‘మా’లో ముసలంపై క్లారిటీ...
on Sep 11, 2019
.
ఎన్నికలకు ముందు ఒక్కటిగా ఆర్టిస్టుల గడప గడపకూ వెళ్లి తమకు ఓటు వేయమని వీకే నరేశ్, హీరో రాజశేఖర్, జీవిత దంపతులు కోరారు. శివాజీ రాజా ప్యానల్‌పై గెలిచారు. నరేశ్ ‘మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదట్లో అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపించింది. కానీ, ‘మా’లో ముసలం మొదలైందని వార్తలొచ్చాయి. నరేశ్‌కీ, రాజశేఖర్‌కీ మధ్య గోడవలు జరిగాయని వాటి సారాంశం. నరేశ్ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ... ఆయనకు రాజశేఖర్ నేతృత్వంలో కొందరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు షోకాజ్ నోటీస్ ఇచ్చారనీ అన్నారు. ప్రస్తుతం రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నరేశ్‌కి వ్యతిరేకంగా, వీరికి మద్దతుగా ‘మా’లో కొందరు సమావేశం అయ్యారని వచ్చిన వార్తలను ‘మా’ ఖండించింది. ‘మా’ వెల్‌ఫేర్‌కి సంబంధించి అత్యవసరంగా తీసుకోవలసిన నిర్ణయాలపై మంగళవారం సమావేశంలో చర్చ జరిగిందని ‘మా’ కార్యనిర్వాహక వర్గం ఒక ప్రకటనలో తెలిపింది. నిప్పు లేకుండా పొగ వచ్చిందంటారా? ఎందుకంటే... ఓ అసోసియేషన్ అన్నాక చాలా సమస్యలు ఉంటాయనీ, అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందనీ అదే ప్రకటనలో తెలిపారు. ఆ సమస్యలు ఏమిటో?