బ్లేడ్బాబు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేడు!
on May 18, 2020
బండ్ల గణేష్ బ్యాక్ టు సోషల్ మీడియా అండ్ మీడియా. నిర్మాతగా సినిమాలు తీసినప్పుడు ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వ్యూలలో తన మాటలతో ఏ విధంగా అయితే ఎంటర్టైన్ చేశారో, మళ్లీ అదే విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. మహేష్ బాబును హాలీవుడ్ సూపర్‌స్టార్ అంటూ పొగిడిన ఆయన, యధావిధిగా పవన్ కళ్యాణ్ తన దేవుడు, గుండెల్లో ఉంటాడని ఆయన చెబుతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మీద అయితే ఒక స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
'గబ్బర్ సింగ్' విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా హరీష్ శంకర్ చేసిన ట్వీట్లో బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. దాంతో ఒక ఇంటర్వ్యూలో హరీష్ మీద గణేష్ విమర్శలు చేశారు. హరీష్ ఎక్కడో ఏదో అన్నారు. ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇకపై హరీష్ శంకర్ తో సినిమాలు తీయనని బండ్ల గణేష్ చెప్పారు. ఇప్పుడు ఈ వివాదంలోకి నిర్మాత పీవీపీ వచ్చారు. గతంలో ఆయన, బండ్ల గణేష్ గొడవ పడ్డారు. అందువల్ల, సీన్ లోకి పీవీపీ వచ్చారన్నమాట.
"హరీష్ శంకర్... బ్లడ్ బాబు నీతో సినిమా తీయడట. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేడు. నీకు ఏమో నేనే కాక, డజన్ల మంది నిర్మాతలు 'మిరపకాయ'ను మించి, 'దువ్వాడ జగన్నాథమ్'ను దాటించే సినిమా తీయడానికి రెడీగా ఉన్నాం" అని పీవీపీ ట్వీట్ చేశారు. ఆయన హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. "మీ 'భాష, భావం' రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి 'ఫైటే' అక్కర్లేదు. 'ట్వీటే' చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం" అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.