ENGLISH | TELUGU  

అనుష్క 15 సంవ‌త్స‌రాల కెరీర్

on Mar 13, 2020

 

* ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అనుష్క‌ జ‌న్మ ధ‌న్యం: ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు

*ఒక న‌టిగా, ఒక మ‌నిషిగా నా హృదయంలో అనుష్క‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది
- అనుష్క 15 సంవ‌త్స‌రాల కెరీర్ ఈవెంట్‌లో అగ్ర ద‌ర్శ‌కుడు య‌స్‌. య‌స్‌. రాజ‌మౌళి  

2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన 'సూప‌ర్' సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న 'నిశ్శ‌బ్దం' ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైద‌రాబాద్‌లోఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌లో ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ, "తొలిసారి స్వీటీని చూడ‌టం ఒక ఎక్స్‌పీరియెన్స్‌. 'శ్రీ‌రామ‌దాసు' తీసేప్పుడు నాగార్జున గెస్ట్ హౌస్‌కు వెళ్లాను. ఆయ‌న 'డైరెక్ట‌ర్‌గారూ స‌రైన టైమ్‌కు వ‌చ్చారు. మీకో కొత్త హీరోయిన్‌ను చూపించాలి'.. అని చెప్పి, 'స్వీటీ' అని పిలిచాడు. సెల్లార్ నుంచి మెట్లెక్కుతూ వ‌చ్చింది. మొద‌ట క‌ళ్లు, త‌ర్వాత ముఖం, ఆ త‌ర్వాత మ‌నిషి పైకి వ‌చ్చి నిల్చుంది. అప్పుడు ఆమెతో అన్నాను.. 'నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావ్ స్వీటీ' అని చెప్పాను. ఇవాళ నిన్ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఆరోజు అక్క‌డ ఎలాగైతే మెట్లెక్కి వ‌చ్చావో, అలాగే బంగారు మెట్లెక్కుతూ కెరీర్‌లో ముందుకు వ‌చ్చావు. పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో ఫ‌స్ట్ పిక్చ‌ర్ చేశావు. హీరోయిన్ల‌ను పూరి ఎలా చూపిస్తాడో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. 'సూప‌ర్' అనిపించావ్‌. ఆ త‌ర్వాత శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి, కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్‌తో చేసిన 'అరుంధ‌తి'తో నీకు గ‌జ‌కేస‌ర యోగం ప‌ట్టింది. అప్పుడే ఏనుగును ఎక్కేశావ్‌. ఆ త‌ర్వాత 'భాగ‌మ‌తి', గుణ‌శేఖ‌ర్ సినిమా 'రుద్ర‌మ‌దేవి', 'బాహుబ‌లి'లో దేవ‌సేన‌గా హంస‌వాహ‌నం ఎక్కి ఆకాశంలోకి వెళ్లిపోయావ్‌. ఆ సినిమాలో 'ఊపిరి పీల్చుకో' అని నువ్వు చెప్పిన డైలాగ్‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది.

నా సినిమా 'న‌మో వెంక‌టేశాయ‌'లో ఒక భ‌క్తురాలిగా చేశావ్‌. ప్ర‌య‌త్నిస్తే సినిమాలు దొరుకుతాయ్‌. కానీ నీ విష‌యంలో క్యారెక్ట‌ర్లే నిన్ను వెతుక్కుంటూ వ‌చ్చాయ్‌. ఈ జ‌న‌రేష‌న్‌లోని మ‌రే హీరోయిన్‌కీ ఆ అదృష్టం ద‌క్క‌లేదు. నీ కెరీర్‌లో బెస్ట్ క్యారెక్ట‌ర్ల‌ను పొందావు. 'అనుష్క చాలా మంచిది, అందుకే ఆ క్యారెక్ట‌ర్లు వ‌చ్చాయి' అని అంద‌రూ చెప్పే విష‌య‌మే. అంద‌రినీ నీ కుటుంబంలా చూసుకుంటావ్‌. తెలుగులోనే కాకుండా త‌మిళ‌నాడులో, క‌ర్ణాట‌క‌లోనూ ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న నీ జ‌న్మ ధ‌న్యం. నీకూ, నాకూ ద‌గ్గ‌ర పోలిక ఉంది. న‌న్ను 'మౌన ముని' అని పిలిచేవారు. నువ్వు ఈ 'నిశ్శ‌బ్దం' సినిమాతో మౌన మునిక‌న్య‌గా అయిపోతావ్‌. డైరెక్ట‌ర్ హేమంత్ ఈ సినిమా క‌థ నాకు చెప్పాడు. ఆ క్యారెక్ట‌ర్ ఎలా చేసుంటావో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నీ సామ‌ర్థ్యం నాకు తెలుసు. హేమంత్ వెరీ గుడ్ డైరెక్ట‌ర్‌. నిర్మాత‌లు నాకు బాగా తెలుసు. ఈ పిక్చ‌ర్ పెద్ద హిట్ట‌వ్వాలి" అని చెప్పారు.

నిర్మాత ఎం. శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ, "అనుష్క జీవితాన్ని మార్చేసిన సినిమా 'అరుంధ‌తి' అని అంద‌రూ అంటుంటారు కానీ, ఆ సినిమాతో నా జీవితాన్ని మార్చేసిన న‌టి తాను అని నేనంటాను. ఆ మాట‌కు నేను క‌ట్టుబ‌డి ఉంటాను. త‌న స్నేహితుల‌కు ఆమె ఆనందాన్ని క‌లిగిస్తుంది. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడ‌ల్లా ఆమె స్నేహితుల ద‌గ్గ‌ర ఉంటుంది. వాళ్ల బాధ‌లు వింటుంది. వాళ్ల ఆనందాన్నీ, విజ‌యాల్నీ సెల‌బ్రేట్ చేస్తుంది. ఆమె కుడిచేత్తో చేసే సాయం ఎడ‌మ చేతికి కూడా తెలీదు. ఆమె త‌న సొంత‌ కుటుంబాన్ని మొద‌లు పెట్టాల‌ని కోరుకుంటున్నా. 'నిశ్శ‌బ్దం' టీమ్‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నా" అన్నారు.

 

 

డైరెక్ట‌ర్ వైవీఎస్ చౌద‌రి మాట్లాడుతూ, "మా 'దేవ‌దాసు' సినిమా కోసం బాంబేకి వెళ్లి ఇలియానాను హీరోయిన్‌గా సెల‌క్ట్ చేసుకుని, అగ్రిమెంట్లు కుదుర్చుకొని, ఇలియానా, వాళ్ల‌మ్మ‌తో క‌లిసి ఫ్లైట్‌లో హైద‌రాబాద్‌కు వ‌స్తున్నాను. వాళ్లిద్ద‌రూ నా వెనుక సీట్ల‌లో కూర్చున్నారు. నా ముందు సీట్లో చ‌క్క‌ని రూప‌లావ‌ణ్యాలు ఉన్న ఒక అమ్మాయి వ‌చ్చి కూర్చోవ‌డం రెప్ప‌పాటు కాలంలో చూశాను. పేర‌డిగితే స్వీటీ శెట్టి అని చెప్పింది. నంబ‌ర్ అడిగి తీసుకున్నా. 'సూప‌ర్‌'లో ఆమె బాగున్న‌ప్ప‌టికీ, 'విక్ర‌మార్కుడు'తో ఆమెకు మంచి బ్రేక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత నా 'ఒక్క మ‌గాడు' చేసింది. ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఇవాళ ఎంతో ఎత్తుకు ఎదిగారు. మంచి విగ్ర‌హం క‌ల ఒక అమ్మాయికి మంచి క‌ళ్లు, మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ దేవుడు ఇస్తే పాత్ర‌లు వెతుక్కుంటూ వ‌స్తాయి. అనుష్క ద‌గ్గ‌ర‌కు అలా పాత్ర‌లు వెతుక్కుంటూ వచ్చాయి. మంచిత‌నంతో, ఓపిక‌తో ఆ పాత్ర‌ల‌కు జీవంపోసి ఇవాళ ఆమె ఈ స్థాయిలో ఉన్నారు. అనుష్క గురించి ఎవ‌రు చెప్పినా ముందు చెప్పేది ఆమె మంచిత‌నం గురించి. మ‌నిషిని మ‌నిషిలా చూడ్డం ఆమెలోని గొప్ప గుణం. ఆమెకు మంచి జీవిత భాగ‌స్వామి దొర‌కాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. 'నిశ్శ‌బ్దం' టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. ట్రైల‌ర్ చూశాక క‌చ్చితంగా ఈ సినిమా ఏదో చెయ్య‌బోతోంద‌ని అనిపించింది. హేమంత్‌కు బ్ర‌హ్మాండ‌మైన బ్లాక్‌బ‌స్ట‌ర్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నా" అని చెప్పారు.

డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ, "ఈ బంగారుత‌ల్లి 'సూప‌ర్' సినిమా హీరోయిన్ కోసం బాంబే వెళ్లిన‌ప్పుడు దొరికింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి తీసుకెళ్లాను. నాగార్జున‌గారు త‌న‌ను చూడ‌గానే, 'ఈ అమ్మాయ్ చాలా బాగుందే' అన్నారు. 'ఈ అమ్మాయికి ఆడిష‌న్ చేద్దాం సార్' అన్నాను. 'ఆడిష‌న్ ఏమీ అవ‌స‌రం లేదు, పెట్టేద్దాం' అని ఆయ‌న‌న్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల ద‌గ్గ‌ర త‌ను యాక్టింగ్ నేర్చుకుంది. డాన్స్ అవీ నేర్చుకొని సూప‌ర్ ఎన‌ర్జీతో 'సూప‌ర్' ఫిల్మ్‌లో చేసింది. అంత‌కుముందు నాగార్జున‌గారు నీ పేరేంట‌ని అడిగితే స్వీటీ అని చెప్పింది. 'కాదు, నీ ఒరిజిన‌ల్ పేరు?' అన‌డిగారు. స్వీటీయేన‌ని, త‌న పాస్‌పోర్ట్ చూపించింది. అందులో ఆ పేరే ఉంది. 'ఇలా కాదు, స్క్రీన్ నేమ్ మంచిది ఉండాలి' అన్నారు నాగార్జున‌గారు. ఆ త‌ర్వాత ఈ పిల్ల‌కు ఏం పేరు పెడ‌దామ‌ని చాలా పేర్లు రాసుకున్నాం. అప్ప‌డు మ్యూజిక్ డైరెక్ట‌ర్ సందీప్ చౌతా 'మిల మిల' అనే పాట రికార్డింగ్ కోసం ఒక అమ్మాయిని పిలిపించాడు. ఆ అమ్మాయి పేరు అనుష్క‌. అది నాకు న‌చ్చి, 'ఈ పేరు ఎలా ఉంది?' అని స్వీటీని అడిగాను. 'బాగానే ఉంది కానీ, నాగార్జున‌గారిని కూడా అడుగుదాం' అంది. ఆయ‌న్ని అడిగితే, మ‌న హీరోయిన్ల‌లో ఎవ‌రికీ ఇలాంటి పేరు లేదు, పెట్టేయొచ్చ‌న్నారు. అలా అనుష్క అనే నామ‌క‌ర‌ణం జ‌రిగింది. 'సూప‌ర్‌'తో స్టార్ట‌యి, 'నిశ్శ‌బ్దంతో ప‌దిహేనేళ్ల కెరీర్ పూర్తి చేసుకుంటోంది. యు రాకింగ్‌, ల‌వ్ యు.. హ్యాట్సాఫ్‌. ఇందాక అనుష్క ఏవీ చూశాను. హీరోల ఏవీల కంటే చాలా బాగుంది. నాకు గూస్‌బంప్స్ వ‌చ్చాయి. అంద‌రూ చెప్తున్న‌ట్లే అనుష్కనిజంగా చాలా మంచిది. త‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకోవాలి. ర‌వితేజ‌, చార్మి, నేను అనుష్క‌ను 'అమ్మా' అని పిలుస్తాం. మేం క‌లిసిన‌ప్పుడ‌ల్లా త‌న కాళ్ల‌కు దండంపెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆమెలో కొన్ని ల‌క్ష‌ణాల‌న్నా మాకు రావాల‌ని కోరుకుంటుంటాం. చాలా మంచిత‌నం, చాలా తెలివితేట‌లు క‌లిసిన కాంబినేష‌న్ అనుష్క‌. నా స్నేహితుడు హేమంత్ మ‌ధుక‌ర్ తీసిన 'నిశ్శ‌బ్దం' సినిమాను నేనిప్ప‌టికే చూశాను. ఫెంటాస్టిక్ ఫిల్మ్‌. అనుష్క‌ మూగ‌మ్మాయిలా చేసింది. నిజంగా మూగ‌దేమో అని నాకే డౌట్ వ‌చ్చింది. ఈ అమ్మాయి 'తెలీదు తెలీదు' అని అన్నీ నేర్చుకొనే ర‌కం. త‌న‌కు హ్యాట్సాఫ్‌. ఈ సినిమా పెద్ద హిట్ట‌వ్వాలి అనుష్కా" అని చెప్పారు.

చార్మి మాట్లాడుతూ, "అనుష్క ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడు నేను సీనియ‌ర్‌లా బిహేవ్ చేశాను. అప్ప‌ట్నుంచే త‌ను ప‌రిచ‌యం. ఇవాళ త‌ను నాకు అమ్మ‌. ఆమెలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. ఆమెలా ఉండటం చాలా క‌ష్టం. స‌హ‌నం, స‌మ‌తుల్యం విష‌యంలో ఆమె అద్భుతం. 15 ఏళ్ల కెరీర్ అంటే జోక్ కాదు. ఈ కాలంలో ఆమె అద్భుత‌మైన పాత్ర‌లు చేసింది. మొన్న 'నిశ్శ‌బ్దం' చూశాం. అందులో అనుష్క త‌న న‌ట‌న‌తో చింపేసింది. 'నిశ్శ‌బ్దం' పెద్ద హిట్ కావాల‌ని ప్రార్థిస్తున్నా. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్ సాధించాల‌ని కోరుకుంటున్నా" అన్నారు.

ర‌చ‌యిత‌, నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ కోన వెంక‌ట్ మాట్లాడుతూ, "రాఘ‌వేంద్రరావుగారు, శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి గారు చెప్పిన‌ట్లు ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియాగా చెయ్యాల‌నీ.. హాలీవుడ్‌, బాలీవుడ్ యాక్ట‌ర్ల‌తో చేయించాల‌నీ మా టీమ్ నిర్ణయించుకుంది. ఒక క్యారెక్ట‌ర్‌ను సౌత్‌, నార్త్‌లో తెలిసిన న‌టితో చేయించాల‌ని అనుకుంటున్న టైమ్‌లో స్వీటీ నాకు బాంబే ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించింది. అక్క‌డి సెక్యూరిటీ వాళ్లు త‌మ మెట‌ల్ డిటెక్ట‌ర్స్‌ను ప‌క్క‌న‌పెట్టి మరీ ఆమెతో ఫొటోలు దిగుతున్నారు. ఒకే ఫ్లైట్‌లో ప్ర‌యాణించాం. హైద‌రాబాద్‌లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్‌ను అంత‌కుముందు అక్క‌డ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింద‌ని చెన్నై తీసుకుపోయారు. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్ల‌వారు జాము 5 గంట‌ల వ‌ర‌కు ఫ్లైట్‌లోనే ఉండిపోయాం. 'ఏంటి కోన గారూ, మీరేం చేస్తున్నారు? అన‌డిగింది. అప్ప‌డు ఈ క‌థ చెప్పా. ఆమెను ఆ సినిమా కోసం అడ‌గాల‌ని చెప్ప‌లేదు. ఏదో ఒక‌టి మాట్లాడుకోవాలి కాబ‌ట్టి చెప్పాను. త‌ర్వాత త‌ను వెళ్లిపోయింది. నేను హైద‌రాబాద్ తిరిగొచ్చాక స్వీటీ అయితే ఎలా ఉంటుంద‌ని హేమంత్‌ను అడిగాను. 'ఇండియాలోనే అంత‌కంటే బెట‌ర్ చాయిస్ దొర‌క‌దు సార్' అన్నాడు. అప్పుడు 'ఫుల్ స్టోరీ వింటావా?' అని ఆమెకు మెసేజ్ పెట్టాను. అలా త‌ను విన‌డం, ఈ ప్రాజెక్టులోకి రావ‌డం.. అంతా ఆ దేవుడు డిజైన్ చేసిన‌ట్లు జ‌రిగింది. సాధార‌ణంగా హీరోయిన్ల కెరీర్ చాలా త‌క్కువ కాల‌మే ఉంటుంది. పీక్స్‌లో అయితే మాగ్జిమ‌మ్ ఐదేళ్లు ఉంటుంది. అలాంటిది 15 ఏళ్లు త‌న మార్క్‌నీ, త‌న మార్కెట్‌నీ పెంచుకుంటూ, నిల‌బెట్టుకుంటూ ఉందంటే త‌న టాలెంట్‌తో పాటు ఇంకేదో ఉండాలి. అదే స్వీటీ! క్యారెక్ట‌ర్ అంటే చాలా త‌ప‌న ప‌డుతుంది, టెన్ష‌న్ ప‌డుతుంది, చాలా హోమ్‌వ‌ర్క్ చేస్తుంది. సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటానంటే బేగంపేట్ స్కూల్ నుంచి టీచ‌ర్లు, ఇద్ద‌రు ముగ్గురు స్టూడెంట్స్ రెండు నెల‌ల పాటు రోజూ స్వీటీ ఇంటికెళ్లి ఆమెకు దానిని నేర్పారు. ఇలా పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డింది. త‌న‌కు ఏమీ తెలీద‌నుకోవ‌డ‌మే ఆమెలోని గ్రేటెస్ట్ క్వాలిటీ. ఇన్ని సినిమాలు చేసినా ఫ్రెష్ స్టూడెంట్ లాగానే ఫీల‌వుతుంది. అందుకే ఇంత‌కాలం ఉంది, ఇంకో ప‌దిహేనేళ్లు ఇలాగే ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ట్రూ లేడీ సూప‌ర్‌స్టార్ అన‌డానికి నిజంగా అర్హురాలు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌ర్నీ స‌మానంగా చూసే గొప్ప గుణం ఆమెది. త‌న మీద ఒక పుస్త‌కం రాయొచ్చు. 'నిశ్శ‌బ్దం' ఆమెకు మంచి హెల్ప్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట‌ర్‌గా ఇది నాకు 55వ చిత్రం. గ‌ర్వంగా చెప్తున్నా, ఇప్ప‌టివ‌ర‌కూ నేను రాసిన బెస్ట్‌ స్క్రీన్ ప్లే లలో ఇదొక‌టి" అని చెప్పారు.

నిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ, "అనుష్క గురించి ఏం చెప్ప‌ను.. 'సూప‌ర్' సినిమా టైమ్‌లో ఒక అంద‌మైన అమ్మాయి అటూ ఇటూ న‌డుస్తుండ‌టం చూశాను. ఆ త‌ర్వాత త‌న‌తో కొన్ని సినిమాలు చేశాను. ఇండ‌స్ట్రీలో చాలామందిని క‌లుస్తుంటాం. చాలా మంచి మ‌నుషులు చాలా త‌క్కువ‌మంది ఉంటారు. బ‌హుశా హీరోయిన్ల‌లో అనుష్క లాంటి నైస్ ప‌ర్స‌న్ ఇంకొక‌రు ఉండ‌రు. నిజంగానే త‌ను స్వీట్ గాళ్‌, గుడ్ గాళ్‌, గొప్ప హృద‌యం ఉన్న అమ్మాయి. అలాంటి హృద‌యం ఉన్న‌వాళ్లు అరుదు. మున్ముందు ఆమె జీవితం మ‌రింత గొప్ప‌గా ఉండాల‌ని కోరుకుంటున్నా" అన్నారు.

చిత్ర‌ నిర్మాత టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, "నేనొక ప‌ది సినిమాల దాకా నిర్మించాను. 'నిశ్శ‌బ్దం' సినిమాతో అనుష్క‌తో స‌న్నిహితంగా ప‌నిచేసే అవ‌కాశం ల‌భించింది. అనుష్క మైల్ స్టోన్ ఈవెంట్ సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల చేస్తుండ‌టం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు, హాలీవుడ్ న‌టుల‌తో ఈ మూవీ డిఫ‌రెంట్‌గా ఉంటుంది" అన్నారు.

డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ, "అనుష్క ఒక నిగ్ర‌హం ఉన్న విగ్ర‌హం. రెండేళ్ల పాటు మాతో పాటు ఈ సినిమా కోసం త‌ను వెచ్చించ‌డం మామూలు విష‌యం కాదు. అది ఆమె అంకిత‌భావం. మాపై న‌మ్మ‌కం ఉంచినందుకు ఆమెకు థాంక్స్‌. ఈ ప‌దిహేనేళ్ల జ‌ర్నీలో ఆమె ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. వాటిలో 'నిశ్శ‌బ్దం' కూడా ఒక మైలురాయి లాంటి సినిమా లాగా నిల‌బ‌డుతుంద‌ని ఆశిస్తున్నా. అంజ‌లి కూడా ఇప్ప‌టి దాకా చేసిన క్యారెక్ట‌ర్ల‌కు చాలా భిన్న‌మైన క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో చేసింది. మాకు కావాల‌సిన అన్నింటినీ నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ గారు స‌మ‌కూర్చి పెట్టారు. ఆయ‌న స‌పోర్ట్ ఇవ్వ‌బ‌ట్టే ఈ సినిమాను నేను అనుకున్న‌ట్లు చేయ‌గ‌లిగాను" అన్నారు.

అంజ‌లి మాట్లాడుతూ, "ఐ ల‌వ్ యూ స్వీటీ. నీది చాలా మంచి హృద‌యం. 'నిశ్శ‌బ్దం' సెట్స్‌పై తొలిరోజు నాకు సౌక‌ర్యంగా ఉంటుందా అనే ఫీలింగ్ ఉండేది. త‌న‌తో నాకు చాలా కాంబినేష‌న్ సీన్స్ ఉన్నాయి. త‌న పుట్టిన‌రోజుకు ఒక పిక్చ‌ర్ పోస్ట్ చేశాను, అది త‌ను న‌న్ను పైకి లేపిన పిక్చ‌ర్‌. ఆమె నుంచి అంత సౌక‌ర్యం పొందాను. ఆమె ఇండ‌స్ట్రీలో మ‌రెన్నో ఏళ్లు ఉండాలి. 'నిశ్శ‌బ్దం'లో న‌న్ను భాగం చేసినందుకు అంద‌రికీ థాంక్స్‌. నా కెరీర్‌లో ఇదొక డిఫ‌రెంట్ మూవీ. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నా" అన్నారు.

డైరెక్ట‌ర్‌ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి మాట్లాడుతూ, "స్వీటీ నాకు చాలా స‌న్నిహితురాలు, ఫ్యామిలీ ఫ్రెండ్‌. త‌ను మంచి అబ్జ‌ర్వ‌ర్‌. ప్ర‌తి విష‌యాన్నీ చాలా బాగా అబ్జ‌ర్వ్ చేస్తుంది. 'విక్ర‌మార్కుడు' సినిమా చేసేట‌ప్పుడు ప్ర‌తి షాట్‌ను ఎలా చెయ్యాలో చేసి చూపించ‌మ‌నేది. నేను చేసి చూపిస్తే త‌ను దాన్ని త‌న‌కు త‌గ్గ‌ట్లుగా మ‌ల‌చుకొని చేసేది. ఆఖ‌రుకి ర‌వితేజ‌తో రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించ‌మ‌నేది. అలా అన్నీ నాతో చేయించింది. ఆ సినిమాలోనే మా కుటుంబం మొత్తానికి త‌ను స‌న్నిహితురాలైంది. నాతో పాటు మా ఆవిడ‌కూ, మా వ‌దిన‌కూ, మా పిల్ల‌ల‌కూ స‌న్నిహిత‌మైపోయింది. నాకే స‌న్నిహితురాలేమోన‌ని ఇంత‌దాకా అనుకుంటూ వ‌చ్చాను. ఇక్క‌డ‌కు వ‌చ్చాక తెలిసింది, త‌ను అంద‌రికీ స‌న్నిహితురాలేన‌ని. నా సినిమాల్లో హీరోయిన్ల‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్లు పెద్ద‌గా క్రియేట్ చెయ్య‌ను. కానీ దేవ‌సేన పాత్ర‌ను సృష్టించినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతుంటాను, ఎందుకంటే దాన్ని స్వీటీ పోషించిన విధానం. చాలామంది హీరోయిన్ల‌తో ప‌నిచేస్తుంటాం, వాళ్ల‌ను చూస్తుంటాం. కొంత‌మందిని ప్రేమిస్తాం, కొంత‌మందిని ఇష్ట‌ప‌డ‌తాం. స్వీటీని ఒక న‌టిగా, ఒక మ‌నిషిగా చాలా గౌర‌విస్తాను. ఆ విష‌యంలో నా హృదయంలో ఆమెకో ప్ర‌త్యేక స్థానం ఉంది. త‌ను ఫెంటాస్టిక్ రోల్స్ చేసింది. ఇంకా చేస్తుంద‌ని నాకు తెలుసు. 'నిశ్శ‌బ్దం' టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బాగున్నాయి. ఆ సినిమా విడుద‌ల‌య్యే ఏప్రిల్ 2 కోసం ఎదురుచూస్తుంటా అని చెప్పారు.

అనుష్క మాట్లాడుతూ, "సీనియ‌ర్స్ సాధించిన దానితో పోలిస్తే నేను సాధించింది చాలా త‌క్కువ‌. అయితే దీన్ని నేను ఓ బాధ్య‌త‌గా తీసుకొని ఇంకా హార్డ్‌వ‌ర్క్ చెయ్యాలి, ఇంకా మంచి స్క్రిప్ట్స్ చెయ్యాలనుకుంటాను. 'సూప‌ర్‌' నుంచి  'నిశ్శ‌బ్దం' వ‌ర‌కూ.. పూరి జ‌గ‌న్నాథ్ గారి నుంచి మొద‌లుకొని, ప్ర‌తి సినిమా డైరెక్ట‌ర్‌కూ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్పుడు సినిమాపై నా నాలెడ్జ్ ఎలా ఉండిందో పూరి జ‌గ‌న్నాథ్ గారికి తెలుసు. ప్ర‌తి సినిమా నాకొక మెట్టు. స‌హ న‌టులు, నిర్మాత‌, ప్ర‌తి యూనిట్ మెంబ‌ర్‌తో ఒక ప్ర‌యాణం చేస్తూ వ‌చ్చాను. మంచి, చెడు అనుభ‌వాల‌తో ఇక్క‌డి దాకా వ‌చ్చాను. ఈ ప‌దిహేనేళ్ల‌లో నాతో క‌లిసి ప‌నిచేసిన‌, ప్ర‌యాణించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా. 'నిశ్శ‌బ్దం' చిత్రం ఏప్రిల్ 2న వ‌స్తోంది. ఒక భిన్న‌మైన చిత్రం అందించాల‌ని మా వంతు ప్ర‌య‌త్నం చేశాం. దీనికి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నా. ఇక్క‌డ‌కు వ‌చ్చి ఈ ఈవెంట్‌ను నాకు ప్ర‌త్యేక‌మైన‌దిగా మార్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్ అన్నారు. నిశ్శబ్దం సహనిర్మాత వివేక్ కూచి భొట్ల ఈ వేడుక ఆద్యంతం వైభవంగా జరగటానికి ఏర్పాట్లను గత కొన్నిరోజులుగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ వేడుక‌లో నిర్మాత పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కులు శ్రీ‌వాస్‌, వీరు పోట్ల కూడా మాట్లాడారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.