బ్యాడ్ స్టార్ట్.. 2022 ను పరాజయాలతో ప్రారంభించిన టాలీవుడ్!
on Jan 8, 2022

'అఖండ', 'పుష్ప ది రైజ్', 'శ్యామ్ సింగ రాయ్' వంటి హిట్ సినిమాలతో 2021 ని ఘనంగా ముగించిన టాలీవుడ్.. 2022 ను మాత్రం పరాజయాలతో ప్రారంభించింది. అసలే కరోనా విజృంభణతో సతమవుతున్న టాలీవుడ్ కనీసం సంక్రాంతి సినిమాలతోనైనా విజయాలను అందుకుంటుందేమోనని సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జనవరి 1 విడుదలైన 'ఇందువదన', 'ఆశ ఎన్కౌంటర్' సినిమాలతో 2022 ను ప్రారంభించింది టాలీవుడ్. అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. నిజానికి విడుదలకు ముందు కూడా ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు. జనవరి 7న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' తో 2022 గ్రాండ్ గా స్టార్ట్ అవుతుందని తెలుగు ప్రేక్షకులు భావించారు. కానీ కరోనా మళ్ళీ విజృంభిస్తుండటంతో 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడింది. దీంతో ప్రేక్షకులు ఎంతో నిరాశ చెందారు. అయితే 'ఆర్ఆర్ఆర్' విడుదల కావాల్సిన తేదీ జనవరి 7న కొన్ని సినిమాలు విడుదలై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో '1945', 'అతిథి దేవోభవ', 'వేయి శుభములు కలుగు నీకు', 'హాఫ్ స్టోరీస్' వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఇవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
'1945' సినిమా పేరుకి రానా దగ్గుబాటి నటించిన సినిమా అయినప్పటికీ, కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన సినిమా కావడంతో పాటు కొన్ని వివాదాలు తలెత్తి, ఈ సినిమాని రానా సైతం పట్టించుకోకపోవడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంతగా ఆసక్తి కలగలేదు. అంతోఇంతో సినిమాపై ఆసక్తి ఉండి థియేటర్ కి వెళ్లి సినిమా చూసిన వాళ్ళు కూడా నిరాశచెందారు. అదే విధంగా 'అతిథి దేవోభవ', 'వేయి శుభములు కలుగు నీకు', 'హాఫ్ స్టోరీస్' సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయని అంటున్నారు.
ఇక సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సిన మరో పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడింది. అదే రోజున కింగ్ నాగార్జున నటించిన 'బంగార్రాజు' విడుదల కానుంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో 2016 సంక్రాంతికి సూపర్ హిట్ అందుకున్న నాగార్జున.. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన్న 'బంగార్రాజు'తో ఈ సంక్రాంతికి వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే జనవరి 14న 'రౌడీ బాయ్స్', 'డీజే టిల్లు', 'సూపర్ మచ్చి' సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇక జనవరి 15న 'హీరో' సినిమా విడుదల కానుంది. మరి ఈ సంక్రాంతి సినిమాలైనా టాలీవుడ్ కి ఈ ఏడాది మొదటి విజయాన్ని అందిస్తాయేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



