మెగాస్టార్ `కొండవీటి రాజా`కి 36 ఏళ్ళు!
on Jan 31, 2022

మెగాస్టార్ చిరంజీవి - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట కాసుల వర్షం కురిపించాయి. వాటిలో.. `కొండవీటి రాజా` ఒకటి. `అడవి దొంగ` (1985) వంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరు, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా అదే బాట పట్టింది. `అడవి దొంగ`లో నాయికగా నటించిన రాధ ఇందులో ఓ హీరోయిన్ గా నటించగా.. విజయశాంతి మరో నాయికగా సందడి చేసింది. రావుగోపాల రావు, కైకాల సత్యనారాయణ, నిర్మలమ్మ, నూతన్ ప్రసాద్, వై. విజయ, చలపతి రావు, పి.ఎల్. నారాయణ, రాళ్ళపల్లి, చిట్టిబాబు, పీజే శర్మ, మాడా ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. జయమాలిని, సిల్క్ స్మిత, అనూరాధ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. రత్నగిరి అనే పల్లెటూరిలోని దురాగతాలను అరికట్టి.. ప్రజలకు మేలు చేయాలని కంకణం కట్టుకున్న రాజా అనే ఓ యువకుడి కథే.. `కొండవీటి రాజా` చిత్రం.
చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటల్లో ``మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రాజా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``నా కోక బాగుందా``, ``అంగాంగ వీరంగం``, ``కొమ్మలకి కోయిలకి``, ``యెలా యెలా`` గీతాలు కూడా రంజింపజేశాయి. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై దేవీవరప్రసాద్ నిర్మించిన `కొండవీటి రాజా`.. 1986 జనవరి 31న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 36 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



