తారాగణం: సూర్య, బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణ్యం , కోవై సరళ , ఆనందరాజ్, కెఎస్ రవికుమార్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిసామి
ఎడిటింగ్: నిషాద్ యూసఫ్
ప్రొడక్షన్ డిజైనర్: మిలన్
దర్శకత్వం: శివ
నిర్మాతలు: జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
బ్యానర్స్: స్టూడియో గ్రీన్, యు.వి. క్రియేషన్స్
విడుదల తేదీ: నవంబర్ 14, 2024
తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ హీరోలలో సూర్య ఒకరు. అయితే సూర్య బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ అందుకొని చాలా కాలమైంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు మెప్పించినప్పటికీ, అవి నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అందుకే సాలిడ్ హిట్ తో తన బాక్సాఫీస్ పవర్ చూపించాలి అనుకుంటున్నాడు సూర్య. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ కంగువా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ, ఈ పాన్ ఇండియా సినిమాకి దర్శకత్వం వహించాడు. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొందరైతే కోలీవుడ్ కి రూ.1000 కోట్ల సినిమా లేని లోటుని కంగువా తీరుస్తుందని కూడా అభిప్రాయపడ్డారు. మరి నిజంగానే కంగువా ఆ స్థాయిలో ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రష్యాలో కొందరు చిన్న పిల్లల బ్రెయిన్ లపై ప్రయోగం జరుగుతుంటుంది. అందులో నుంచి జీటా అనే పిల్లాడు తప్పించుకొని గోవాకి వస్తాడు. అక్కడ ఫ్రాన్సిస్(సూర్య), ఏంజెలీనా(దిశా పటాని) బౌంటీ హంటర్స్ గా పని చేస్తుంటారు. ఫ్రాన్సిస్ ఒక క్రిమినల్ ని పట్టుకునే క్రమంలో అతను చనిపోతాడు. ఈ ఘటనను జీటా చూస్తాడు. ఆ విషయం జీటా ఎవరికైనా చెప్తే ప్రమాదమని తెలిసిన ఫ్రాన్సిస్, ఆ పిల్లాడిని తన దగ్గరే ఉంచుకుంటాడు. మరోవైపు బ్రెయిన్ ప్రయోగం వల్ల జీటాకి పునర్జన్మ గుర్తుకురావడంతో పాటు, కొన్ని పవర్స్ వస్తాయి. అలాగే అతను ఫ్రాన్సిస్ లో కంగువా(సూర్య)ని చూసుకుంటూ ఉంటాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో తనకు ఏదో తెలియని అనుబంధముందనే ఫీలింగ్ లో ఉంటాడు. ఈ క్రమంలో జీటా ప్రాణాలకు అనుకోని ప్రమాదం ఏర్పడుతుంది. అసలు బీటా ఎవరు? గత జన్మలో అతనికి కంగువాతో ఉన్న బంధమేంటి? కంగువా ఎవరు? పంచకోనలో యోధుడుగా పేరున్న కంగువా ప్రాణానికి, అతని తెగ ప్రాణాలకు ఉన్న ముప్పు ఏంటి? ఇందులో రుధిర(బాబీ డియోల్) పాత్ర ఏంటి? కంగువా ప్రాణాలకు తెగించి, తన తెగను కాపాడుకోగలిగాడా? ప్రస్తుత జన్మలో జీటా అసలు ఫ్రాన్సిస్ ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? జీటాకి ఎదురైన ప్రమాదం నుంచి ఫ్రాన్సిస్ కాపాడగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
పునర్జన్మల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కంగువా కూడా ఆ కోవకు చెందినదే. ప్రస్తుతంలో పునర్జన్మ తాలూకు జ్ఞాపకాలను, శక్తులను తట్టిలేపుతూ కొందరు పిల్లల బ్రెయిన్ లపై జరిగే ప్రయోగం చూపిస్తే.. వందల ఏళ్ళ క్రితం నాటి జన్మలో పంచకోన అంటూ ఐదు ప్రాంతాలను, అందులోని ఐదు తెగలను చూపించారు. అందులో ఒక తెగకు యువ నాయకుడిగా కంగువా పాత్రలో సూర్య కనిపించాడు. కంగువా పాత్రను ఎంతో బలవంతుడిగా చూపించారు.. కానీ, సినిమాలో అందుకు తగ్గ బలమైన కథాకథనాలు లేవు..
జీటా తప్పించుకొని గోవా రావడం, అక్కడ సూర్య, దిశా పటాని పాత్రల పరిచయంతో సినిమా ప్రారంభమైంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు విసిగించాయి. ఓ పాన్ ఇండియా సినిమాకి తగ్గట్టుగా కాకుండా, సీన్స్ అన్నీ చాలా సిల్లీగా ఉంటాయి. పంచకోన నేపథ్యంలో వచ్చే గత జన్మ తాలూకు సన్నివేశాలు కొంత పరవాలేదు. కంగువా పరిచయ సన్నివేశాలు మెప్పించాయి. అయితే ఆ తర్వాత బలమైన సన్నివేశాలు, ఆసక్తికర కథనం తోడు కాలేదు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాధారణ ప్రేక్షకులకు గందరగోళాన్ని కలిగిస్తాయి. యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా రూపొందించారు కానీ, వాటికి కలిపే బలమైన ఎమోషన్ లేదు. భారీతనంతో విజువల్ గా సీన్స్ బాగుంటాయి కానీ, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండవు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ప్రేక్షకుల ఊహకి అందేలాగానే ఉంటుంది. అయితే మిగతా సీన్స్ తో పోలిస్తే కాస్త బెటర్. అలాగే ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు రుధిర పాత్రలో బాబీ డియోల్ కనిపించాడు. కానీ ఆయన పాత్రను అంత పవర్ ఫుల్ గా మలచలేదు. కంగువా, రుధిర మధ్య వైరం సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నాయి.
సాంకేతికంగా కంగువా ఉన్నతంగా ఉంది. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. తన కెమెరా పనితనంతో ప్రేక్షకులని కంగువా ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు. రెండు భిన్న కాలాలను కెమెరాలో చక్కగా బంధించాడు. ముఖ్యంగా పీరియాడిక్ సన్నివేశాలను బంధించిన తీరు అమోఘం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం జస్ట్ ఓకే. పాటలలో కానీ, నేపథ్య సంగీతంలో కానీ పూరిస్థాయిలో ఆయన మార్క్ కనిపించలేదు. వందల ఏళ్ళ నాటి కంగువా ప్రపంచాన్ని కళ్ళకి కట్టినట్టు సృష్టించడంలో ప్రొడక్షన్ డిజైనర్ మిలన్ సక్సెస్ అయ్యాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ తో పాటు మేకప్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లు అద్భుతంగా పనిచేశాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ పరవాలేదు. ఎడిటర్ గా నిషాద్ యూసఫ్ సినిమాకి బాగానే న్యాయం చేశారు. దర్శకుడి ఆలోచనకు, ఆయన స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా.. నిషాద్ ఎడిటింగ్ సాగింది. కాగా, సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందే నిషాద్ కన్నుమూయడం విషాదకరం. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపించింది.
నటీనటుల పనితీరు:
సూర్య ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగువాతో మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశాడు. రెండు వేరు వేరు కాలాలకు చెందిన భిన్న పాత్రల్లో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా కంగువా పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. సూర్య నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఇక బాబీ డియోల్ కూడా రుధిర పాత్రలో బాగానే రాణించాడు. ఆహార్యం, హావభావాలతోనే భయపెట్టేశాడు. అయితే ఆయన పాత్రను ఎలివేట్ చేసేలా బలమైన సన్నివేశాలు పడలేదు. దిశా పటాని పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, ఉన్నంతలో పరవాలేదు అనిపించుకుంది. యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణ్యం , కోవై సరళ , ఆనందరాజ్, కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
సూర్యతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. కానీ వారి కష్టానికి తగ్గ బలమైన స్క్రిప్ట్ తోడవ్వలేదు. సూర్యతో పాటు చిత్ర బృందమంతా పడిన కష్టం కోసం, భారీతనం కోసం ఒకసారి చూసేయొచ్చు.
- గంగసాని