10 ఫేమస్ కొరియన్ ఫిమేల్ స్టార్స్.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్!
on Aug 11, 2020
కొరియన్ (సౌత్) సినిమా పాపులారిటీ ఆ దేశ హద్దులు దాటి ప్రపంచమంతా విస్తరిస్తోంది. మనదేశంలోనూ కొరియన్ సినిమా లవర్స్ లక్షల్లో ఉన్నారు. ఆఖరుకి తెలుగులోనూ కొరియన్ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అంతేనా.. ఆ దేశానికి చెందిన తారలు అనేకమంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ఫలితంగా వారి ఆరాధకులూ అన్ని దేశాల్లో కనిపిస్తున్నారు. వారిలో బాగా ఫేమస్ అయిన పది మంది కొరియన్ ఫిమేల్ యాక్టర్లు ఎవరో తెలుసుకుందాం...
1. బే సుజీ
హాంకాంగ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగిన తొలి కొరియన్ నటిగా రికార్డులకెక్కిన బే సుజీ ఎనిమిదేళ్ల క్రితమే ఆర్కిటెక్చర్ 10 అనే మూవీతో పరిచయమై, అనేక అవార్డులను కొల్లగొట్టింది. దాన్ని బట్టి ఎంత స్వల్ప కాలంలో ఆమె టాప్ యాక్ట్రెస్‌గా, కొరియన్ల ఆరాధ్య తారగా అవతరించిందో ఊహించవచ్చు.
2. కిమ్ గో-ఎన్
తొలి సినిమా ఎ మ్యూజ్‌తోటే కొరియన్ ఆడియెన్స్ ఆరాధ్య తారగా అవతరించిన కిమ్ గో-ఎన్ పాపులారిటీని వర్ణించ శక్యం కాదు. ఇటు సినిమాలు, అటు టీవీ సిరీస్‌తో విలక్షణ నటిగా రాణిస్తూ వస్తోన్న ఆమెను చానల్ అనే ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ సౌత్ కొరియాకు తన బ్రాండ్ అంబాసడర్‌గా నియమించింది.
3. పార్క్ షిన్-హ్యే
పదమూడేళ్ల వయసులోనే నటిగా పరిచయమైన పార్క్ షిన్-హ్యే యు.ఎస్.లోని కొరియన్ వేవ్ నిర్వహించిన పోల్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన కొరియన్ తారగా నిలిచింది. తన దేశంలోనూ టాప్ యాక్ట్రెస్ హోదాని అనుభవిస్తున్న ఆమెకు అక్కడి ప్రధాన మంత్రి ప్రశంసాపత్రం కూడా లభించింది.
4. ఐయు
సౌత్ కొరియాలో అత్యధికంగా ఆర్జిస్తున్న సెలబ్రిటీల్లో ఒకతిగా అశేష అభిమానులను సంపాదించుకున్న ఐయు కేవలం న్యూ జనరేషన్ యాక్ట్రెస్ మాత్రమే కాదు.. సింగర్, లిరిక్ రైటర్ కూడా. నటి కాకముందు సింగర్‌గా ఫేమస్ అయిన ఆమె ఫోర్బ్స్ ఏషియాస్ 2019 హీరోస్ ఆఫ్ ఫిలాంత్రఫీ లిస్ట్‌లో యంగెస్ట్ సెలబ్రిటీగా నిలిచింది.
5. జున్ జి-హ్యున్
2001లో వచ్చి ఇంటర్నేషనల్‌గా కొరియన్ మూవీస్‌కు పాపులారిటీ తీసుకొచ్చిన రొమాంటిక్ కామెడీ మై సాసీ గాళ్ మూవీలో హీరోయిన్‌గా నటించి యూత్ డ్రీమ్ గాళ్‌గా మారిన జున్ జి-హ్యున్.. హాలీవుడ్ మూవీ బ్లడ్: ద లాస్ట్ వాంపైర్‌లో హీరోయిన్‌గా నటించేంతగా పాపులారిటీని సంపాదించింది.
6. లీ యంగ్-ఏ
మోడల్ నుంచి నటిగా మారిన లీ యంగ్-ఏ విభిన్న రకాల సినిమాలు, టీవీ సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన ఆమెను సౌత్ కొరియన్ ప్రభుత్వం మెడల్ ఆఫ్ కల్చర్ మెరిట్‌తో సత్కరించింది.
7. బే డూనా
అసాధారణ ప్రతిభ ఉన్న నటిగా అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన కొరియన్ తార బే డూనా. టీవీ సీరియల్స్‌లో నటించడం ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత హాలీవుడ్ నుంచి పిలుపు అందుకునే స్థాయికి వెళ్లింది.
8. ఇమ్ యూన్-అ
ఇటు యాక్టర్‌గా, అటు సింగర్‌గా పాపులర్ అయిన ఇమ్ యూన్-అ టీనేజ్‌లో ఉండగానే 2007లో యూనా మూవీలో నటించి, ఓవర్‌నైట్ స్టార్‌గా పాపులర్ అయిపోయింది. బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఆమె హీరోయిన్.
9. చోయ్ జి-వూ
కొరియన్ తారల్లో గొప్ప అందగత్తెగా కీర్తి పొందిన చోయ్ జి-వూ వింటర్ సొనాటా మూవీతో పాన్-ఏషియన్ తారగా అవతరించింది. 2008లో స్టార్ చానల్‌లో ప్రసారమైన లవర్ సిరీస్‌లో స్టార్ అట్రాక్షన్‌గా మారి ఆ టైమ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న కొరియన్ తారగా నిలిచింది.
10. జియోన్ డు-యెవాన్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గెలుచుకున్న ఏకైక కొరియన్ తారగా జియోన్ డు-యెవాన్ పేరు పొందింది. అయితే ఆమె కొరియాలో టాప్ ఫిమేల్ యాక్టర్ కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న కొరియన్ తారల్లో ఆమెది టాప్ ప్లేస్.