ఎన్టీఆర్ `అనురాగ దేవత`కి 40 ఏళ్ళు!
on Jan 8, 2022

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో పలు రీమేక్ హిట్స్ ఉన్నాయి. వాటిలో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `అనురాగ దేవత` ఒకటి. జితేంద్ర, రీనా రాయ్, రామేశ్వరి ప్రధాన పాత్రల్లో రూపొందిన హిందీ చిత్రం `ఆశ` (1980) ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో ఎన్టీఆర్ కి జంటగా శ్రీదేవి, జయసుధ నటించగా ఓ ప్రత్యేక పాత్రలో నటసింహం నందమూరి బాలకృష్ణ అభినయించారు. అల్లు రామలింగయ్య, గుమ్మడి, నూతన్ ప్రసాద్, మిక్కిలినేని, అన్నపూర్ణ, కవిత, రుష్యేంద్రమణి, డబ్బింగ్ జానకి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించగా పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు.
అగ్రశ్రేణి స్వరకర్త చక్రవర్తి బాణీలకు దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ఇందులోని ``చూసుకో పదిలంగా``, ``నీ ఆట నా పాట`` పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``అందాల హృదయమా``, ``ఆడవే గోపిక``, ``ముగ్గురమ్మల`` గీతాలు కూడా రంజింపజేశాయి. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలై ప్రజాదరణ పొందిన `అనురాగ దేవత`.. ఆదివారంతో 40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



