'అనుష్క'గా స్వీటీ మారడానికి వెనక ఇంత కథ ఉంది!
on Mar 13, 2020
స్వీటీ శెట్టికి 'అనుష్క'గా ఎలా నామకరణం జరిగింది? నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'సూపర్' (2005) మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా తకియా మెయిన్ హీరోయిన్‌గా నటించగా, సెకండ్ హీరోయిన్‌గా అనుష్క అనే కొత్తమ్మాయి పరిచయమైంది. నిజానికి ఆమె పేరు అనుష్క కాదు, స్వీటీ శెట్టి. పూరి జగన్నాథ్ బృందమే ఆమెకు అనుష్క అనే స్క్రీన్ నేమ్ పెట్టింది. దాని వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. అదేమిటన్నది జగన్ స్వయంగా తెలిపాడు. గురువారం జరిగిన అనుష్క 15 ఏళ్ల కెరీర్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో అనుష్క గురించి జగన్ మాట్లాడుతూ, "ఈ బంగారుతల్లి నాకెలా దొరికిందో చెప్తాను. 'సూపర్' సినిమా హీరోయిన్ కోసం బాంబే వెళ్లాను. అక్కడ ఇ. నివాస్ (బాలీవుడ్‌లో స్థిరపడ్డ తెలుగువాడు) 'ఒకమ్మాయి ఉంది, పంపిస్తాను చూడు' అని చెప్పాడు. అక్కడ హోటల్లో లాబీలో నేను వెయిట్ చేస్తుంటే ఒకమ్మాయి వచ్చింది. చూడ్డానికి చాలా బాగుంది, మంచి హైట్. నీ పేరేంటని అడిగితే 'స్వీటీ' అని చెప్పింది. కూర్చోమని చెప్పి, మీ ఫొటో ఉంటే ఇవ్వండన్నాను. పర్స్ తీసి, దాన్లోంచి వెతికీ వెతికీ స్టాంప్ బిళ్లకంటే చిన్నదిగా ఉన్న ఫొటో చూపించింది. ఈమె సినిమా పక్షి కాదని నాకర్థమైపోయింది. 'ఫొటో అంటే ఇది కాదు, ఫొటోషూట్ ఏమీ చేయలేదా?' అనడిగితే, అలాంటిదేమీ లేదంది. 'యాక్టింగ్ వచ్చా?' అనడిగా. 'తెలియదు' అంది. 'చెయ్యగలవా, చెయ్యలేవా?' అనడిగా. 'ఎప్పుడూ ట్రై చెయ్యలేదు, చేస్తానో లేదో తెలీదు' అంది. 'డాన్స్?' అనడిగా. 'తెలీదు, స్టెప్ వేయొచ్చు, వేయకపోవచ్చు' అంది. ఈ పిల్ల బంపర్ ఆఫర్లు ఇస్తుందే అనుకున్నా. పిల్లేమో చూడ్డానికి బాగుంది. మా ఆవిడ పైన రూమ్‌లో ఉంటే ఫోన్ చేశా. 'ఇప్పడు లాబీలో ఒక అద్భుతమైన అమ్మాయిని కలిశా' అని చెప్పా. 'నీకు అందరు అమ్మాయిలు నచ్చేస్తుంటారు, నేను చూసి చెప్తా' అని కిందకు వచ్చింది. స్వీటీని చూడగానే 'ఒడ్డూ పొడుగుంది, ఎంత బాగుంది ఈ అమ్మాయ్. సినిమాలో పెట్టేద్దాం' అంది" అని ఆమెతో ఎలా పరిచయం జరిగిందో చెప్పాడు.
'నువ్వు ఏం చేస్తున్నావ్?' అని ఆమెను జగన్ అడిగితే, 'నేను యోగా టీచర్‌ని' అని చెప్పింది. ఒక ఆరు నెలలు చూసి, వర్కవుట్ కాకపోతే తిరిగొచ్చేద్దాం అని అతనితో పాటు హైదరాబాద్ వచ్చింది. "స్వీటీని అన్నపూర్ణ స్టూడియోస్‌కి తీసుకెళ్లాను. నాగార్జునగారు తనను చూడగానే, 'ఈ అమ్మాయ్ చాలా బాగుందే' అన్నారు. 'ఈ అమ్మాయికి ఆడిషన్ చేద్దాం సార్' అన్నాను. 'ఆడిషన్ ఏమీ అవసరం లేదు, పెట్టేద్దాం' అని ఆయనన్నారు. కనీసం ఫొటోలైనా తీయిద్దామని చెప్పి, మేకప్ రవిని పిలిపిస్తే, వాడు స్వీటీ ముఖం పట్టుకొని 'ఈ ముఖమేంటి సార్, ఎకరంన్నర ఉంది. మొత్తం మేకప్ వేయాలా?' అనడిగాడు. 'ఆమెది బెంగుళూరు, తెలుగు తెలిసినా తెలిసుండవచ్చు. నువ్వు వెధవ వాగుడు వాగకు' అని చెప్పా. వాడికి డౌట్ వచ్చి, 'అమ్మా.. నేనిప్పుడు మాట్లాడింది నీకు అర్థమైందా?' అనడిగాడు. ఈ అమ్మాయి తలూపింది. వాడు 'నేను తెలీక వాగాను. ఈ విషయం నాగార్జునగారికి చెప్పకండి' అన్నాడు" అని నవ్వుతూ ఆనాటి ఘటనను వివరించాడు జగన్.
అన్నపూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల దగ్గర యాక్టింగ్ నేర్చుకుంది స్వీటీ. డాన్స్ అవీ నేర్చుకొని సూపర్ ఎనర్జీతో సూపర్ ఫిల్మ్‌లో చేసింది. "అంతకుముందు నాగార్జునగారు నీ పేరేంటని అడిగితే స్వీటీ అని చెప్పింది. 'కాదు, నీ ఒరిజినల్ పేరు' అనడిగారు. స్వీటీయేనని, తన పాస్‌పోర్ట్ చూపించింది. అందులో ఆ పేరే ఉంది. 'ఇలా కాదు, స్క్రీన్ నేమ్ మంచిది ఉండాలి' అన్నారు. ఆ తర్వాత ఈ పిల్లకు ఏం పేరు పెడదామని చాలా పేర్లు రాసుకున్నాం. అప్పడు మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా 'మిల మిల' అనే పాట రికార్డింగ్ కోసం సింగర్‌గా ఒక అమ్మాయిని పిలిపించాడు. ఆ అమ్మాయి పేరు అనుష్క. అది నాకు నచ్చి, 'ఈ పేరు ఎలా ఉంది?' అని స్వీటీని అడిగాను. 'బాగానే ఉంది కానీ, నాగార్జునగారిని కూడా అడుగుదాం' అంది. ఆయన్ని అడిగితే, మన హీరోయిన్లలో ఎవరికీ ఇలాంటి పేరు లేదు, పెట్టేయొచ్చన్నారు. ఆ అమ్మాయి రెండు రోజులు మాకు ఎక్సర్‌సైజ్ ఇచ్చింది. 'జగన్ గారూ.. రెండు రోజులు ఆ పేరుతో పిలుస్తుండండి. అదెలా ఉంటుందో ఫీలవుతాను' అంది. రెండు రోజులు ఆమెను 'అనుష్క' అంటూ పిలుస్తూ వచ్చాం. చివరకు 'చాలా బాగుంది' అని చెప్పింది. అలా అనుష్క అనే నామకరణం జరిగింది" అని అనుష్క అనే పేరు పెట్టడం వెనుక కథను పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.