపోతే, ఐ ఫెల్ట్ వెరీ వెరీ శాడ్. ఏడ్చినంత పనయింది నాకు. చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిచాయి. చాలా స్ట్రగుల్ తర్వాత రిలీజ్ డేట్ దొరకడం అన్నది ఎంతో రిలీఫ్ నిచ్చింది. ఇప్పటిదాకా నేను చేసిన 17 మూవీస్‌కి ఎప్పుడూ ఇలా కాలేదు. ఆటంకాలన్నీ ఒక్కొక్కటీ తొలగుతూ వచ్చాయి. ఒక జర్నలిస్ట్ ఒక న్యూస్‌ను బయటపెట్టాలంటే ఎన్ని హర్డిల్స్ ఎదుర్కొంటాడో అన్ని హర్డిల్స్‌ని ఈ సినికాకి ఫేస్ చేశాం. మొదట ఈ సినిమాకి 'ముద్ర' అనే టైటిల్ పెడితే, దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సినిమాలో నన్ను జర్నలిస్ట్ కాదంటారు, ఫేక్ పర్సన్ అంటారు. అట్లాగే మా సినిమా టైటిల్ 'ముద్ర' కాదన్నారు. దాంతో 'అర్జున్ సురవరం' అని పేరు మార్చాం. నిజానికి మా కథకు 'ముద్ర' అనేది యాప్ట్ టైటిల్. తప్పనిసరిగా మార్చుకోవాల్సి వచ్చింది. అయితే మార్చిన టైటిల్‌కే ఎక్కువమంది కనెక్టవడం హ్యాపీ. అయినా కూడా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక సమస్యల వల్ల సినిమాలు ఆగుతాయి. మా సినిమా బిజినిస్ పర్ఫెక్టుగా అయిపోయి, బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులొచ్చినా కానీ, పక్కనుండే శక్తుల వల్ల మా సినిమా విడుదలలో ఇంత జాప్యం జరిగింది. ఒక తమిళ సినిమాకి ఎదురైన సమస్యని మా సినిమాతో లింక్ పెట్టారు.
ఈ సినిమాకి మీ నుంచి నిర్మాతలకు ఎలాంటి సహకారం అందించారు?
ఇదొక హానెస్ట్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ ఎంతిస్తే అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాను. తర్వాత అడగటం మానేశాను. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ప్రాఫిట్‌లో ఉండాలి. ఈ సినిమానికి ఇంతవరకు నా సగం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నా. సినిమా విడుదలై ప్రాఫిట్ వస్తే, నాక్కూడా పంచుతారనుకుంటున్నా. ఇంతదాకా ఏ సినిమాకీ నా రెమ్యూనరేషన్ తీసుకోకుండా లేను.
ఈ సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారు?
ఈ కథ జనాల్లోకి వెళ్లాలి. ఒక సోషల్ ఎవేర్‌నెస్ పాయింట్‌ను ఆసక్తికరంగా చెప్పిన సినిమా ఇది. చిరంజీవి గారు మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి 'ఎడ్యుటైన్‌మెంట్' అనే ఒక మాట చెప్పారు. అంటే.. ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా. ఈ సినిమా నాకొక స్పెషల్. ఎందుకంటే ఇంతదాకా ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చెయ్యలేదు. మీడియాలో ఉన్న తప్పుల్ని ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తూ, అందులోని పాజిటివ్ అంశాల్నే ఎక్కువగా చూపించాం. ప్రతి స్టూడెంట్ చదువు వెనుక ఒక అమ్మ కల ఉంటుంది, ఒక నాన్న కష్టం ఉంటుంది. ఒక స్టూడెంట్ చదువు పాడైతే, ఒక కుటుంబమే డిస్టర్బ్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫ్యూచర్. ఈ లైన్ మీద ఆధారపడి తీసిందే 'అర్జున్ సురవరం'. మా అమ్మానాన్నలుగా ప్రగతి గారు, నాగినీడు గారు నటించారు.
ఈ సినిమాని రవితేజ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది కదా. మీరెలా వచ్చారు?
ఈ సినిమాలో నేను, లావణ్యా త్రిపాఠి, వెన్నెల కిశోర్, సత్య.. ఒక టీమ్. ఈ నలుగురూ ఒక ప్రాబ్లెంలో పడి, దాన్నెలా సాల్వ్ చేస్తారనేదే ఈ సినిమా. ఈ సినిమాకి యంగ్ యాక్టర్ చేస్తేనే బాగుంటుంది. సూపర్ స్టారో, పెద్ద ఇమేజ్ ఉన్న స్టారో చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు.
సంతోష్ డైరెక్షన్ గురించి ఏం చెబుతారు?
సినిమాలో ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఈ మూవీలో నా పర్ఫార్మెన్స్ బాగుందని పేరొస్తే, ఆ క్రెడిట్ సంతోష్‌దే. షాట్ బాగా వచ్చేవరకు ఎన్ని టేకులైనా తీస్తుంటాడు. నిజం చెప్పాలంటే దానివల్ల బడ్జెట్ కొంచెం ఎక్కువైంది కూడా.
లావణ్యా త్రిపాఠితో పని చెయ్యడం ఎలా అనిపించింది?
తను ఈ సినిమా కోసం బాగా కష్టపడింది. ఈ సినిమాలో గ్లామర్ డాల్ లాగా కాకుండా పర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. 'అందాల రాక్షసి' తర్వాత తనకు మళ్లీ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ దొరికింది. సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా ప్రమోషన్స్‌కు రారు. తను ప్రమోషన్స్‌లో బాగా పార్టిసిపేట్ చేస్తోంది. ఈ సినిమాని తను కూడా నమ్మింది. అందంగా ఉండటం ఒక ఎత్తయితే, యాక్షన్ ప్లస్ స్టంట్స్ చేసింది. ఒక స్టంట్‌లో అయితే తల దాదాపు ఒక పిల్లర్‌కు తగిలేదే. జస్ట్ మిస్. అయినా ఆ అమ్మాయి భయపడలేదు. ఒక ఆర్టిస్టుగా తను ఇప్పటికే ప్రూవ్డ్. ఈ సినిమాతో తనకు మరింత పేరొస్తుంది.
దీన్ని ఫ్యామిలీ సినిమా అనుకోవచ్చా?
నేను 'హ్యాపీడేస్' సినిమా చేసేటప్పుడే, "నువ్వు గనుక ఫ్యామిలీస్‌తో కలిసి చూసే సినిమా చెయ్యకపోతే ఇంట్లోంచి వెళ్లిపో" అని మా అమ్మ చెప్పింది. ఆ మాటలు ఎప్పుడూ గుర్తుంచుకుంటా. 'అర్జున్ సురవరం' అనేది ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా.
ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ముందు డాన్స్ చేయడం ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది?
నేను ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు సికిందరాబాద్ హరిహర కళాభవన్‌కు చిరంజీవి గారొచ్చారు. అక్కడే నేను స్టేజిపై పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అయితే వందలాది మంది పిల్లలు ముందుకు వెళ్లడం వల్ల ఆయన ఉన్నప్పుడు ప్రదర్శన ఇచ్చే అవకాశం నాకు కలగలేదు. కాస్ట్యూమ్స్ వేసుకొని అలాగే ఉండిపోయా. అప్పట్నుంచి మనసులో ఆయన ముందు ఎలాగైనా పర్ఫార్మ్ చెయ్యాలనే కోరిక ఉండిపోయింది. ఆయన ముందు డాన్స్ చేస్తే నన్ను హీరోగా తీసుకుంటారనే అమాయక అభిప్రాయం నాలో ఉండిపోయింది. అయితే ఆయన ముందు డాన్స్ చెయ్యాలన్న కోరిక మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తీరింది. ఐ డిడ్ మై బెస్ట్.
ఒరిజినల్‌ను మక్కీకి మక్కీ తీశారా? మార్పులేవైనా చేశారా?
ఇది తమిళ హిట్ ఫిల్మ్ 'కణిదన్'కు రీమేక్. అయితే ఒరిజినల్‌ను అలాగే తియ్యకుండా డైరెక్టర్ సంతోష్ చాలా మార్పులు చేసి, ఈ మూవీ రూపొందించాడు. ఆ సినిమా చాలా సీరియస్‌గా ఉంటుంది. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించాడు. స్క్రీన్‌ప్లే మార్చాడు. వెన్నెల కిశోర్, సత్య పాత్రలు అందులో ఉండవు. సెంట్రల్ పాయింట్‌ను, హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్‌ను తీసుకొని, మిగతా కథలో చాలా మార్పులు చేశాడు డైరెక్టర్. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్.
రీమేక్ చెయ్యాలని ఎందుకనుకున్నారు?
రీమేక్స్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి క్యారెక్టర్ డ్రివెన్ రీమేక్, ఇంకొకంటి ప్లాట్ డ్రివెన్ రీమేక్. 'కిరాక్ పార్టీ' అనేది క్యారెక్టర్ డ్రివెన్ రీమేక్. 'హ్యాపీడేస్' ఎక్కడ రీమేక్ చేసినా ఆడదు. అలాగే 'బెంగుళూర్ డేస్' ఎక్కడ రీమేక్ చేసినా ఆడదు. అవి క్యారెక్టర్ డ్రివెన్ రీమేక్స్. 'దృశ్యం', 'పోకిరి' లాంటివి ప్లాట్ డ్రివెన్ రీమేక్స్. అవి ఎక్కడ తీసినా హిట్టవుతాయి. అలాగే 'అర్జున్ సురవరం' అనేది ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్. మరి దీన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
రానాతో చెయ్యాలనుకున్న సినిమా చెయ్యలేకపోయానని ఇటీవల అన్నారు కదా. ఏ సినిమా?
డేట్స్ లేకపోవడం వల్ల రానాతో కలిసి చెయ్యాల్సిన 'హాథీ మేరే సాథీ' సినిమా చెయ్యలేకపోయాను. యానిమల్స్ అంటే నాకు చాలా ఇషటం. కానీ ఆ సినిమా మిస్సయ్యాను.
'హ్యాపీడేస్'తో మీకు లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ములతో టచ్‌లో ఉంటారా?
నేను టెన్ యియర్స్ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంలో శేఖర్ కమ్ముల వచ్చారు. నాకు చాలా క్లోజ్ పర్సన్. ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. ఆయన దృష్టంతా వర్క్ మీదే ఉంటుంది. ఆయనను డిస్టర్బ్ చెయ్యడం నచ్చదు కాబట్టి ఆయన దగ్గరకు అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుంటా. వెళ్లినప్పుడల్లా బాగా మాట్లాడుతుంటారు.
'కార్తికేయ 2' సెట్స్ పైకి ఎప్పుడెళ్తుంది?
'కార్తికేయ 2' మూవీ షూటింగ్ డిసెంబర్ 20 నుంచి జరుగుతుంది. నిజానికి నవంబర్‌లోనే మొదలవ్వాలి కానీ 'అర్జున్ సురవరం' ప్రమోషన్స్ కోసం డిసెంబర్‌కు పోస్ట్‌పోన్ చేశాం. 2020 మార్చి నుంచి విఐ ఆనంద్ డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ మూవీ చేస్తాను. అది ఫాంటసీ ఫిల్మ్. అది పూర్తవుతుండగానే హనుమాన్‌తో సినిమా చేస్తాను. అది రోబోటిక్స్ నేపథ్యంలో ఉంటుంది.
సీక్వెల్స్ చెయ్యాలని ఎందుకనుకున్నారు?
'రాకీ', 'రాంబో' తరహాలో మన స్థాయిలో చిన్నగా ఫ్రాంచైజీలుగా 'కార్తికేయ', 'స్వామి రారా' సినిమాల్ని ప్లాన్ చేస్తున్నాం. వాటికి ఆ వాల్యూ ఉంది. ఈజీగా ఓపెనింగ్స్ వస్తాయి. 'కార్తికేయ 2'ను ఇండియా, కంబోడియా, వియత్నాంలలో తీయబోతున్నాం.
- బుద్ధి యజ్ఞమూర్తి
Also Read