తాప్సీ టార్గెట్ 'అర్జున్ రెడ్డి' కాదట!
on Feb 4, 2020
'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలై దాదాపు రెండున్నర ఏళ్ళు. ఈ సినిమా హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' విడుదలై భారీ విజయం సాధించింది. థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది. అయితే... ఇప్పటికీ బాలీవుడ్ క్రిటిక్స్ 'అర్జున్ రెడ్డి' అలియాస్ 'కబీర్ సింగ్'ను మరిచిపోలేకపోతున్నారు. క్రిటిక్స్ మాత్రమే కాదు... అక్కడి స్టార్స్ కూడా! ఆ సినిమాలో హీరోయిన్ చెంపమీద హీరో చాచి పెట్టి కొట్టే సన్నివేశం పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే. అమ్మాయిని అలా ఎలా కొడతారు? అంటూ బాలీవుడ్ ఫెమినిస్టులు దర్శకుడిపై విరుచుకుపడ్డారు. సందీప్ రెడ్డి వంగా కూడా అంతే ఘాటుగా సమాధానాలు ఇచ్చాడు. ప్రేమలో చేయి చేసుకోవడము కామనే అని అతడు చెప్పాడు. అదంతా గతం!
వర్తమానానికి వస్తే... తాప్సీ నటించిన తాజా హిందీ సినిమా 'తప్పడ్' ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. భర్త తనపై చెయ్యి చేసుకున్నాడని... చెంప దెబ్బ కొట్టాడని అతని నుంచి విడిపోవడానికి సిద్ధమైన ఓ భార్య కథే 'తప్పడ్' సినిమా. బాలీవుడ్ క్రిటిక్స్ 'అర్జున్ రెడ్డి'కి, ఈ సినిమాకి ముడిపెట్టారు. 'అర్జున్ రెడ్డి'లో ఆ సన్నివేశాన్ని టార్గెట్ చేస్తూ 'తప్పడ్' తెరకెక్కించారేమోనని సందేహాలు వ్యక్తం చేశారు. అదే విషయం తాప్సీని అడిగారు. "మేం 'కబీర్ సింగ్'('అర్జున్ రెడ్డి')ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీయలేదు. ఆ సినిమా విడుదల అయ్యేటప్పటికి ఈ కథ సిద్ధమైంది. ఆ ఒక్క సినిమాలోనే కాదు... చాలా సినిమాల్లో మహిళలను కొట్టే సన్నివేశాలు ఉన్నాయి. 'కబీర్ సింగ్' ఈ మధ్య వచ్చింది కాబట్టి అది ఎక్కువ మందికి గుర్తుంది" అని తాప్సీ సమాధానమిచ్చారు.
Also Read