'కేజీయఫ్' తాతయ్య ప్రధాన పాత్రధారిగా 'ఒక Sextant కథ'
on Oct 20, 2022
'కేజీయఫ్' మూవీలో ఓ సన్నివేశంలో గోల్డ్ మైన్స్‌లో కిరాతకుల నుంచి ఓ వృద్ధుడిని హీరో యశ్ రక్షించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ వృద్ధునిగా నటించి, ఆకట్టుకుంది కృష్ణ జి. రావు. అప్పట్నుంచీ ఆయన కేజీఎఫ్ తాతయ్యగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రధారిగా కన్నడంలో రూపొందుతోన్న ఓ చిత్రాన్ని 'ఒక Sextant కథ' అనే టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. కేసరి ఫిలిం కాప్చర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కుమార్ ఎల్. దర్శకుడు. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు.
ట్రైలర్ ప్రకారం సినీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన నారాయణ అలియాస్ నానో నారాయణ 'కేజీఎఫ్' సినిమా తర్వాత చాలా పాపులర్ అవుతాడు. అతని భార్య అరుదైన వ్యాధి బారిన పడుతుంది. భార్యకి వచ్చిన వ్యాధిని నయం కావాలంటే 20 లక్షలు కావాలి. అతని దగ్గర 'విక్టోరియన్ సెక్స్టాంట్' అనే యాంటిక్ బైనాక్యులర్ ఒకటి వుంటుంది. దీని ద్వారా చూస్తే మనుషులు "నగ్నంగా" కనిపిస్తారు. దీనిని అమ్మి డబ్బు సంపాదించి అతని భార్యను ఎలా రక్షించడానేది కథాంశమని తెలుస్తోంది.
సినిమాలో మంచి కంటెంట్ ఉందనీ, కామెడీ, లవ్ , డ్రామా, ఎమోషన్ అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ తెలియజేస్తోంది. కృష్ణ జి. రావు నటన చాలా సహజంగా ఆకట్టుకునేలా ఉంది. రాజా శివశంకర్ కెమరా పనితనం ఆకట్టుకుంది. అరవ్ రిషిక్ నేపధ్య సంగీతం డీసెంట్ గా వుంది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు మేకర్స్. ప్రశాంత్ సిద్ది, అపూర్వ, అనంతు పద్మనాభ, కాక్రోచ్ సుధి, గిరీశ్ శివన్న, శ్యలేష్, కింగ్ మోహన్ తారాగణం.
Also Read