ఓటీటీలోకి ‘నిశ్శబ్దం’... ప్రేక్షకుల కోరిక!
on Aug 11, 2020
తెలుగు ప్రేక్షకులకు ‘అరుంధతి’ అయినా, దేవసేన అయినా అనుష్కే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘నిశ్శబ్దం’. మార్చిలో కరోనా రక్కసి కోరలు చాచడంతో థియేటర్లలోకి రావాల్సిన సినిమా విడుదల వాయిదా పడింది. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు సమాలోచనలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో ‘నిశ్శబ్దం’ రచయిత, చిత్ర నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ వాటిని ఖండించారు. తర్వాత పరిస్థితులను బట్టి ఓటీటీలో విడుదల చేస్తామన్నారు. ఇప్పుడు ట్విట్టర్‌లో ఆయన ఒక పోల్ పెట్టారు.
‘‘ఒకవేళ థియేటర్లలో చూడాలంటే జనవరి లేదా ఫిబ్రవరి వరకూ వెయిట్ చేయాల్సి వస్తే... మీరు ‘నిశ్శబ్దం’ను ఎక్కడ చూడాలని అనుకుంటున్నారు. థియేటర్లలోనా? ఓటీటీలోనా? ఎక్కడైనా పర్లేదా?’’ అని ప్రేక్షకులను కోన వెంకట్ అడిగారు. ఇప్పటివరకూ 18,688 మంది వోట్ చేయగా... 56.2 శాతం మంది ఓటీటీలో, 28.8 శాతం మంది థియేటర్లలో సినిమాను చూడాలనుకుంటున్నట్టు, 14..9 శాతమంది ఎక్కడైనా పర్లేదని ఓట్ వేశారు. దీన్ని బట్టి మెజారిటీ ప్రేక్షకులు ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నట్టు స్పష్టమైంది.
Also Read