`టక్కరి దొంగ`గా మహేశ్ ఎంటర్టైన్ చేసి నేటికి 20 ఏళ్ళు!
on Jan 12, 2022

తెలుగునాట `కౌబాయ్` అనగానే గుర్తొచ్చే కథానాయకుడు.. సూపర్ స్టార్ కృష్ణ. `మోసగాళ్ళకు మోసగాడు` (1971)తో ఈ తరహా చిత్రాలకు శ్రీకారం చుట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారాయన. ఆ తరువాత అదే బాటలో మరికొందరు కథానాయకులు ముందుకు సాగారు. వారిలో కృష్ణ తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఉన్నారు. 2002 సంక్రాంతికి సందడి చేసిన `టక్కరి దొంగ`లో కౌబాయ్ గా కనువిందు చేశారు మహేశ్. అగ్ర దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముంగిట యావరేజ్ గా నిలిచినా.. మహేశ్ గెటప్, పెర్ఫార్మెన్స్ ఘట్టమనేని అభిమానులను మురిపించింది. అలాగే మహేశ్ కి `స్పెషల్ జ్యూరీ` విభాగంలో `నంది` పురస్కారం దక్కింది.
మహేశ్ సరసన లీసా రే, బిపాసా బసు నటించిన ఈ సినిమాలో కృష్ణ ఓ అతిథి పాత్రలో దర్శనమిచ్చారు. రాహుల్ దేవ్, కె. అశోక్ కుమార్, తనికెళ్ళ భరణి, మాస్టర్ కౌశిక్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు, నేపథ్య సంగీతం `టక్కరి దొంగ`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``నలుగురికి నచ్చినది``, ``చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు``, ``ఆలేబా ఆలేబా``, ``బాగుందమ్మా బాగుంది``, ``హే మామా``.. ఇలా ఇందులోని పాటలన్నీ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. `బెస్ట్ ఆడియోగ్రాఫర్` (పి. మధుసూదన్ రెడ్డి), `బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్` (కౌశిక్ బాబు), `బెస్ట్ ఫైట్ మాస్టర్` (విజయన్), `బెస్ట్ సినిమాటోగ్రాఫర్` (జయనన్ విన్సెంట్) విభాగాల్లోనూ `టక్కరి దొంగ`కి `నంది` అవార్డులు దక్కాయి. 2002 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన `టక్కరి దొంగ`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



