పద్మశ్రీ కి సిరివెన్నెల..
on Jan 28, 2019
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పద్మశ్రీ... ఈ వార్త చదివిన వెంటనే ఆనందం అనిపించినా, నిలువెత్తు తెలుగు భాషకి పద్మవిభూషణం కాదా? కనీసం పద్మభూషణం కూడా కాదా?? అని బాధ కలిగింది.
ఐతే, రాజకీయ కారణాలతో, ప్రయోజనాలతో కొంతమంది అనర్హులను వరించి తన ప్రతిష్ఠని తగ్గించుకున్న పద్మశ్రీ, తిరిగి తన స్థాయిని పెంచుకోడానికి ఈయన సహకారం కోరుకుందేమో అని అర్థం అయింది. ఈ మాటలు మీకు అతిశయోక్తిలా ఉండొచ్చు. కానీ,
దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా? ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. అంటూంటే ఎంత నిస్పృహలో ఉన్న వాడికైనా ధైర్యం రాదా??
తన వేళ్ళే సంకెళ్ళై కదల లేని మొక్కలా, ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా.. అనుకుంటూ ముందుకు సాగిపోమా??
సీతారామశాస్త్రి గారి రచన అంటే, ప్రశ్న... ప్రశ్నల సమూహం..ఆ ప్రశ్నలకు పరిష్కారాలు..
ఆయన పాటలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నట్టే ఉంటాయి.. అందుకేనేమో "ప్రశ్నలోనే బదులు ఉంది. గుర్తు పట్టే గుండెనడుగు" అని రాసుకున్నారు.
బాధలో ఉన్నవాడికి "నిన్నటి నీడలే కనుపాపని ఆపితే, రేపటి వైపుగా నీ చూపు సాగదుగా.." అనే పరిష్కారం.
విజయం కావాలి అనుకునే వాడికి "పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం.. ఆటనే మాటకర్థం నిను నువే గెలుచు యుద్ధం" అనే సమాధానం.
ఆయన రచనలు... సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడగమంటాయి.. సమాజ జీవచ్చవాన్ని అగ్గితో కడగమంటాయి..
కులమతాల జాఢ్యం నీలో ఉందా?? "ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో, ఆ వసంత మాసపు కులగోత్రాలను ఇల కోయిల అడిగేనా?" అని ప్రకృతిని ఉదాహరణగా చెబుతూ సిగ్గుపడేలా చేస్తాయి..
తెలిసీ తెలియక నక్సలిజం లోకి వెళుతున్న యువతని "చంపనిదే బతకమనీ, బతికేందుకు చంపమనీ నమ్మించే అడవిని అడిగేం లాభం బ్రతికే దారెటనీ?" అంటూ హెచ్చరిస్తాయి..
ఐతే, ఆయన పాటలు కేవలం విప్లవాత్మకంగానే ఉంటాయా?? అంటే??
"ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే??" అంటూనే.. "జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా?" అంటూ.. "ఇదీ ప్రేమంటే" అని చెప్పగలరు.
"ఆ మెరుపుల లోనా, నీ మెలికలు చూస్తున్నా.. ఆ వరుణునికే ఋణపడిపోనా యీపైనా?" అంటూ, ఏ మాత్రం అసభ్యం లేని శృంగారాన్ని వినిపించగలరు.
"ఈ హుషారులో రివర్స్ గేరేసినా ముందుకే, ఈ మజాలలో అదర్స్ చీ కొట్టినా లైటులే" అంటూ కాలేజీ ప్రేమికులకి హుషారు తెప్పించగలరు.
కాలేజ్ అంటే గుర్తొచ్చింది..
యువతకి పాటలతో జీవితాన్ని నేర్పడమంటే శాస్త్రిగారికి ప్రత్యేక ఇష్టం.
"ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో" అన్న ఆయనే, "కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థికాదుగా.. కాస్త స్నేహం, కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా" అంటూ జీవితసారాన్ని చెప్పారు.
"బోడి చదువులు వేస్టు.. నీ బుర్రంతా భోంచేస్తు.. ఆడి చూడు క్రికెట్టూ టెండూల్కర్ అయ్యేటట్టు" అని ఒకసారి రాస్తే.. ఎవరో అడిగారంట.. చదువులు వేస్ట్ అంటారేంటి.. ఇంక కుర్రాళ్ళెలా చదువుతారు అని?
దానికి, శాస్త్రిగారు.. చదువులు వేస్ట్ అనలేదు.. బోడి చదువులు వేస్ట్ అన్నాను అన్నారంట..
అంతటి మేథావి కనుకే.. "పద పద పద పద పదా, నిను నువు తరుముకు పదా" అంటూ.. మనతో మనమే పోటీ పడాలనే ఆలోచనని యువతకి ఇచ్చారు.
"ఆది భిక్షువువాడ్ని ఏది కోరేది?" అంటూ నిందాస్తుతి చేస్తూనే.. "నాదం నకారం, మంత్రం మకారం..." అంటూ శివతత్వాన్ని చెప్పగలరు.
శాస్త్రి గారి పాట..
"కాలం నర్తించదా నీతో జతై.. ప్రాణం సుమించదా నీకోసమై??" అంటూ ఒక అమ్మాయి కలల్ని ఆవిష్కరించగలదు.
"కరెన్సీ నోటు మీదా, ఇలా నడిరోడ్డు మీదా జనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ" అని మహాత్ముని గురించి చెప్పగలదు.
"కదలికే తెలియని శిలని కరిగించి ఓ ప్రేమా, కలయికే కల అని మాయమైపోకుమా" అంటూ ప్రేమికుని విరహాన్ని చూబించగలదు.
"నీలాల కన్నుల్లో సంద్రమే.. నింగి నేలమంతా సంద్రమే" అంటూ వేదాంతం చెప్పగలదు.
"సురాజ్యమవలేని.. స్వరాజ్యమెందుకనీ?", "అర్థ శతాబ్ధపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా?" అంటూ నిలదీయగలదు.
"జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది" అంటూ ఏకంగా ఒక దర్శకుడ్ని, ఆ పాటనే కథగా తీసుకుని సినిమా తీసేంతగా ప్రేరేపించగలదు.
"అలలుగ పడిలేచే కడలిని అడిగావా, తెలుసా తనకైనా తన కల్లోలం?" అంటూ మహానటి వ్యధని కళ్ళకు కట్టగలదు.
చివరకు అమృతం అనే TV serial కి రాసిన పాటలో కూడా "నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్, భారీగా ఫీల్ అయ్యే టెన్షన్లేం పడకు గోలీమార్" అంటూ సాధారణ మధ్యతరగతి మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలవు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంత చెప్పినా తరగదు.
అందుకే ఇప్పటికి పదిసార్లు నందులు వచ్చాయి..
SBI Life Insurance Company.. పట్టుదల సినిమాకి శాస్త్రిగారు రాసిన ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి పాటని తెలుగు రాష్ట్రాల కు తమ REGIONAL ANTHEM గా పెట్టుకున్నారంటే ఆయన కలం గొప్పతనం తెలుస్తుంది.
మొత్తానికి సిరివెన్నెల వారి పాట.. ఒక మనిషి జీవితంలో ప్రతీదశలోనూ ఉండాల్సిన పాట. పుట్టుక నుండీ, చనిపోయేవరకూ ప్రతీ క్షణం, ప్రతీ ఎమోషన్ లోనూ ప్రతీ పాట భగవద్గీత శ్లోకంలా ఉపయోగపడుతుంది.
ఈ అరవై వసంతాల మహానుభావుదు, శతవసంతాలు జరుపుకోవాలని.. ఈయన పాటలు తరతరాలకు స్ఫూర్తినివ్వాలని,ఇలాంటివి, ఇంతకుమించి ఇంకా ఎన్నో ఎన్నెన్నో అవార్డులు ఆయనకు రావాలని, ఆయననుండి ఇంకా చాలా చాలా పాటలు రావాలని.. మనస్పూర్తిగా కోరుకుంటూ..
*శ్రీకర్*