'బాహుబలి 2' తర్వాతి ప్లేస్ ఈ మూవీదే!
on Feb 4, 2020
యస్.యస్. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి' రెండు భాగాల్లో రెండో సినిమా 'బాహుబలి: ద కంక్లూజన్' వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇండియాలో ఇప్పటికీ ఇదే హయ్యెస్ట్ గ్రాసర్. ఇంతదాకా ఏ బాలీవుడ్ సినిమా కూడా దాని రికార్డులను దాటలేకపోయింది. కాగా ముంబై సర్క్యూట్‌లో ఇంతదాకా 'బాహుబలి 2' తర్వాతి స్థానం సల్మాన్ ఖాన్ సినిమా 'టైగర్ జిందా హై' పేరిట ఉంది. లేటెస్టుగా దాని స్థానాన్ని అజయ్ దేవగణ్ మూవీ 'తానాజీ: ద అన్‌సంగ్ హీరో' ఆక్రమించింది. బాలీవుడ్ స్టార్లలో దేవగణ్‌కు మంచి ఫాలోయింగే ఉన్నప్పటికీ, చాలా కాలంగా ఆయన సినిమాలేవీ ఇండస్ట్రీ రికార్డుల స్థాయికి రాలేకపోతున్నాయి. ఆ కరువును ఓం రౌత్ డైరెక్ట్ చేసిన 'తానాజీ' తీరుస్తోంది. దేవగణ్ కెరీర్‌లోనే ఈ సినిమా హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచి, ఇప్పటికే ఇండియాలో 250 కోట్ల రూపాయల నెట్ మార్కును దాటేసింది.
జనవరి 10న విడుదలైన ఈ సినిమా ఒక్క ముంబై సర్క్యూట్‌లోనే 118 కోట్ల రూపాయలను వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ సర్క్యూట్‌లో మొదటి స్థానం 'బాహుబలి 2' పేరిట ఉంది. అది ఏకంగా 191.58 కోట్లను వసూలు చేసి, మిగతా సినిమాలకు అందనంత ఎత్తులో నిల్చుంది. ఇప్పటివరకూ రెండో స్థానంలో సల్మాన్ ఖాన్ సినిమా 'టైగర్ జిందా హై' ఉండేది. అది ముంబై సర్క్యూట్‌లో 109 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఇప్పుడు దాన్ని 'తానాజీ' వెనక్కి నెట్టింది. సందర్భవశాత్తూ అజయ్ దేవగణ్ ఇప్పుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'లో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా హిందీ బెల్టులో ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.