కళ్యాణ్‌రామ్ నుండి 'దిల్'రాజు దగ్గరకు...
on May 5, 2020
'ఉయ్యాలా జంపాల'తో విరించి వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. హీరోగా రాజ్‌తరుణ్‌కీ తొలి సినిమా అది. 'ఉయ్యాలా జంపాలా' తర్వాత రాజ్ తరుణ్ పది సినిమాలు చేశారు. విరించి వర్మ మూడో సినిమాలు పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తొలి సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా అతడు 'మజ్ను' చేశారు. దర్శకుడిగా రెండు సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ, మూడో సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎందుకో ఓ పట్టాన ఓకే కాలేదు.
'మజ్ను' తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నుండి విరించి వర్మకు కబురొచ్చింది. కథ చెప్పాడు. సినిమా ఓకే అయింది. ముహూర్త కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఎందుకో షూటింగుకు వెళ్లకముందు సినిమా ఆగింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ నుండి దిల్ రాజు దగ్గరకు వచ్చారు విరించి వర్మ. అవును... దిల్ రాజు నుండి ఆయనకు పిలుపు వచ్చిందని సమాచారం. బీవీఎస్ రవి రాసిన కథకు మార్పులు, చేర్పులు చేయమని విరించి వర్మకు దిల్ రాజు చెప్పారట. ప్రస్తుతానికి హీరో ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. కథ ఫైనలైజ్ అయ్యేలోపు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.