ఆనందో బ్రహ్మ సినిమా రివ్యూ
on Aug 18, 2017
సినిమా: ఆనందో బ్రహ్మ
తారాగణం: తాప్సీ, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేశ్...
దర్శకత్వం: మహి.వి.రాఘవ
నిర్మాతలు: విజయ్ చీళ్ల, శశి దేవిరెడ్డి
80ల్లో ఓ సీజన్ అంతా హారర్ సినిమాలే నడిచాయ్. కాళరాత్రి, నిశిరాత్రి, క్షణ క్షణం భయం భయం, ఇంటినంబర్ 13, కాష్మోరా, అలాగే... హిందీలో విరానా, పురాణామందిర్, దహషత్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ టైమ్ లో చాలా వచ్చాయ్. ఓ విధంగా హారర్ సినిమాలకు 80వ దశకం స్వర్ణయుగం అని చెప్పాలి. తర్వాత ఆ తరహా సినిమాలు రావడం బాగా తగ్గింది. మధ్యలో రామ్ గోపాల్ వర్మ మాత్రం అప్పుడప్పుడు రాత్రి, దెయ్యం.. అంటూ కొన్ని హారర్ సినిమాలు తీశాడు. అయితే... అదేం ట్రెండ్ గా మారలేదు.
అయితే... ఏ ముహూర్తాన లారెన్స్ ‘కాంచన’తీశాడో కానీ... అదిప్పుడు ట్రెండయ్యి కూర్చుంది. ‘కాంచన’ ట్రెండ్ సెట్టర్ అవ్వడానికి లారెన్స్ చేసిన చిన్న మేజిక్కే కారణం.. ఆ మేజిక్ ఏంటంటే... ‘భయంతో పాటు పగలబడి నవ్వించడం’. అంతకు ముందు ఎవరూ చేయని ప్రయోగం ఇది. ఎదుటివాళ్లు భయపడుతుంటే చూసేవాళ్లకు కామెడీగానే ఉంటుంది. ఆ పాయింట్ నే తీసుకొని కథలు తయారు చేశాడు లారెన్స్.. మొదట‘ముని’ తీశాడు. జనాలు ‘ఓకే’ అన్నారు. ఆ తర్వాత ‘కాంచన’ తీశాడు. అదొక ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ప్రేమకథాచిత్రమ్, గంగ, రాజుగారి గది, గీతాంజలి, శివలింగ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. తదితర విజయాలు ఆ దారిలో వచ్చినవే. ఇప్పుడు తాజాగా ‘ఆనందో బ్రహ్మ’.
ప్రేక్షకులను ఈజీగా బుట్టలో వేసుకోవాలంటే.. కామెడీ హారర్ ని మించిన దారి మరొకటి లేదు. పైగా బడ్జెట్ కూడా తక్కువ. అందుకే... చిన్న నిర్మాతలందరూ దాదాపు ఈ దారిలోనే వెళుతున్నారు. ప్యాషన్ తో తీసి విజయాలు కూడా అందుకుంటున్నారు. ఈ శుక్రవారం విడుదలైన కామెడీ హారర్ ‘ఆనందో బ్రహ్మ’ కూడా ఆ తరహా చిత్రమే. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? ప్రేక్షకులను నవ్వించిందా? భయపెట్టిందా? లేక బాధ పెట్టిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే... ముందు ఈ సినిమా కథ తెలుసుకోండి.
కథ:
ఓ ఇల్లు అమ్మకానికొస్తుంది. కానీ ఆ ఇల్లు కొనడానికి ఎవరూ ముందుకు రారు. కారణం... ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ్ అనే వార్త ఊరంతా వ్యాపించడమే. ఆ ఇంట్లో నాలుగు రోజులుండి... దెయ్యాలున్నాయన్న అపోహను పోగొడతామంటూ.. నలుగురు కుర్రాళ్లు వస్తారు. అలా చేస్తే... ఇల్లు అమ్మగా వచ్చిన దాంట్లోంచి పదో వంతు ఇస్తానంటాడు ఓనర్. ఓ ఫైన్ డే... ఆ నలుగురు కుర్రాళ్లూ ఆ ఇంట్లోకి ఎంటరవుతారు. అసలు ఆ ఇంట్లో నిజంగా దెయ్యాలున్నాయా? ఆ కుర్రాళ్లు అంత సాహసం చేయడానికి కారణం ఏంటి? చివరకు ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
విశ్లేషణ:
కథ పాతదే. దాన్ని కొత్తగా చెబితే.. సినిమా హిట్. దర్శకుడు మహి వి.రాఘవ.. ఆ దిశగా విశ్వ ప్రయత్నం చేశాడు. కొంతవరకూ సక్సెస్ అయ్యాడు కూడా. అతని స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి బలం. తెరపై అనుకోని మేజిక్కులు చాలా చేశాడు. ఊహించని ట్విస్టులకు కూడా ఇందులో కొదవలేదు. ముఖ్యంగా కేరక్టర్లను డిజైన్ చేయడంలో దర్శకుని ప్రతిభ కనబడింది. ఇందులో ప్రధాన పాత్రలైన నలుగురుకీ.. నాలుగు బలహీనతలుంటాయ్. దెయ్యాల కొంపలోకెళ్లాక ఆ బలహీనతలే వారికి బలాలవుతాయ్. అందులోంచి పుట్టుకొచ్చే కామెడీని జనాలు ఎంజాయ్ చేస్తారు.
శ్రీనివాసరెడ్డికి కామెడీ హీరోగా మరో సక్సెస్ ఈ సినిమా అని చెప్పొచ్చు. కొలత ప్రకారం నటించాడు.. నవ్వించాడు. వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేశ్ లు కూడా ప్రేక్షకులను నవ్వించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ నలుగురి కాంబినేషన్లో వచ్చే కొన్నిసీన్స్ ప్రేక్షకులకు నచ్చుతాయ్. బాలీవుడ్ ‘పింక్’చిత్రం తాప్సీని నటిగా ఓ స్థాయిలో నిల్చోబెట్టింది. అలాంటి తాప్సీ.. ఇందులో ఏ మాత్రం ఉపయోగం లేని పాత్ర చేసింది. ఈ పాత్రను తాప్సీనే చేయక్కర్లేదు. ఏ చిన్న హీరోయిన్ అయినా సరిపోతుంది. కేవలం స్ట్రేచర్ కోసమే ఆమెను ఈ పాత్రకు తీసుకున్నట్లు అనిపించింది. రాజీవ్ కనకాల పాత్ర ఈ చిత్రానికి హైలైట్. డ్యూయెల్ షేడ్స్ ఉన్న పాత్రను వండర్ అనిపించేలా చేశాడు. తెలుగు సినిమా రాజీవ్ ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదేమో... అనిపించింది ఇందులో ఆయన నటన చూస్తే... మిగిలిన పాత్రధారులంతా పరిధిమేర పాత్రలను రక్తికట్టించారు. సాంకేతికంగా కూడా సినిమా బాగానే ఉంది.
చివరిగా చెప్పేదేంటంటే... ‘ఆనందో బ్రహ్మ’ అని పేరు పెట్టినప్పుడు... అదే స్థాయిలో వినోదం ఉండాలి. కానీ ఈ సినిమాలో ఆ స్థాయిలో మాత్రం వినోదం లేదు. అయితే... వినోదం మాత్రం ఉంది. దర్శకుడు విసిగించలేదూ.. అలా అని విరగబడి నవ్వించలేదు. అలా.. పీస్ ఫుల్ గా సినిమా నడుస్తుంటుంది అంతే. పేరుకే ఇది హార్రర్ కామెడీ..కానీ ఒక్క సీన్‌లో కూడా జనాల్ని భయపెట్టిన పాపాన పోలేదు.
ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేసే జానర్.. హారర్ కామెడీ. ఈ తరహా సినిమాలు కొంచెం బాగున్నా హిట్టయ్యి కూర్చుంటాయ్. ఆ విధంగా చూసుకుంటే... ‘ఆనందో బ్రహ్మ’ కూడా హిట్టే. సరదాగా ఓ సారి చూసేయొచ్చు.
ఫైనల్ టచ్:
విసిగించలేదూ... విరగబడి నవ్వించలేదూ!
రేటింగ్: 2.75
- ఎన్.బి