అనుష్క నాకే క్లోజ్ అనుకున్నా.. కాదని ఇప్పడే తెలిసింది!
on Mar 13, 2020
అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి అనే విషయం కొద్ది మందికే తెలుసు. తొలి సినిమా 'సూపర్'తో స్క్రీన్ నేమ్‌ను అనుష్కగా మార్చుకున్నప్పటికీ, ఆమె సన్నిహితులు, స్నేహితులు ఆమెను స్వీటీ అనే అసలు పేరుతోటే పిలుస్తుంటారు. డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి కూడా అంతే. కాగా స్వీటీ తనకు మాత్రమే క్లోజ్ అనుకుంటూ వస్తున్నాననీ, కానీ ఇప్పడు తను ఎందరికో క్లోజ్ అనే విషయం తెలిసిందనీ ఆయన అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది.. గురువారం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన అనుష్క 15 ఏళ్ల కెరీర్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో.
యస్.యస్. రాజమౌళి మాట్లాడుతూ, "స్వీటీ నాకు చాలా సన్నిహితురాలు, ఫ్యామిలీ ఫ్రెండ్. తను మంచి అబ్జర్వర్. ప్రతి విషయాన్నీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. 'విక్రమార్కుడు' సినిమా చేసేటప్పుడు ప్రతి షాట్‌ను ఎలా చెయ్యాలో చేసి చూపించమనేది. నేను చేసి చూపిస్తే తను దాన్ని తనకు తగ్గట్లుగా మలచుకొని చేసేది. ఆఖరుకి రవితేజతో రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేది. అలా అన్నీ నాతో చేయించింది. ఆ సినిమాలోనే మా కుటుంబం మొత్తానికి తను సన్నిహితురాలైంది. నాతో పాటు మా ఆవిడకూ, మా వదినకూ, మా పిల్లలకూ సన్నిహితమైపోయింది. నాకే సన్నిహితురాలేమోనని ఇంతదాకా అనుకుంటూ వచ్చాను. ఇక్కడకు వచ్చాక తెలిసింది, తను అందరికీ సన్నిహితురాలేనని" అని చెప్పారు.
తన సినిమాల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు పెద్దగా క్రియేట్ చెయ్యనని అంగీకరించిన రాజమౌళి.. "కానీ దేవసేన పాత్రను సృష్టించినందుకు గర్వంగా ఫీలవుతుంటాను, ఎందుకంటే దాన్ని స్వీటీ పోషించిన విధానం. చాలామంది హీరోయిన్లతో పనిచేస్తుంటాం, వాళ్లను చూస్తుంటాం. కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ఇష్టపడతాం. స్వీటీని ఒక నటిగా, ఒక మనిషిగా చాలా గౌరవిస్తాను. ఆ విషయంలో నా హృదయంలో ఆమెకో ప్రత్యేక స్థానం ఉంది. తను ఫెంటాస్టిక్ రోల్స్ చేసింది. ఇంకా చేస్తుందని నాకు తెలుసు. 'నిశ్శబ్దం' టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఆ సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 2 కోసం ఎదురుచూస్తుంటా" అన్నారు.
Also Read