సినిమా విడుదల ఆగిపోవడంతో, సంతోషంలో గోపీచంద్
on Jun 7, 2017
కథల సెలక్షన్ విషయంలో తడబాటు పడుతున్న గోపీచంద్, ఒక హిట్టు రెండు ఫ్లాపులతో ముందుకు వెళ్తున్నాడు. లౌక్యం ఘన విజయంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన గోపీచంద్, తర్వాత సరైన హిట్ కొట్ట లేదు. ఆ విషయం పక్కన పెడితే, చేసిన సినిమాలు విడుదలకి కూడా నోచుకోలేని పరిస్థితి వచ్చింది. ఏ యం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆక్సిజన్ అనే సినిమా వరుసగా పోస్టుపోన్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం చేస్తున్న గౌతమ్ నంద కూడా అనుకున్న టైం ఎప్పుడో దాటేసి నిదానంగా సాగుతుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మంచి టైం చూసి రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారు.
ఈ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయిన చిత్రాన్ని ఆరడుగుల బుల్లెట్ గా టైటిల్ మార్చి పెండింగ్ ఉన్న పోర్షన్స్ కంప్లీట్ చేసి, ఈ వారం విడుదలకి సిద్ధం చేసారు. కానీ, తాజా సమాచారం ప్రకారం, బి గోపాల్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఇప్పట్లో విడుదలవడం కష్టం అంటున్నారు. ఆరడుగుల బుల్లెట్ విడుదలవ్వాలంటే, ఫైనాన్షియర్స్ దగ్గర తీసుకున్న 6 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఇప్పటికే, కొండంత భారం నెత్తి మీద ఉండడంతో, ఇంకో 6 కోట్ల రిస్క్ తీసుకోవాలా వద్దా అని నిర్మాతలు సందిగ్ధంలో ఉన్నారు. ఈ ఫైనాన్స్ క్లియర్ చేసేంత వరకు సినిమా విడుదలవడం అసంభవం. అయితే, ఆరడుగుల బుల్లెట్ విడుదలవకపోవడం ఒక రకంగా గోపీచంద్ కి మంచి పరిణామమే. ఎందుకంటే, అవుట్ డేటెడ్ స్టోరీ ఇప్పుడు ఆడియన్స్ ఆదరిస్తారంటే అనుమానమే. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయితే, గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న గౌతమ్ నంద మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. సో, గోపీచంద్ తన ఫోకస్ మొత్తం గౌతమ్ నంద మీద పెట్టుకోవచ్చు.
Also Read