అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ చేస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ ఈ వేసవికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా విడుదల కరోనా మహమ్మారి దెబ్బకు అనివార్యంగా వాయిదా పడింది. కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేసిన దాని ప్రకారమే బుధవారం నిర్మాతలు ఇందులోని కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. క్వారంటైన్లో ఒక బ్రహ్మచారి, ఒక బ్రహ్మచారిణి లైఫ్ ఎలా ఉంటుందో ఆ పోస్టర్లో చూపించే ప్రయత్నం చేశారు.
ఆ పోస్టర్లో సోఫాలో కూర్చొని ఓ వైపు టీ తాగుతూ, మరోవైపు లాప్‌టాప్‌పై దీక్షగా పనిచేసుకుంటున్న అఖిల్‌ను వెనుక చైర్లో కూర్చొని టీ తాగుతూ కాలి వేళ్లతో అఖిల్ చెవిని టచ్ చేస్తూ టీజ్ చేస్తోంది పూజా హెగ్డే. షార్ట్స్ వేసుకున్న ఆమె రొమాంటిక్ మూడ్‌లో ఉంటే, అఖిల్ మాత్రం వర్క్ మూడ్‌లో ఉన్నాడు. చూడగానే ఆ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అఖిల్, పూజ జంట కూడా చూడ ముచ్చటగా కనిపిస్తున్నారు. 2021 సంక్రాంతికి వస్తున్నట్లు ఆ పోస్టర్లో పేర్కొన్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ సమకూరుస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ను బన్నీ వాస్, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.