తారాగణం: సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, విష్ణు తదితరులు
సంగీతం: జై క్రిష్
డీఓపీ: సమీర్ కళ్యాణి
ఎడిటర్: అనిల్ కుమార్
దర్శకుడు: అభిలాష్ కంకర
నిర్మాత: సునీల్ బలుసు
బ్యానర్: వి సెల్యులాయిడ్స్
విడుదల తేదీ: అక్టోబర్ 11, 2024
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తుంటాడు సుధీర్ బాబు. ఇప్పుడు ఆయన 'మా నాన్న సూపర్ హీరో' అనే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ కంకర దర్శకుడు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
జానీ (సుధీర్ బాబు) పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకుంటాడు. తండ్రి ప్రకాష్ (సాయిచంద్) చేయని తప్పుకి జైలు పాలవుతాడు. దీంతో జానీ అనాథాశ్రమంలో పెరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో అతన్ని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. మొదట్లో జానీని బాగానే చూసుకుంటాడు. కానీ ఆ తర్వాత తన భార్య చనిపోవడం, ఆర్థికంగా చితికిపోవడంతో.. జానీ రాకను తన కుటుంబానికి అరిష్టంగా భావించి.. అతనిపై కోపం పెంచుకుంటాడు శ్రీనివాస్. కానీ జానీ మాత్రం శ్రీనివాస్ ని కన్న తండి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ ని ఒక రాజకీయనాయకుడు జైల్లో పెట్టిస్తాడు. అతన్ని కాపాడాలంటే 20 రోజుల్లో కోటి రూపాయలు సర్దాల్సి వస్తుంది. దీంతో ఆ బాధ్యతను జానీ తీసుకుంటాడు. మరోవైపు 20 ఏళ్ళ తర్వాత జైలు నుంచి విడుదలైన ప్రకాష్ తన కొడుకుని వెతుక్కుంటూ వస్తాడు. పెంచిన తండ్రి శ్రీనివాస్ ని కాపాడుకోవడం కోసం జానీ ఏం చేశాడు? తన కొడుకు జానీని కన్న తండ్రి ప్రకాష్ కలుసుకున్నాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది. పెంచిన తండ్రిని కాపాడుకోవడం కోసం కొడుకు చేసే ప్రయత్నాలు, కొడుకుని కలుసుకోవడం 20 ఏళ్ళ తర్వాత కన్న తండ్రి మొదలుపెట్టిన ప్రయాణం. ఇలాంటి పాయింట్ ని తీసుకున్నప్పుడు కథని ఎమోషనల్ గా నడిపించాలి. ఆసక్తికర కథనం, హత్తుకునే సన్నివేశాలు ఉండాలి. అప్పుడే ప్రేక్షకుడు సినిమాలో లీనమైపోతాడు. కానీ ఈ విషయంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.
చేయని నేరానికి ప్రకాష్ జైలుపాలవ్వడం, జానీ అనాథగా మారడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత జానీ-శ్రీనివాస్ చుట్టూ కథ తిరుగుతుంది. జానీపై శ్రీనివాస్ కోపం పెంచుకున్నా, జానీ మాత్రం శ్రీనివాస్ ని ఎంతో ప్రేమగా చూసుకోవడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మెప్పించాయి. శ్రీనివాస్ జైలుపాలవ్వడం, అతన్ని కాపాడాలంటే కోటి రూపాయలు అవసరమవ్వడం.. మరోవైపు జైలు నుంచి ప్రకాష్ విడుదలై, కొడుకుని వెతుక్కుంటూ రావడం.. ఇక్కడినుంచి సినిమాని ఎమోషనల్ నడిపించవచ్చు. కోటి రూపాయలు సర్దుబాటై శ్రీనివాస్ బయటకు వస్తాడా? ప్రకాష్ కన్న కొడుకుని కలుసుకుంటాడా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయవచ్చు. కానీ ఇక్కడ దర్శకుడు తడబడ్డాడు. పేపర్ మీద రాసుకున్న భావోద్వేగాలను తెర మీద పండించడంలో విఫలమయ్యాడు. విరామ సన్నివేశాలు, పతాక సన్నివేశాలు మాత్రం మెప్పించాయి. అదే స్థాయిలో మధ్యలో సంఘర్షణ కూడా ఉన్నట్లయితే సినిమా అవుట్ పుట్ మరో స్థాయిలో ఉండేది. పైగా ఇలాంటి ఎమోషనల్ జర్నీలో లాటరీ ట్రాక్ ని తీసుకురావడం అనేది కావాలని ఇరికించినట్లుగా ఉంది కానీ.. కనెక్ట్ అయ్యేలా లేదు. లాటరీ అని కాకుండా.. కష్టపడి సంపాదించిన సొమ్మో లేక ఆస్తో అన్నట్టుగా చూపిస్తే ఇంకా ఎమోషనల్ గా ఉండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
పెంచిన తండ్రి ప్రేమను దక్కించుకోవడానికి తపనపడే జానీ పాత్రలో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. పెంచిన తండ్రి శ్రీనివాస్ గా షాయాజీ షిండే, కన్న తండ్రిగా సాయిచంద్ తమ సీనియారిటీతో మెప్పించారు. రాజు సుందరం, శశాంక్, విష్ణు తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. జై క్రిష్ సంగీతం ఓకే. పాటలు బాగున్నాయి కానీ, నేపథ్య సంగీతం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
దర్శకుడు ఎంచుకున్న కథ బాగానే ఉంది. కానీ ఆ కథని మనసులకు హత్తుకునేలా భావోద్వేగభరితంగా మలచలేకపోయాడు. నెమ్మదిగా సాగే కథనం, కొరవడిన భావోద్వేగాల కారణంగా.. 'మా నాన్న సూపర్ హీరో' ఓ మాములు సినిమాలా మిగిలిపోయింది.