సుకుమార్ సినిమాకు పెద్ద ప్లాన్ వేసిన అల్లు అర్జున్
on Feb 4, 2020
పాన్ ఇండియా... పాన్ ఇండియా... పాన్ ఇండియా... ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్స్ అందరూ జపిస్తున్న మంత్రం ఇది. 'బాహుబలి', 'కే జి ఎఫ్' సినిమాల తర్వాత సౌత్ ఇండియన్ స్టార్స్ లో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. కథా కథనాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే... హిందీతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. 'పహిల్వాన్' చిత్రాన్ని కన్నడ స్టార్ హీరో సుదీప్ హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. 'మామాంగం' చిత్రాన్ని మమ్ముట్టి అలాగే విడుదల చేశాడు. 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని విజయ్ దేవరకొండ ఇతర భాషలకు తీసుకువెళ్ళాడు. సుకుమార్ సినిమాకు అల్లు అర్జున్ ఇటువంటి పెద్ద ప్లాన్ వేస్తున్నాడు.
తెలుగులో 'అల... వైకుంఠపుములో' సినిమాతో అల్లు అర్జున్ కు వందకోట్ల మార్కెట్ ఏర్పడింది. మలయాళంలో ఎప్పటినుంచో అతడికి మంచి క్రేజ్ ఉంది. కన్నడలో మెగా హీరోలకు మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు తమిళం, హిందీ భాషలపై అల్లు అర్జున్ దృష్టి సారించాడు. సుకుమార్ దర్శకత్వంలో అతడు నటిస్తున్న తాజా చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. నిజానికి, 'అల... వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలోనూ డబ్బింగ్ చేసి విడుదల చేయాలనుకున్నారట. అది ఫక్తు తెలుగు సినిమా కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. "నా నెక్స్ట్ సినిమాను మల్టిపుల్ లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అని అల్లు అర్జున్ బాలీవుడ్ మీడియాతో చెప్పాడు.