బ్రేకింగ్... అమృత... ఆర్జీవీ... మధ్యలో కరోనా!
on Aug 11, 2020
దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది నల్గొండలోని కోర్టుకు తెలిపారు. కొవిడ్–19 వైరస్ సోకడంతో అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని న్యాయవాది అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువుహత్య కేసు ఆధారంగా ‘మర్డర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రణయ్ భార్య అమృత, అతని తండ్రి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాను అడ్డుకోవాలని కోర్టులో కేసు వేశారు. అది మంగళవారం విచారణకు వచ్చింది. వర్మ హాజరు కాలేదు. కరోనా కారణంగా విచారణకు వర్మ రాలేకపోయారని, అందువల్ల విచారణ వాయిదా వేయాలని కోర్టును న్యాయవాది కోరారు. దాంతో ఈ నెల 14కు విచారణ వాయిదా వేశారు.
కోర్టుకు రామ్‌గోపాల్ వర్మ తప్పుడు సమాచారం ఇచ్చారని అమృత, అతని న్యాయవాది అంటున్నారు. రెండు రోజుల క్రితం వర్మకు జ్వరం వచ్చిందనీ, కరోనా కావచ్చునని ఒకరు వార్త రాయగా, తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వర్మ ఒక వీడియో విడుదల చేశారు. ఆ ట్వీట్, వీడియో కోర్టు ముందు పెడతామని అమృత అంటున్నారు. కోర్టు విచారణ తప్పించుకోవాడానికి వర్మ కరోనా నాటకం ఆడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ‘మర్డర్’ ట్రైలర్ విడుదల చేసిన వర్మ, ఇటీవల రెండు పాటలు విడుదల చేశారు.
ఇప్పుడు వర్మకు కరోనా సోకిందా? లేదా? అనేది పజిల్ గా మారింది. స్వయంగా వర్మ తనకు ఏమి లేదని ట్వీట్ చేయడం, తరవాత కోర్టులో ఆయనకు కరోనా అని న్యాయవాది చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read