'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. విశ్వక్ సేన్ ఊర మాస్ అవతార్
on Jul 31, 2023
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 11వ సినిమాని కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'రౌడీ ఫెలో', 'చల్ మోహన రంగా' తర్వాత చైతన్య దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, గ్లింప్స్ ని విడుదల చేశారు.
అనౌన్స్ మెంట్ వీడియో వచ్చినప్పుడు ఇది గోదావరి నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమని అర్థమైంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక గ్లింప్స్ "మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం" అంటూ విశ్వక్ సేన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైంది. విశ్వక్ సేన్ లుంగీ కట్టుకొని ఊర మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. రాత్రిపూట లారీల్లో అక్రమంగా సరకు తరలించడం, గోదావరి తీరం, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన గ్లింప్స్ మెప్పిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతోన్న పీరియాడిక్ ఫిల్మ్ అని తెలుస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. నేహాశెట్టి, అంజలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
