విభిన్న కథలతో సినిమాలు తీసే దర్శకుడు విక్రమ్ కుమార్ అంటే ప్రేక్షకులకే కాదు హీరోలకూ ఇష్టమే. 'ఇష్క్', 'మనం', '24' సినిమాలు చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అభిమానిగా మారారు. విక్రమ్‌తో కలిసి పనిచేయడానికి అప్పట్నుంచీ తారక్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాట వాస్తవం. నిజానికి '24' తర్వాత అల్లు అర్జున్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తీయడానికి విక్రమ్ ప్లాన్ చేశారు. అయితే ఎందువల్లో అది వర్కవుట్ కాలేదు. ఆయనతో సినిమా చేయడానికి బదులుగా వక్కంతం వంశీని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య' సినిమా చేశాడు బన్నీ. మరోవైపు విక్రమ్ కూడా అఖిల్‌తో 'హలో' సినిమా తీశాడు.
కాగా ఆ టైమ్‌లోనే తారక్‌కు విక్రమ్ ఓ కథ వినిపించిన విషయం కొద్దిమందికి తెలుసు. త్రివిక్రమ్‌తో 'అరవింద సమేత.. వీరరాఘవ' మూవీ చేశాక విక్రమ్ డైరెక్షన్‌లో తారక్ చేస్తాడని వాళ్లనుకున్నారు. కానీ అది కూడా వాస్తవ రూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరి కాంబో మూవీ గురించిన ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో నడుస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో తారక్‌తో విక్రమ్ భేటీ అయ్యారనీ, ఒక కథ గురించి ఇద్దరూ చర్చించుకున్నారనీ చెప్పుకుంటున్నారు. అయితే విక్రమ్ ఇప్పటికే నాగచైతన్యతో 'థాంక్యూ' సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దాని తర్వాత ఆయనతో తారక్ పనిచేసే అవకాశాలు ఉన్నాయనేది తాజా ఖబర్. ఈసారైనా వాళ్ల కాంబినేషన్ మూవీ సెట్స్ దాకా వస్తుందో, లేదో చూడాలి.