బాలయ్య - బి. గోపాల్ ఫస్ట్ కాంబో మూవీ `లారీ డ్రైవర్`కి 31 ఏళ్ళు!
on Dec 21, 2021

టాలీవుడ్ బాక్సాఫీస్ కి కొత్త కళ తీసుకువచ్చిన కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ - అగ్ర దర్శకుడు బి. గోపాల్ జోడికి ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబినేషన్ లో ఐదు చిత్రాలు రూపొందగా.. వాటిలో మొదటి నాలుగు సినిమాలు ఒకదానిని మించి మరొకటి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాంటి బాలయ్య - బి. గోపాల్ కలయికలో వచ్చిన మొదటి చిత్రం `లారీ డ్రైవర్`. లారీ డ్రైవర్ల యూనియన్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో బాల మురళి అనే లారీ డ్రైవర్ గా బాలకృష్ణ నటించగా.. అతనికి జోడీగా జయమ్మ పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఆకట్టుకున్నారు. శారద, రావు గోపాల రావు, విజయకుమార్, రాజా కృష్ణ మూర్తి, నూతన్ ప్రసాద్, మోహన్ రాజ్, వినోద్, బాబు ఆంటోని, బ్రహ్మానందం, బాబూ మోహన్, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, రాళ్ళపల్లి, జయలలిత ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్ని మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. ``బాలయ్య బాలయ్య``, ``దసరా వచ్చిందయ్యా``, ``మామ మంచమెక్కు``, ``జింగు జింగు చీర``, ``అబ్బనీ పట్టెంత``, ``కన్నె చిలుక``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. జయ ప్రొడక్షన్స్ పతాకంపై రావు గోపాల రావు సమర్పణలో ఎస్. జయ రామారావు నిర్మించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, వి.ఎస్. ఆర్. స్వామి ఛాయాగ్రహణం అదనపు బలాలుగా నిలిచాయి. 1990 డిసెంబర్ 21న విడుదలై ఘనవిజయం సాధించిన `లారీ డ్రైవర్`.. నేటితో 31 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



