నయనతార, రమ్యకృష్ణ, సచిన్ టెండూల్కర్ భార్య అంజలి వంటి ప్రముఖులు ఒక రియల్ ఎస్టేట్ స్కామ్‌లో చిక్కుకొని కోట్ల రూపాయలు నష్టపోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఒక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ శివార్లలో రావిర్యాల అనే ప్రాంతంలో అనేక ఎకరాల భూమిని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు విక్రయించినట్లు వినిపిస్తోంది. అక్కడ భారీ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలోని బిజినెస్ట్ పార్టనర్స్ మధ్య తలెత్తిన వివాదంతో అది చెరువు కింద ఉన్న భూమి అనీ, అందులో ఆవాసాల నిర్మాణానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదనే విషయం బయటపడింది.
జరుగుతున్న ప్రచారం ప్రకారం సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఎకరం భూమిని ఒక లక్ష రూపాయలకు కొని, వీవీఐపీలకు రూ. 10 కోట్లకు అమ్మింది. నయనతార, రమ్యకృష్ణ చెరో ఎకరం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సచిన్ భార్య అంజలి అయితే ఏకంగా ఆరు ఎకరాలు కొనుగోలు చేసిందంటున్నారు. ఈ వ్యవహారంపై ఆ సంస్థకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఒక నోటీస్‌ను పంపిందనీ, నయనతార, రమ్యకృష్ణ, అంజలీ టెండూల్కర్ పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇచ్చేశారా అని ఆరా తీసిందనీ వినిపిస్తోంది. అయితే ఈ ఉదంతంపై ఇంత దాకా నయనతార కానీ, రమ్యకృష్ణ కానీ స్పందించలేదు.