గేమ్ ఓవర్ మూవీ రివ్యూ
on Jun 14, 2019
నటీనటులు: తాప్సీ, వినోదినీ వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, సంచనా నటరాజన్, రమ్య సుబ్రమణియన్ తదితరులు
నిర్మాణ సంస్థ: వైనాట్ స్టూడియోస్
మాటలు: వెంకట్ కాచర్ల
ఛాయాగ్రహణం: వసంత్
సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
నిర్మాత: ఎస్. శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్
విడుదల తేదీ: జూన్ 14, 2019
గ్లామర్ డాల్ ఇమేజ్ నుంచి బయటకొచ్చిన తాప్సీ కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలను చేయడం ప్రారంభించి చాలా రోజులైంది. హిందీలో 'పింక్', 'నామ్ షబానా', 'బద్లా', తెలుగులో 'ఆనందో బ్రహ్మ', 'నీవెవరో' సినిమాలతో కొత్త తరహా కథలకు, నటనకు ఆస్కారమున్న పాత్రలకు ఆమె ఓటు వేశారు. తాప్సీ సినిమా కొత్తగా ఉంటుందని ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే ఓ నమ్మకం ఏర్పడుతోంది. మరి, 'గేమ్ ఓవర్' ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా ఉందా? లేదా? సినిమా ఎలా ఉంది?
కథ:
స్వప్న (తాప్సీ) ఓ వీడియో గేమ్ డిజైనర్. మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురవడంతో నగరానికి దూరంగా ఒక ఫార్మ్ హౌస్‌లో ఉంటుంది. పనిమనిషి కమలమ్మ (వినోదినీ వైద్యనాథన్) ఆమె పనులు చేసి పెడుతుంది. ఏడాది క్రితం వేయించుకున్న టాటూ వల్ల తనకు సమస్యలు వస్తున్నాయని స్వప్న భావిస్తుంది. ఆత్మహత్యా ప్రయత్నం చేయగా... రెండు కాళ్ళు పోతాయి. తర్వాత ఏం జరిగింది? స్వప్న టాటూకి, కొందరు మృగాళ్ల చేతిలో కిరాతకంగా చంపబడిన అమృత (సంచనా నటరాజన్)కి సంబంధం ఏమిటి? స్వప్నను అమృత ఆత్మ ఎలా కాపాడింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ:
సినిమా కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే బాగున్నాయి. కానీ, సన్నివేశాలను తీసిన విధానమే మెప్పించదు. కథలో థ్రిల్ చేయడానికి కావలసినన్ని మూమెంట్స్ ఉన్నాయి. థ్రిల్ సంగతి పక్కన పెడితే... ప్రేక్షకుల్లో కథపై ఆసక్తి సన్నగిల్లేలా మరీ నిదానంగా సన్నివేశాలు సాగాయి. ఫస్టాఫ్ అయితే చాలా స్లోగా నడిచింది. సెకండాఫ్ పర్వాలేదు. మరణించినవారి గుర్తుగా అస్థికలతో టాటూ వేయించుకోవడం, లైంగిక వేధింపులు వంటి అంశాలతో హారర్ & పారానార్మల్ థ్రిల్లర్‌గా 'గేమ్ ఓవర్'ను తెరకెక్కించాలని దర్శకుడు అశ్విన్ శరవణన్ ప్రయత్నించాడు. మంచి కథ రాసుకున్నప్పటికీ.... తెరపైకి సరిగా తీసుకురావడంలో విఫలమయ్యాడు. కథను సరిగా చెప్పలేక ప్రేక్షకులను కన్‌ఫ్యూజన్ చేశాడు. రోన్ ఏతాన్ యోహాన్ చక్కటి నేపథ్య సంగీతం అందించడంతో కొన్ని సన్నివేశాలు నిలబడ్డాయి.
ప్లస్ పాయింట్స్:
తాప్సీ నటన
నేపథ్య సంగీతం
సినిమా కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే
మైనస్ పాయింట్స్:
దర్శకత్వం
నత్తనడకను సాగిన సన్నివేశాలు
నటీనటుల పనితీరు:
నటిగా తాప్సీకి ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. వీల్ ఛైర్‌లో కూర్చుని ఎటు కదలకుండా ఎమోషన్స్ పలికించడం కష్టతరమే. తాప్సీ బాగా చేశారు. పనిమనిషి పాత్రలో వినోదినీ వైద్యనాథన్ సహజ నటనతో ఆకట్టుకున్నారు. అనీష్ కురువిల్లా, రమ్య, సంచనా నటరాజన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
కథ కొత్తగా ఉన్నప్పటికీ... తాప్సీ బాగా నటించినప్పటికీ... రెండు గంటలు థియేటర్లో కూర్చోవడం కష్టమే. దర్శకుడి రాత బాగున్నప్పటికీ... తీసిన విధానం ఆకట్టుకునేలా లేదు.
రేటింగ్: 1.5/5
Also Read