మెగాస్టార్ `దొంగ మొగుడు`కి 35 ఏళ్ళు!
on Jan 8, 2022

మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను భలేగా ఎంటర్టైన్ చేశాయి. వాటిలో `దొంగ మొగుడు` ఒకటి. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన `నల్లంచు తెల్లచీర` నవల ఆధారంగా రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ ని అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. ఇందులో పారిశ్రామికవేత్త రవితేజగా, చిరుదొంగ నాగరాజుగా చిరంజీవి రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయగా.. అతనికి జోడీగా మాధవి, రాధిక, భానుప్రియ కనువిందు చేశారు. జయంతి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, చరణ్ రాజ్, సుత్తి వేలు, రంగనాథ్, మాస్టర్ సురేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
దిగ్గజ సంగీత దర్శకుడు చక్రవర్తి బాణీలు అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``నల్లంచు తెల్లచీర``, ``ఈ చెంపకు సెలవియ్యకు``, ``కోకమ్మ చెప్పమ్మ``, ``ఇడ్లీ పాప ఇడ్లీ పాప``, ``నీ కోకకింత``, ``అడ్డమ రేయి``.. ఇలా ప్రతీ గీతం రంజింపజేసింది. మహేశ్వరీ మూవీస్ పతాకంపై ఎస్. పి. వెంకన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా 1987 జనవరి 9న జనం ముందు నిలిచిన `దొంగ మొగుడు`.. బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. ఆదివారంతో ఈ మాస్ ఎంటర్టైనర్ 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



