‘అన్నపూరణి’ మూవీ రివ్యూ
on Jan 2, 2024
మూవీ : అన్నపూరణి
నటీనటులు : నయనతార, సత్యరాజ్, జై తదితరులు
డైలాగ్స్: అరుళ్ శక్తి మురుగన్
ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్
మ్యూజిక్: తమన్ ఎస్
నిర్మాతలు: జతిన్ సేతి, ఆర్. రవీంద్రన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నీలేష్ కృష్ణ
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
హీరోయిన్ ప్రాధాన్యమున్న పాత్రలతో నయనతార ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా తమిళంలో విడుదలైన 'అన్నపూరణి' ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వర్షన్ అందుబాటులో ఉంది. సత్యరాజ్, జై ఇతర పాత్రలతో ఉన్న ఈ మూవీ కథేంటో ఓ సారి చూసేద్దాం...
కథ:
తమిళనాడులోని ఒక ప్రాంతంలో రంగనాథుడికి సేవలు చేస్తున్న రంగరాజన్ కి అన్నపూర్ణి అనే కూతురు ఉంటుంది. వాళ్ళ నాన్న రంగరాజన్ దేవుడికి నైవేద్యం చేస్తుండటం, అది తనకి ఇష్టమవుతుంది. వంట నేర్చుకోవాలని చిన్నతనం నుండి బలంగా కోరుకుంటుంది. ఆ తర్వాత ఒక వయసు వచ్చాక చెఫ్ అవుతానని వాళ్ళ నాన్న రంగరాజన్ కి అన్నపూర్ణి చెప్తుంది. కానీ అతను ససేమిరా ఒప్పుకోడు. ఎంబీఏ చేయమని లేదంటే ఇంకేదైనా కోర్స్ చేయి కానీ చెఫ్ వద్దని అన్నపూర్ణితో వాళ్ళ నాన్న రంగరాజన్ చెప్తాడు. అయితే స్నేహితుల సలహా మేరకు చెఫ్, ఎంబీఏ రెండు కోర్సులు ఉన్న కాలేజీలో జాయిన్ అయిన అన్నపూర్ణి.. వాళ్ళ నాన్నకి తెలియకుండా చెఫ్ కోర్స్ చదువుతుంటుంది. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న నిజం తెలుసుకొని చదువు మానేయమని, పెళ్ళి సంబంధం తీసుకొస్తాడు. మరి అన్నపూర్ణి వాళ్ళ నాన్న తెచ్చిన పెళ్ళి సంబంధం చేసుకుందా? తన చెఫ్ కలని నెరవేర్చుకుందా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
తమిళనాడులోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి మాంసాహార వంటలు చేసే ఓ హోటల్ లో ఛెఫ్ గా జాయిన్ అవ్వాలనుకుంటుంది. మరి ఆ అమ్మాయి తన కలకోసం ఏం చేసింది? తనని ప్రోత్సాహించినవారెవరు లాంటి ఆసక్తికరమైన విషయాలతో చివరి వరకు ఉత్కంఠని నింపడంలో దర్శకుడు నీలేష్ కృష్ణ సక్సెస్ అయ్యాడు. కథ ప్రథమార్ధంలో కాస్త స్లో సీన్లు ఉన్నా అవన్నీ కథని ప్రేక్షకుడికి అర్థం చేయాలనే ఇంటెన్స్ తో తీసినట్టు తెలిసింది. అన్నపూర్ణి పాత్రని డీసెంట్ గా చూపించారు మేకర్స్. కథ ఇంటర్వెల్ తర్వాత వేగం పుంజుకుంటుంది.
ఇద్దరు చెఫ్ ల మధ్య జరిగే పోటీని రణరంగంలో ఇద్దరు శత్రువుల మధ్య జరిగే యుద్ధంలా దర్శకుడు తీర్చిదిద్దారు. ఆ సీన్లలో వచ్చే బీజిఎమ్ ఆకట్టుకుంది. ప్రతీ కథలో ఓ లక్ష్యం వైపుగా హీరో గానీ హీరోయిన్ కానీ వెళ్తుంటారు. అయితే ఈ మూవీలో తనకు లక్ష్యాన్ని చేరువ చేయడానికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లలో లాజిక్ మిస్ అవుతుంది. టేస్ట్ చూడకుండా వంట రుచిని గెస్ చేసి చెప్పడం జనాలకి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.
బిర్యానీ వంటని సంప్రదాయంగా చెప్పడం కొందరికి కాస్త అతిగా అనిపించొచ్చు. ఎందుకంటే కొందరు ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి అది వారికి అంతగా నచ్చదు. ఇక బిర్యానీ లవర్స్, వంటలని ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక ఫీస్ట్. సత్యరాజ్ కొడుకు పాత్రలో చేసిన అశ్విన్, అన్నపూర్ణిల మధ్య జరిగే వంటల పోటీ సీన్లు ఒక ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేసాయి. చివరి ముప్ఫై నిమిషాల సినిమా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. నిడివి కాస్త ఇబ్బందిగా ఉన్నా సినిమాలో ఎలాంటి అశ్లీల పదజాలం గానీ అశ్లీల సీన్లు కానీ లేవు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఫ్యామిలీ డ్రామా ఈ 'అన్నపూరణి' నిలిచిందనే చెప్పాలి.
ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ బాగుంది. సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతీ సీన్ ని అందంగా మలిచారు. తమన్ ఎస్ అందించిన బిజిఎమ్ క్లైమాక్స్ లో ప్రేక్షకులకి ఒక ఇంటెన్స్ ఫీల్ ని క్రియేట్ చేస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
చెఫ్ ఆనంద్ సుందరరాజన్ గా సత్యరాజ్ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. అన్నపూర్ణిగా నయనతార ఒదిగిపోయింది. చెఫ్ సుందరరాజన్(సత్యరాజ్) కుమారుడి పాత్రలో అశ్విన్ సుందరరాజన్ ఆకట్టుకున్నాడు. ఫర్హాన్ పాత్రలో జై ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్ నిడివి కాస్తే అయిన సినిమాకి కీలకంగా నిలిచాడు. ఇక మిగిలిన పాత్రలు తమ పాత్రకు తగ్గట్టుగా చేసి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ఓ ఆడపిల్ల కలని నెరవేర్చుకోవడానికి ఏం చేసిందనే థీమ్ తో తీసిన ఈ మూవీని కుటుంబంతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు.
రేటింగ్ : 2.5 /5
✍️. దాసరి మల్లేశ్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
