బాధిత మహిళ మరణిస్తేనే న్యాయం జరుగుతుందా?: చిన్మయి
on Jan 26, 2019
సమాజంలో తప్పు చేస్తున్నది అబ్బాయిలు అయితే... అమ్మాయిల వస్త్రాధారణ సరిగా లేనందున వేధింపులు పెరుగుతున్నాయని, అమ్మాయిలు వాళ్ల ప్రవర్తన మార్చుకోవాలని చెబుతారెందుకో నాకు అర్థం కాదు అని ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి అన్నారు. 'మీ టూ' ఉద్యమంలో భాగంగా ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు పై ఆరోపణలు చేసిన దగ్గర్నుంచి తనకు తమిళంలో అవకాశాలు తగ్గాయని ఆమె అన్నారు. ఇప్పటివరకు 4 ఫిలింఫేర్ పురస్కారాలు, 5 రాష్ట్ర పురస్కారాలు అందుకున్న తనకు మరొకరి పై ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలవాలనే ఆశలేదని అన్నారు. ఓ అమ్మాయి తనకు ఎదురైన చేదు అనుభవాలు, వేధింపుల గురించి నోరు విప్పితే ఆమెను అభినందించడం మాని అవహేళన చేస్తున్నారని, సమాజంలో ఈ ధోరణి సరికాదని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. 'మీ టూ' ఉద్యమంలో భాగంగా తాను నోరు విప్పి నందుకు సామాజిక మాధ్యమాలలో వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. తనను వ్యభిచారిని తో పోలుస్తూ తీవ్రంగా దూషిస్తున్నారని, కొందరైతే పడుకోవడానికి ఎంత తీసుకుంటావని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. "బాధితులు మరణిస్తే లేదా హత్యకు గురైతే సమాజం సీరియస్ గా పట్టించుకుంటుంది. ఆమెకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలంటే బాధిత మహిళ మరణించాలా? మరణిస్తేనే న్యాయం జరుగుతుందా?" అని చిన్మయి ప్రశ్నించారు. లైంగిక వేధింపులపై తాను చేస్తున్న పోరాటంలో కుటుంబం, ముఖ్యంగా తన భర్త రాహుల్ రవీంద్రన్ చాలా మద్దతిస్తున్నారని ఆమె అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవడానికి ఓ కమిటీ వేశారని, తమిళ చిత్ర పరిశ్రమలో అటువంటి కమిటీ లేదని అన్నారామె.