రవితేజ 'డిస్కో రాజా' కాన్సెప్ట్ ఏంటి?
on Jan 26, 2019
రవితేజ కథానాయకుడిగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం 'డిస్కో రాజా'. ఈ రోజు (జనవరి 26) మాస్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. సీతాకోక చిలుక మధ్య టైటిల్ డిజైన్ చేయడం బావుంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార్ట.
'డిస్కో రాజా' దగ్గర మూడు ఆప్షన్స్ వున్నాయి... కాన్సెప్ట్ పోస్టర్‌లో. ఫాస్ట్ ఫార్వార్డ్, రివైండ్, కిల్! ప్లే మాత్రం లేదు. కాలంతో ప్రయాణించడమనే కాన్సెప్ట్ డిస్కో రాజా దగ్గర లేదట. అయితే గడియారంలో ముల్లును దాటి ముందుకు వెళ్లడం లేదా వెనక్కి వెళ్లడం లేదా చంపడం అట! ప్రస్తుతానికి పోస్టర్ ను బట్టి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న కాన్సెప్ట్ ఇది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' చిత్రాల కంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో విఐ ఆనంద్ కథ రాశార్ట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రవితేజ డిస్కో రాజాగా రెట్రో లుక్కులో కనిపిస్తారని టాక్.
రవితేజతో 'నేల టికెట్' నిర్మించిన రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. రవితేజ సరసన 'ఆర్.ఎక్స్. 100' ఫేమ్ పాయల్, 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభా నటేష్, 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ నటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.