
నాగార్జున టాప్ 10 మూవీస్ ఇవే!
కింగ్ నాగార్జున.. నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. స్వీట్ 60 క్లబ్ లోనూ గ్లామర్ తో కనువిందు చేస్తున్న 'మన్మథుడు'. అలాంటి నాగ్ ని తెలుగునాట 'కింగ్'ని చేసిన టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.. 1. గీతాంజలి: అప్పటి యువతకి సరికొత్త ప్రేమకథని పరిచయం చేసిన చిత్రమిది. ఇందులో క్యాన్సర్ వ్యాధికి గురైన యువకుడు ప్రకాశ్ గా తన సహజ నటనతో ఆకట్టుకున్నారు నాగ్. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ సినిమాకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు ఎస్సెట్ గా నిలిచాయి. 2. శివ: టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ లో 'శివ' ఒకటి. ఈ సినిమాతోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరంగేట్రం చేశారు. ఇందులో విభిన్న ఛాయలున్న శివ పాత్రలో తన అద్బుత నటనతో అలరించారు నాగ్. హిందీలోనూ ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ అయి.. అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 3. ప్రెసిడెంటు గారి పెళ్ళాం: 'శివ' తరువాత ట్రాక్ తప్పిన నాగార్జున కెరీర్ ని.. మళ్ళీ విజయపథంలోకి తీసుకువచ్చిన సినిమా 'ప్రెసిడెంటు గారి పెళ్ళాం'. ఈ చిత్రాన్ని ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. ఇందులో పల్లెటూరి యువకుడు రాజాగా మాస్ ని భలేగా ఎంటర్టైన్ చేశారు నాగ్. 4. హలో బ్రదర్: తెరపై ఒక్క నాగార్జున కనిపిస్తేనే.. ఫ్యాన్స్ కి మస్త్ ఎంటర్టైన్మెంట్. అలాంటిది రెండు పాత్రల్లో దర్శనమిస్తే.. అది 'హలో బ్రదర్'లా అటు క్లాస్ ని, ఇటు మాస్ ని మెస్మరైజ్ చేసే బ్లాక్ బస్టర్ బొమ్మే. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దేవా, రవివర్మ గా తన ద్విపాత్రాభినయంతో అభిమానులను అలరించారు ఈ అక్కినేని వారి హ్యాండ్సమ్ స్టార్. 5. నిన్నే పెళ్ళాడతా: కుటుంబ ప్రేక్షకులకు నాగ్ ని ఎంతో దగ్గర చేసిన సినిమా 'నిన్నే పెళ్ళాడతా'. ఇందులో శీను పాత్రలో ఎంతో నేచురల్ గా కనిపించి మురిపించారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టబుతో నాగ్ పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇప్పటికీ చర్చనీయాంశమే. 6. అన్నమయ్య: నాగ్ కెరీర్ ని 'అన్నమయ్య'కి ముందు, తరువాత అన్నంతగా ప్రభావం చూపిన సినిమా. నిజంగా అన్నమయ్య అంటే ఇలానే ఉంటారేమో అన్నట్లుగా పాత్రలో ఒదిగిపోయారు నాగ్. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా తొలి నందిని అందుకోవడమే కాకుండా స్పెషల్ మెన్షన్ కేటగిరిలో జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకున్నారు నాగార్జున. 7. నువ్వు వస్తావని: 'అన్నమయ్య' చిత్రం తరువాత సరైన విజయాల్లేని నాగ్ ని.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రం 'నువ్వు వస్తావని'. ఇందులో చిన్నికృష్ణ పాత్రలో జీవించేశారు నాగ్. ఈ సాఫ్ట్ రోల్ తో మహిళా ప్రేక్షకులకు మరెంతో దగ్గరయ్యారు. నూతన దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ రూపొందించిన 'నువ్వు వస్తావని' అప్పట్లో ఓ సంగీత సంచలనం. 8. మన్మథుడు: అమ్మాయిలంటే అస్సలు పడని అభిరామ్ అనే యువకుడిగా నాగ్ ఎంటర్టైన్ చేసిన మూవీ 'మన్మథుడు'. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ విజయభాస్కర్ డైరెక్టోరియల్.. నాగ్ కి సరికొత్త అభిమాన గణాన్ని అందించింది. ఇక 'మన్మథుడు' అనే టైటిల్ కాస్త నాగ్ కి ముద్దు పేరైపోయింది. 9. మనం: ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కలిసి నటించడమంటేనే.. ఓ అపురూపమైన అంశం. దానికి ఓ అద్భుతమైన కథ తోడైతే.. అది 'మనం' చిత్రమే. ఇటు తండ్రి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతోనూ, అటు తనయుడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతోనూ నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ మెమరబుల్ మూవీని విక్రమ్ కుమార్ తీర్చిదిద్దారు. 10. సోగ్గాడే చిన్ని నాయనా: తండ్రీకొడుకులుగా నాగార్జున నటించిన మాస్ ఎంటర్టైనర్ ఇది. అంతేకాదు.. అప్పటికి నాగ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా కూడా. నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో బంగార్రాజు, రాముగా మెస్మరైజ్ చేశారు కింగ్. [Akkineni Nagarjuna, Birthday Special, Top 10 Movies, King 100, Geethanjali Movie, Siva Movie, Manam Movie, Telugu Cinema, Telugu News]
Aug 29, 2026 11:21AM
తెలుగు వారి సీతమ్మ తల్లి అంజలీదేవి: సావిత్రి కథ లాంటిదే ఈ మహానటిది కూడా.!
సాత్విక పాత్రలకు, కరుణ రసాన్ని పలికించే పాత్రలకు, పురాణ ఇతిహాసాల్లోని పతివ్రతల పాత్రలకు పెట్టింది పేరు అంజలీదేవి. పౌరాణిక చిత్రాల్లోని పాత్రలకు తన అద్వితీయమైన నటన ద్వారా జీవం పోశారు. లవకుశలో పోషించిన సీతమ్మతల్లి పాత్ర అంజలి జీవితాన్నే కాదు, ఎంతో మంది జీవితాలను కూడా ప్రభావితం చేసింది. ఒక దశలో సీత అంటే అంజలీదేవే అని ప్రజలు భావించేవారు. ఆమె బయట కనిపిస్తే కాళ్ళకు నమస్కరించేవారు. ఈ తరహా పాత్రల్లో అంజలికి వచ్చినంత పేరు మరే నటికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బిజీ హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. అలా చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయన్నది వారి బాధ. అంజలి మాత్రం ఇద్దరు ప్లిలలు పుట్టిన తర్వాత సినిమా రంగానికి వచ్చారంటే ఆశ్చర్యం కలగక మానదు. చిన్నతనం నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ వచ్చిన అంజలికి సినిమాల్లోకి వెళ్లాలన్న కోరిక ఉండేది కాదు. అలాంటి అంజలీదేవి సినిమాల్లోకి ఎలా ప్రవేశించారు, ఆమె కెరీర్ ఎన్ని మలుపులు తిరిగింది, సినిమాల్లో ఆమె సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1927 ఆగస్ట్ 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు అంజలీదేవి. ఆమె అసలు పేరు అంజనీకుమారి. ఈమె తండ్రి నూకయ్య రంగస్థల కళాకారుడు. నాటకాలు వేయడం, నాటకాలకు సంగీతం సమకూర్చడం వంటివి చేసేవారు. 9 ఏళ్ళ వయసులో మొట్టమొదటిసారి రంగస్థలంపై అడుగు మోపారు అంజలి. ఆ తర్వాత స్కూల్ మాన్పించి ఆమెకు సంవత్సరంపాటు సంగీతం, నృత్యం నేర్పించారు. అయితే వాటికంటే చదువుకోవడానికే ఆమె ఎక్కువ ఇష్టపడేవారు. అయినా కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో వుండే ఆదినారాయణరావు దగ్గర నటనలో శిక్షణ ఇప్పించేందుకు చేర్పించారు నూకయ్య. అక్కడ నటన నేర్చుకుంటూనే చదువుకునేవారు. ఆదినారాయణరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అంజలి. ఆ క్రమంలోనే ఆయనంటే ఆమెకు ఆరాధనా భావం కలిగింది. యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ వేసే నాటకాల్లో, ఇతర నాటక పరిషత్‌లు వేసే నాటకాలతో బిజీ అయిపోయారు అంజలి. అప్పుడు అంజలికి పెళ్లి చేయాలని తండ్రి నూకయ్య సంబంధాలు చూశారు. అయితే తను పెళ్ళంటూ చేసుకుంటే ఆదినారాయణరావునే చేసుకుంటాను అని పట్టుపట్టారు అంజలి. అప్పటికే పెళ్ళయి పిల్లలు కూడా ఉన్న ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నూకయ్య ఒప్పుకోలేదు. చివరికి తండ్రిని ఒప్పించి, ఆదినారాయణరావు కుటుంబ సభ్యుల్ని కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ సమయంలో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న గొల్లభామ చిత్రంలో నటించమని అంజలిని అడిగారు. సినిమాల్లో నటించడం అంజలికి, ఆదినారాయణరావుకు ఇష్టం లేకపోయినా పెద్దాయన అడిగారని ఒప్పుకున్నారు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే అంజనీకుమారిగా ఉన్న ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు సి.పుల్లయ్య. ఆ సినిమాలో ఆమెకు వ్యాంప్ క్యారెక్టర్ ఇచ్చారు. అది అంజలికి మంచిపేరు తెచ్చింది. దాంతో ఆ తర్వాత అన్నీ వ్యాంప్ క్యారెక్టర్సే వచ్చాయి. అలా మూడు సంవత్సరాలపాటు వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు. ఈ విషయంలో అంజలీదేవి ఎంతో బాధపడ్డారు. మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం వస్తే బాగుండేది అనుకున్నారు. ఆ సమయంలోనే ఘంటసాల బలరామయ్య... శ్రీలక్ష్మమ్మ కథ పేరుతో రూపొందిస్తున్న సినిమాలో అంజలికి ప్రధాన పాత్ర ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించకపోయినా అంజలికి నటిగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా పల్లెటూరి పిల్ల చిత్రంలో అంజలికి హీరోయిన్ అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్, ఎఎన్నార్ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత అంజలీదేవి 15 సంవత్సరాలపాటు హీరోయిన్గా కొనసాగారు. అనార్కలి, సువర్ణసుందరి, జయభేరి, భీష్మ, చెంచులక్ష్మీ వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. 1958లో సి.పుల్లయ్య దర్శకత్వంలో లవకుశ చిత్రంలో సీతగా నటించారు అంజలీదేవి. ఈ సినిమా ఆమె సినీ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా చిత్రీకరణ ఐదేళ్ళపాటు జరిగింది. 1963లో విడుదలైన లవకుశ అఖండ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి సీత అంటే అంజలీదేవేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరో పక్క ఆదినారాయణరావు సంగీత దర్శకుడిగా చాలా బిజీ అయిపోయారు. ఆ తర్వాత భక్త ప్రహ్లాద, బడిపంతులు, తాత మనవడు వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు అంజలి. నటిగానే కాదు, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు. 1953లో అంజలి పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పరదేశి అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తం 28 సినిమాలు నిర్మించారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలన్నింటికీ ఆదినారాయణరావే సంగీత దర్శకుడు. 70, 80 దశకాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అందరికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు అంజలీదేవి. 1992లో వచ్చిన బృందావనం ఆమె నటించిన చివరి సినిమా. ఇక అవార్డుల గురించి చెప్పాలంటే.. ఉత్తమ నటిగా అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మీ, జయభేరి చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, రఘుపతి వెంకయ్య పురస్కారం, రామినేని పురస్కారం, ఎన్.టి.ఆర్. జాతీయ పురస్కారం అంజలీదేవిని వరించాయి. 40 సంవత్సరాలకు పైగా నాటక రంగానికి, సినిమా రంగానికి విశేష సేవలు అందించిన అంజలీదేవి 2014 జనవరి 13న 86 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. ఆమె తన అవయవాలను రామచంద్ర మెడికల్ కాలేజీకి దానమిచ్చారు. (ఆగస్ట్ 24 నటి అంజలీదేవి జయంతి సందర్భంగా..) Anjali Devi, Goddess Sita, Lava Kusa Movie
Aug 24, 2026 12:37PM
చిరంజీవి బర్త్ డే రోజు రిలీజైన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా!
ఆగష్టు 22 ..ఈ డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే చెప్పని తెలుగు వాళ్ళు లేరు. అంతలా చిరంజీవి తన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల సొంత మనిషిగా మారారు. ఒకటి కాదు, రెండు కాదు నాలుగున్నర దశాబ్దాల నుంచి తనదైన మేనరిజమ్స్, డైలాగ్స్, ఫైట్స్ తో తెలుగు సినిమాపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉన్నారు. మరి అలాంటి చిరంజీవి తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో తన పుట్టినరోజు నాడు ఒకే ఒక్క మూవీని రిలీజ్ చేసారు. వినటానికి కొంచం ఆశ్చర్యంగా ఉన్న నిజం మాత్రం ఇదే. ‘చంటబ్బాయి’.. చిరంజీవిలో ఉన్నకామెడి కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం. 1986 ఆగస్టు 22న విడుదలైంది. సుహాసిని హీరోయిన్. లెజెండరీ కామెడీ దర్శకుడు జంధ్యాల మార్క్, చిరంజీవి ఎనర్జీ కలిసి చంటబ్బాయిని ఒక క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్గా మార్చాయి. చిరంజీవి ‘పాండురంగారావు’ అనే డిటెక్టివ్ క్యారక్టర్ లో చూపించిన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఇప్పటికీ అభిమానులని, ప్రేక్షకులని నవ్వుల జడివానలో ముంచెత్తుతాయి. చిరంజీవి తనదైన మాస్ మేనరిజంని పక్కన పెట్టి చాలా సింపుల్‌గా, ఫన్నీగా కనిపిస్తారు. ఇది ఆయన అభిమానులకి, ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని అందించింది. ‘చంటబ్బాయి’ కేవలం కామెడీ మూవీ మాత్రమే కాదు, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ చంటబ్బాయి మాత్రం బర్త్‌డే రోజు రిలీజైన ఏకైక సినిమాగా ఎప్పటికీ గుర్తుండిపోవడం ఖాయం.
Aug 24, 2026 11:08AM
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్.. అసలు మేటర్ తెలిస్తే షాక్.!
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, టాలీవుడ్ టాప్ పొజిషన్ కి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా 'ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్'తో మరెవరికి సాధ్యంకాని రికార్డు చిరంజీవి సొంతం. చిరంజీవి తనదైన నటన, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో.. తెలుగు సినిమా మార్కెట్ ను పెంచుకుంటూ రావడమే కాకుండా, ఏకంగా ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్ తో చరిత్ర సృష్టించారు. 1983లో వచ్చిన ‘ఖైదీ’ సినిమాతో ఈ చరిత్రకు తొలి అడుగు పడింది. అంతవరకు తెలుగు తెరపై ఉన్న హీరోల శైలిని పూర్తిగా మార్చేసింది ఈ సినిమా. కళ్ళల్లో ఆవేశం, గుండెల్లో అగ్నిపర్వతం, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల తుఫాన్ సృష్టించి, చిరంజీవిని ఒక్కసారిగా స్టార్ గా మార్చేసింది. అయితే ఆ తర్వాత ఆయన రెండో ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి దాదాపు నాలుగేళ్లు సమయం పట్టింది. 1987లో వచ్చిన ‘పసివాడి ప్రాణం’తో సెకండ్ ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ ఈ సినిమా బ్రేక్ చేసింది. అంతేకాదు, టాలీవుడ్ కు బ్రేక్ డ్యాన్స్‌ను పరిచయం చేసిన ఘనత కూడా ఈ సినిమా సొంతం. కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. 1987లో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ తర్వాత ప్రతి ఏడాది ఇండస్ట్రీ హిట్ కొట్టుకుంటూ వచ్చారు చిరంజీవి. 1988లో ‘యముడికి మొగుడు’, 1989లో ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, 1990లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, 1991లో ‘గ్యాంగ్ లీడర్’, 1992లో ‘ఘరానా మొగుడు’. ఇలా వరుసగా ఆరేళ్ళపాటు ప్రతి ఏటా ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. కలలో కూడా ఊహించని ఈ ఘనతను సాధించి చూపించారు చిరంజీవి. ముఖ్యంగా ‘ఘరానా మొగుడు’ సాధించిన రికార్డులతో చిరంజీవి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన మొదటి సినిమాగా ఇది చరిత్ర పుటల్లోకెక్కింది. ఈ సినిమాతో చిరంజీవి.. అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటూ, ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిశారు. 1992లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ తర్వాత ఎనిమిదో ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి.. చిరంజీవికి దాదాపు పదేళ్లు సమయం పట్టింది. 2002లో వచ్చిన ‘ఇంద్ర’ సినిమాలో.. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చిరు చూపించిన విశ్వరూపానికి బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. 25 కోట్ల షేర్ మార్కును దాటిన తొలి చిత్రంగా ఇది టాలీవుడ్లో చరిత్ర సృష్టించింది. ఇలా దాదాపు 20 ఏళ్ళ కాలంలో మొత్తంగా 8 ఇండస్ట్రీ హిట్స్ తో.. ఎప్పటికీ చెరిగిపోని రికార్డును చిరంజీవి సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ మెగాస్టార్ తన బాక్సాఫీస్ స్టామినా చూపుతూనే ఉన్నారు. రీఎంట్రీ తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో నాన్-బాహుబలి రికార్డులు సృష్టించారు. అలాగే గతేడాది వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 70 ఏళ్ళ వయసులోనూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి తెలుగువన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Chiranjeevi, Birthday, Industry Hits
Aug 21, 2026 5:26PMకన్నీళ్లను జయించి వెండితెరను ఏలిన మహానటి షావుకారు జానకి.!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన నటనతో, ఆత్మవిశ్వాసంతో చెరగని ముద్ర వేసిన అరుదైన నటి షావుకారు జానకి. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని, నాలుగు గోడలకే పరిమితం కాకుండా స్వశక్తితో ఎదిగిన ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. 1931 డిసెంబర్ 12న పశ్చిమ బెంగాల్లో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జానకి జన్మించారు. ఆమె తండ్రి టేకుమళ్ళ వెంకోజీరావు పేపర్ తయారీ టెక్నాలజీ నిపుణుడు, తల్లి శశీదేవి. ఆరుగురు పిల్లలు ఉన్న ఆ కుటుంబంలో జానకి అందరికంటే పెద్దవారు, కాగా ప్రముఖ నటి కృష్ణకుమారి ఈమెకు సొంత చెల్లెలు. ఉద్యోగ రీత్యా రాజమండ్రికి, ఆపై మద్రాసుకు మారిన ఆ కుటుంబంలో జానకి చిన్నతనం నుంచే వేదాంతం జగన్నాథశర్మ వద్ద నాట్యం నేర్చుకున్నారు. ఆకాశవాణిలో ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ నాటకాల ద్వారా తన కళాతృష్ణను చాటుకున్నారు. అయితే, 1947లో శంకరమంచి శ్రీనివాసరావుతో జరిగిన వివాహం ఆమె జీవితంలో ఒక పీడకలగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవ్వడంతో, కేవలం 18 సంవత్సరాల చిన్న వయసులోనే, చేతిలో తిండికి కూడా డబ్బులు లేని స్థితిలో తన మూడు నెలల పసిపాపను పోషించుకోవడానికి జానకి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టక తప్పలేదు. అప్పటివరకు రేడియో నాటకాలకే పరిమితమైన ఆమె కళ, ఆ క్షణంలో బతుకుతెరువుగా మారింది. 1950లో వచ్చిన 'షావుకారు' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె, మొదటి సినిమాతోనే శాశ్వతంగా 'షావుకారు జానకి'గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకంగా 400 కి పైగా చిత్రాల్లో నటించి తన నటనా వైదుష్యాన్ని చాటుకున్నారు. హిందీతో సహా అన్ని భాషల్లోనూ తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె గొప్పతనానికి నిదర్శనం. 'రోజులు మారాయి', 'ఏది నిజం', 'మంచి మనసులు', 'డాక్టర్ చక్రవర్తి', 'అక్కా చెల్లెలు', 'కన్యాశుల్కం' వంటి ఎన్నో సామాజిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కథానాయికగా మెప్పించారు. ఎన్టీఆర్ సొంత సంస్థ ప్రసిద్ధ బ్యానర్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన లక్ష్మీదేవిగా కూర్చునే అరుదైన గౌరవం పొందిన నటి జానకి. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణతో 'రామ్ రహీమ్', 'వేములవాడ భీమకవి' చిత్రాల్లో తల్లిగానూ ఆమె అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత 1987లో వచ్చిన 'సంసారం ఒక చదరంగం' చిత్రంలో పోషించిన 'చిలకమ్మ' పాత్ర షావుకారు జానకి కెరీర్లోనే ఒక అద్భుతమైన పాత్రగా నిలిచింది. దేవదాసులో పార్వతి పాత్ర చేజారినా, తమిళంలో మంచి అవకాశాలు అందుకుని ఎంజీఆర్, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్, ప్రేమ్‌నజీర్ వంటి అగ్రనటుల సరసన నటించారు. తమిళ దర్శకుడు కే. బాలచందర్ దర్శకత్వంలో 'కావ్య తలైవి' వంటి చిత్రాన్ని నిర్మించి తన సాహసాన్ని చాటారు. నటనలోనే కాక వంటకాల్లోనూ ప్రావీణ్యం ఉన్న ఆమె, చెన్నైలోని చెట్పెట్ ప్రాంతంలో 'ది కోకోనట్ గ్రో' పేరుతో రెస్టారెంట్ కూడా నడిపారు. Sowcar Janaki, Sowcar Janaki Biography, Sowcar Janaki Movies, Sowcar Janaki Age, Sowcar Janaki Family, Sowcar Janaki Telugu Web Story
Aug 21, 2026 3:11PMపవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ల 'లక్కీ హీరోయిన్' భూమిక.!
(ఆగస్ట్ 21 భూమిక చావ్లా పుట్టినరోజు సందర్భంగా..) తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో హోమ్లీ నటిగా, నటనకు ప్రాణంపొసే కథానాయికగా చెరగని ముద్ర వేసుకున్న అందాల భామ భూమిక. పంజాబీ కుటుంబంలో జన్మించిన భూమిక, మోడలింగ్ రంగం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత ప్రకటనల్లో మెరిసి వెండితెర ప్రవేశానికి బాటలు వేసుకున్నారు. అక్కినేని సుమంత్ హీరోగా వచ్చిన 'యువకుడు' చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన భూమిక, తన మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'ఖుషి' చిత్రం ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా, భూమికను స్టార్ హీరోయిన్గా నిలబెట్టింది. ఆ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన చేసిన 'ఒక్కడు', యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన 'సింహాద్రి' చిత్రాలు కూడా రికార్డు స్థాయి విజయాలు సాధించడంతో భూమిక టాలీవుడ్లో తిరుగులేని లక్కీ హీరోయిన్గా మారిపోయారు. 'వాసు', 'మిస్సమ్మ', 'అనసూయ' వంటి చిత్రాలలో నటించి గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన భూమిక, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన 'తేరే నామ్' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటికీ, తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ 'ఎంసిఎ', 'సిటీమార్', 'సీతారామం' వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు. Bhumika Chawla Birthday, Bhumika Chawla Movies, Kushi Bhumika Chawla, Okkadu Bhumika, Bhumika Chawla Special Story
Aug 21, 2026 11:59AMటాప్ హీరోల హిట్ పెయిర్, దక్షిణాది వెండితెర ఎవర్ గ్రీన్ హీరోయిన్ రాధిక.!
(ఆగస్ట్ 21 రాధిక పుట్టినరోజు సందర్భంగా..) తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన నటన, చలాకీతనం, వర్సటైల్ పెర్ఫార్మెన్స్తో సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటి, నిర్మాత రాధికా శరత్‌కుమార్. తమిళనాట అగ్ర నటుడు, విలన్‌గా గుర్తింపు పొందిన ఎం.ఆర్.రాధ కుమార్తెగా సినీ ప్రవేశం చేసిన రాధిక, తండ్రి బాటలోనే నటనలో తనదైన ముద్ర వేశారు. దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన 'కిళక్కే పోగుమ్ రైల్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె, తొలి చిత్రంతోనే విశేష ఆదరణ పొందారు. తెలుగు సినీరంగంలో మెగాస్టార్ చిరంజీవితో నటించిన 'న్యాయం కావాలి' చిత్రంతో అడుగుపెట్టిన రాధిక, తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించారు. ఆ తర్వాత చిరంజీవితో 'కిరాయి రౌడీలు', 'అభిలాష', 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'దొంగమొగుడు', 'ఆరాధన', 'రాజా విక్రమార్క' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి విజయవంతమైన కాంబినేషన్‌గా నిలిచారు. చిరంజీవితో అత్యధిక చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఘనత కూడా రాధికకే దక్కడం విశేషం. శోభన్ బాబు, చంద్రమోహన్, మురళీమోహన్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన రాధిక, కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా 'స్వాతిముత్యం', 'స్వాతికిరణం', 'త్రిశూలం', 'రాధాకళ్యాణం', 'మూడుముళ్ళు' వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నారు. డాన్సుల్లో తనదైన వేగం, నటనలో సహజత్వంతో నటిగా అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఏడాది రాధిక ప్రధాన పాత్రలో వచ్చిన 'తాయ్ కిళవి' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి స్టార్ హీరోల స్థాయిలో కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలోని ఆమె నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. వెండితెరపై నాయికగానే కాకుండా కేరెక్టర్ ఆర్టిస్టుగానూ, బుల్లితెరపై ధారావాహికలు, రాడాన్ మీడియా ద్వారా నిర్మాతగానూ రాధిక విశేష విజయాలు సాధించారు. దక్షిణాది భాషలన్నింటిలో నటించిన రాధికా శరత్‌కుమార్ మున్ముందు మరిన్ని విజయవంతమైన చిత్రాలు, పాత్రలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. Radhika Sarathkumar Birthday, Actress Radhika Movies, Radhika Chiranjeevi Hit Movies, Radhika Sarathkumar Special Story
Aug 21, 2026 11:37AMహాస్య నట శిఖరం పద్మనాభం.. నాటి తరం నవ్వులరేడు జ్ఞాపకాలు!
(ఆగస్ట్ 20 పద్మనాభం జయంతి సందర్భంగా..) తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తనదైన హాస్యచతురత, అమాయకత్వంతో కూడిన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత బి.వి. పద్మనాభరావు (పద్మనాభం) జయంతి నేడు. 1931 ఆగస్టు 20న వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం గ్రామంలో జన్మించిన ఆయన, పసి వయసులోనే నాటకాల ద్వారా కళారంగంలోకి అడుగుపెట్టారు. చిన్నతనం నుంచే పద్యాలు, పాటల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న పద్మనాభం, కేవలం ఐదేళ్ల వయసులోనే 'చింతామణి' నాటకంలో కృష్ణుడి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఆపై కళలపై ఉన్న మక్కువతో చెన్నై చేరుకుని రాజరాజేశ్వరి కంపెనీలో చేరారు. అక్కడ తన గాత్రంతో, నటనతో మెప్పించి నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూనే వెండితెర ప్రవేశానికి బాటలు వేసుకున్నారు. 1945లో 'మాయలోకం' చిత్రం ద్వారా కోరస్ గాయకుడిగా, నటుడిగా వెండితెరకు పరిచయమైన పద్మనాభం, ఆ తర్వాత 'త్యాగయ్య', 'యోగి వేమన', 'రాధిక' వంటి చిత్రాల్లో నటించారు. లెజెండరీ డైరెక్టర్ ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన 'షావుకారు' చిత్రంలో పోలయ్య పాత్ర ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత విజయవాహిని నిర్మించిన క్లాసిక్ 'పాతాళభైరవి'లో సదాజపుడిగా నటించి ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా పలు చిత్రాల్లో నారదుడి పాత్రలకు పద్మనాభం జీవం పోశారు. 'సతీ అనసూయ', 'ప్రమీలార్జునీయం' వంటి పౌరాణిక చిత్రాలలో ఆయన వేసిన నారద పాత్రలు విశేష ప్రజాదరణ పొందాయి. నటుడిగా వందలాది చిత్రాల్లో అలరించిన ఆయన, 'రేఖా అండ్ మురళి ఆర్ట్స్' పతాకంపై 'దేవత', 'పొట్టి ప్లీడర్', 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. 'మర్యాద రామన్న' చిత్రం ద్వారానే గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యాన్ని గాయకుడిగా వెండితెరకు పరిచయం చేయడం విశేషం. 1970లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కథానాయిక మొల్ల' చిత్రం నంది అవార్డును సొంతం చేసుకుంది. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. తన నటనతో ఎన్నో తరాలను అలరించిన పద్మనాభం 2010 ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన హాస్య పాత్రలు తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి.
Aug 20, 2026 4:28PMమధుర గాత్రంతో ఎవర్ గ్రీన్ పాటలు అందించిన 'అపర ఘంటసాల' వి.రామకృష్ణ
(ఆగస్ట్ 20 వి.రామకృష్ణ జయంతి సందర్భంగా..) తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నేపథ్య గాయకుడు వి.రామకృష్ణ (విస్సంరాజు రామకృష్ణదాసు) జయంతి నేడు. 1970వ దశకంలో తన గొంతుతో తెలుగు సినీ సంగీత రంగాన్ని ఏలిన ఆయన, అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని 'అపర ఘంటసాల'గా ప్రేక్షకుల మదిలో నిలిచారు. 1947 ఆగష్టు 20న విజయనగరంలో రంగసాయి, రత్నం దంపతులకు రామకృష్ణ జన్మించారు. ప్రముఖ గాయని పి.సుశీల ఈయనకు మేనత్త కావడం విశేషం. సంగీత దిగ్గజం నేదునూరి కృష్ణమూర్తి వద్ద శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్న రామకృష్ణ, ఆకాశవాణి 'యువవాణి' ద్వారా లలిత గీతాలు పాడుతూ తన గాత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చెన్నై చేరి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తన 20 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో రామకృష్ణ దాదాపు 200లకు పైగా చిత్రాల్లో 5000కు పైగా మధుర గీతాలను ఆలపించారు. నాటి అగ్ర కథానాయకులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి మహానటులకు ఆయన పాడిన పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి. సంగీత బ్రహ్మ కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి దిగ్గజ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో ఆయన అందించిన పాటలు ఇప్పటికీ శ్రోతలను మైమరిపిస్తూనే ఉంటాయి. ఆయన పాడిన 'తాతమనవడు' చిత్రంలోని "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం", 'శారద'లోని "శారదా నను చేరవా", 'ముత్యాల ముగ్గు'లోని "ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు", 'అమరదీపం'లోని "నా జీవన సంధ్యాసమయంలో" వంటి ఎన్నో పాటలు ఆల్ టైమ్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. 'అల్లూరి సీతారామరాజు'లో ఘంటసాల గారితో కలిసి పాడిన "తెలుగువీర లేవరా" గీతం ప్రతి తెలుగువాడి నరనరాల్లో దేశభక్తిని రగిలిస్తుంది. సినిమా పాటలతో పాటు ఆయన పాడిన భక్తిగీతాల ఆల్బమ్‌లకు విశేష ఆదరణ లభించింది. 1977లో గాయని జ్యోతి ఖన్నాను వివాహమాడిన ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 'నువ్వే కావాలి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి కిరణ్ ఈయన కుమారుడే. చిత్రసీమ హైదరాబాద్ తరలివచ్చినప్పుడు ఇక్కడే స్థిరపడిన రామకృష్ణ గారు, కొంతకాలం క్యాన్సర్ వ్యాధితో పోరాడి 2015 జూలై 16న తుదిశ్వాస విడిచారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన సుమధుర గీతాలు తెలుగువారు ఉన్నంతకాలం మారుమోగుతూనే ఉంటాయి.
Aug 20, 2026 4:12PMచిరంజీవి విషయంలో శోభన్‌బాబు చెప్పిందే జరిగింది.!
1978లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో మైల్ స్టోన్ లాంటి సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘చట్టానికి కళ్లులేవు’ ఒకటి. 1981లో ఈ సినిమా విడుదలైంది. అప్పటికే చిరంజీవి 35 సినిమాల్లో నటించారు. హీరోగా ఆయనకు ఒక రేంజ్‌ని తీసుకొచ్చిన సినిమా ‘చట్టానికి కళ్లులేవు’. ఈ సినిమా ఘనవిజయం సాధించి చిరంజీవికి మాస్ హీరోగా మంచి పేరు తెచ్చింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో ఈ సినిమా విడుదలై 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదే. దాంతో శతదినోత్సవాన్ని ఈ థియేటర్లోనే నిర్వహించారు. ఈ వేడుకకు శోభన్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంలో శోభన్‌బాబు మాట్లాడుతూ నేను నటుడిగా ఇండస్ట్రీకి వచ్చే సమయానికి ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ టాప్ హీరోలుగా ఉన్నారు. ఇక రాబోయే రోజులన్నీ చిరంజీవివే అన్నారు. శోభన్‌బాబు చెప్పినట్టుగానే టాలీవుడ్లో తిరుగులేని మాస్ హీరోగా చక్రం తిప్పి మెగాస్టార్‌గా చిరంజీవి ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే.
Aug 20, 2026 12:16PMసంగీత శిక్షణ లేకున్నా కోట్లాది గుండెలను మీటిన గాన కోకిల జిక్కి.!
(ఆగస్ట్ 16 గాయని జిక్కి వర్ధంతి సందర్భంగా..) తెలుగు సినీ సంగీత స్వర్ణయుగంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది శ్రోతలను మైమరిపించిన గాన కోకిల జిక్కి (పి.జి. కృష్ణవేణి) వర్ధంతి సందర్భంగా చలనచిత్ర పరిశ్రమ, సంగీత ప్రేమికులు ఆమెను ఘనంగా స్మరించుకుంటున్నారు. ఆగష్టు 16న ఆమె భౌతికంగా మనకు దూరమైనా, ఆమె ఆలపించిన వేలాది గీతాలు నేటికీ ప్రతి ఇంటా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జన్మించిన కృష్ణవేణి, ఎలాంటి శాస్త్రీయ సంగీత శిక్షణ పొందనప్పటికీ కేవలం వినికిడి జ్ఞానంతోనే అద్భుతమైన గాయనిగా ఎదగడం విశేషం. చిన్నతనంలో తండ్రితో కలిసి మద్రాస్ స్టూడియోలకు వెళ్లిన సమయంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం 1943లో వచ్చిన 'పంతులమ్మ' చిత్రంలో ఆమెకు పాడే అవకాశంతో పాటు నటించే అవకాశం కూడా కల్పించారు. అక్కడి నుండి ప్రారంభమైన ఆమె సంగీత ప్రయాణం మూడు దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా సాగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ, హిందీ తదితర భాషల్లో పదివేలకు పైగా మధుర గీతాలను ఆలపించి దక్షిణాదిలోనే అగ్రశ్రేణి గాయనిగా నిలిచారు. ఆ తర్వాతి కాలంలో ప్రముఖ గాయకుడు ఏ.ఎమ్. రాజాను ప్రేమవివాహం చేసుకున్న జిక్కి, వ్యక్తిగత జీవితంలోనూ సంగీతంతోనే అనుబంధాన్ని కొనసాగించారు. ఏరువాకా సాగారోరన్నో చిన్నన్న, జీవితమే సఫలము, చెట్టులెక్క గలవా ఓ నరహరి, పులకించని మది పులకించు, ఆశలు తీర్చవే ఓ జనని, కం కం కం కంగారు నీకేలనే, చిగురాకులలో చిలకమ్మా, ఓహో బంగరు చిలకా, టౌను పక్కకెళ్లొద్దురా డింగరీ వంటి ఎన్నో సూపర్‌హిట్ పాటలను జిక్కీ ఆలపించారు. వయసు పైబడినా ఆమె స్వరంలోని తియ్యదనం, పదును తగ్గలేదని రుజువు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' చిత్రంలో ఆమె పాడిన "జాణవులే నెరజాణవులే..." పాట ఇప్పటికీ సంగీత ప్రియులను ఊపేస్తూనే ఉంటుంది. తరాలు మారినా ఆమె గొంతులో ఉన్న ఆ విచిత్రమైన మాధుర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది. జిక్కి వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె పాడిన ఆల్ టైమ్ హిట్ పాటలను షేర్ చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఏ కాలానికైనా వన్నె తగ్గని ఆమె గాత్రం తెలుగు సినీ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని కొనియాడుతున్నారు. అమర గాయని జిక్కి గారు మనమధ్య లేకపోయినా, ఆమె వదిలివెళ్లిన అమృత గానాలు ఉన్నంత కాలం శ్రోతల గుండెల్లో ఆమె చిరస్థాయిగా నిలిచే ఉంటారు.
Aug 16, 2026 2:58PM
ఈ హీరోని చూసి సాక్షాత్తు శ్రీరాముడే అన్నారు
తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో మహానుభావులు. అలాంటి వాళ్లలో ఒకరు సి.హెచ్. నారాయణరావు. సహజ నటనకి పెట్టింది పేరు. చలనచిత్ర రంగానికి పునాదులు పడుతున్న రోజుల్లో, తన అద్భుతమైన నటన, శోభాయమానమైన రూపంతో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టిన మహానటుడు. సినిమా రంగంతో ఈ మాత్రం సంబంధం లేదు. కానీ దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరావుని నారాయణరావు రూపం ఆకర్షించింది. దీంతో 1940 లో జీవన జ్యోతి తో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'చెంచులక్ష్మి' భక్త పోతన', 'రాధాకృష్ణ' వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 1948లో విడుదలైన 'మనదేశం' సినిమాలో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంతోనే ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు వంటి దిగ్గజాలు వెండితెరకి పరిచయమవ్వగా నారాయణరావు హీరో. 1942 లో చేసిన భక్త పోతన మూవీలో శ్రీరామచంద్రుడుగా కనపడ్డారు. రాముడిగా ఆయన రూపురేఖలు, ముఖంలో కనిపించే శాంతం, కళ్లలోని గాంభీర్యం చూసి అప్పటి ప్రేక్షకులు నారాయణరావు గారిని సాక్షాత్తు "శ్రీరాముడు" అని పిలుచుకునేవారు. ఆయన పోషించే క్యారక్టర్ లో కనిపించే దైవిక కళ, నటనలో ఉండే సహజత్వం ప్రజల మనసుల్లో ఆయన్ని రాముడిలా ప్రతిష్ఠించాయి. Also read: వైరల్ గా మారిన న్యూస్: షూటింగ్ లేని టైంలో #ప్రభాస్ ఏం చేస్తాడో తెలుసా! కెరీర్ లో మొత్తం ముప్పై ఒక్క సినిమాల వరకు చేసిన నారాయణరావు 1953 లో 'మంజరి' అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఆర్థికంగా నారాయణరావు గారిని కోలుకోలేని దెబ్బ తీసింది. దీంతో తన సంపాదనలో చాలా భాగం కోల్పోవాల్సి వచ్చింది. అయినా సరే తన క్రమశిక్షణని, నటన పట్ల ఉన్న అంకితభావాన్ని ఎప్పుడూ వీడలేదు. పూర్తి పేరు చదలవాడ నారాయణరావు. స్వస్థలం మధుగిరి. 1913 సెప్టెంబర్ 13 డేట్ ఆఫ్ బర్త్. 1984 ఫిబ్రవరి 14 న పరమపదించారు. Ch. Narayanarao, Sriramudu, Ntr
Aug 13, 2026 12:27PM.webp)
గూఢచారి 116 కి 60 ఏళ్లు: సృష్టించిన సంచలనం ఇదే
సూపర్ స్టార్ కృష్ణ.. ప్రభంజనం అనే పదం పుట్టిందే కృష్ణ గారి కోసం అయి ఉండవచ్చు. అంతలా తెలుగు సినీ జగత్తులో కొన్ని తరాల పాటు తన ప్రభంజాన్ని చాటి చెప్పారు. తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చడంతో పాటు వేగాన్ని కూడా పెంచాడు. అలాంటి ఒక చిత్రమే గూఢచారి 116 . హాలీవుడ్ మేకింగ్ స్టైల్ తో రూపుద్దిద్దుకున్న ఈ చిత్రం కృష్ణ గారి కెరీర్ లో మూడవది కావడంతో పాటు కృష్ణ గారికి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. గూఢచారి 116 వచ్చి నేటికి 60 సంవత్సరాలు. కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ విజయాన్ని మాత్రమే అందించవు, అవి ఒక కొత్త శకానికి నాంది పలుకుతాయి. అలాంటి అరుదైన మైలురాయి చిత్రం 'గూఢచారి 116'. 1966లో విడుదలైంది. ఆ కాలంలో ఎక్కువగా పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు మాత్రమే ఉండేవి. అలాంటిది హాలీవుడ్ లో తెరకెక్కిన ఒక జేమ్స్ బ్యాండ్ చిత్రం మద్రాస్ లోని ఒక థియేటర్ లో ప్రదర్శితమైంది. దీంతో నిర్మాత డుండి గారు తెలుగులో కూడా అలాంటి సినిమాని తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. దాంతో కృష్ణ గారిని హీరోగా ఎన్నుకొని హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి, తెలుగు సినిమా గతిని పూర్తిగా మార్చేశారు. ఈ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కథనం నిజంగానే ఒక అద్భుతం. అప్పటివరకు రొమాంటిక్ లేదా సాదాసీదా పాత్రలలో కనిపించిన కృష్ణ గారిని ఒక పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా, స్టైలిష్ ఏజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆ రోజుల్లో ఒక పెద్ద సాహసం. ఒక సినిమాల్లో కృష్ణ గారు రిస్కీ ఫైట్ లో డూప్ లేకుండా బైక్ పై నుంచి కారుపైకి దూకుతాడు.ఆ సన్నివేశం చూసే నిర్మాత డుండి గారు కృష్ణ గారిని గూఢచారికి హీరోగా ఫిక్స్ చేయడం జరిగింది. గూఢచారిలో కూడా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం, స్పీడ్ డ్యాన్సులు, స్టైలిష్ సుట్లు, చేతిలో గన్ పట్టుకుని శత్రువులపై విరుచుకుపడే విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయం తర్వాత కృష్ణ గారిని అభిమానులు "తెలుగు జేమ్స్ బాండ్" అని పిలుచుకోవడం ప్రారంభించారు. మల్లిఖార్జున రావు అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత కథానాయికగా నటించి తన గ్లామర్‌తో, నటనతో విశేషంగా అలరించారు. అలాగే శోభన్ బాబు గారు సినిమా ప్రారంభంలో ఒక కీలకమైన గూఢచారి పాత్రలో మెరిసి అలరించారు. ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఎం. విన్సెంట్ అందించిన విజువల్స్, విలన్ల రహస్య స్థావరాలు, నిఘా పరికరాలు, యాక్షన్ సన్నివేశాలు నాటి ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచాయి. అలాగే టి. చలపతిరావు స్వరపరిచిన సంగీతం సినిమాకు ప్రాణవాయువులా నిలిచింది. ముఖ్యంగా నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే' "ఎర్రని పెదవుల దానా", "మనసార నవ్వమ్మ" డీరి డీరి డిరిడి వంటి పాటలు అప్పట్లో మార్మోగిపోయాయి. ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠను పెంచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక క్లాసిక్‌గా నిలబెట్టింది. Also read: బాసు.. ఈ రోజు ఆ సీక్రెట్ చెప్పేస్తావా! ఆ రోజుల్లో పరిమిత బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ, 'గూఢచారి 116' సృష్టించిన బాక్సాఫీస్ సంచలనం అసాధారణమైనది. అనేక ప్రధాన కేంద్రాలలో 100 రోజులకు పైగా సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శించబడి భారీ వసూళ్లను సాధించింది. నిర్మాణ వ్యయంతో పోలిస్తే ఈ సినిమా సాధించిన లాభాలు ఆ రోజుల్లో ఒక రికార్డు. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతోనే టాలీవుడ్లో వరుసగా స్పై థ్రిల్లర్లు, కౌబాయ్ సినిమాలు, యాక్షన్ అడ్వెంచర్ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. కృష్ణ కూడా ఆ తర్వాత 'జేమ్స్ బాండ్ 777', 'ఏజెంట్ గోపి' వంటి అనేక స్పై చిత్రాలలో నటించి తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు. 60 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ స్పై థ్రిల్లర్ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు 'గూఢచారి 116'. టాలీవుడ్ చరిత్ర పుటల్లో చెరిగిపోని సంతకం చేసిన ఈ చిత్రం ఎప్పటికీ ఒక అద్భుత సంచలనమే! ఈ చిత్రం తర్వాత డుండి,కృష్ణ గారి కాంబోలో 25 సినిమాలు రావడం రికార్డు. మోసగాళ్లకు మోసగాడు కూడా డుండినే నిర్మించారు. ఆయన పూర్తి పేరు పోతిన డుం డేశ్వరరావు. స్వగ్రామం విజయవాడ కాగా తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి థియేటర్ మారుతీ టాకీస్ ఓనర్ కూడా. Krishna, Gudachari116, Dundi, malikharjunarao, jayalalitha
Aug 11, 2026 10:56AMనేటితరం గాయనీగాయకులకు జమునారాణి అందించిన అమూల్య సందేశమిదే.!
భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో తన విలక్షణమైన గొంతుతో కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన మహోన్నత గాయని జమునారాణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వేలాది గీతాలను ఆలపించి, దక్షిణభారత చలనచిత్ర రంగానికి చెరగని ముద్ర వేసిన ఆమె జీవితం ఒక అద్భుతమైన గాథ. కేవలం ఏడేళ్ల పిన్న వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన జమునారాణి, ఏడు దశాబ్దాలకు పైగా తన మధుర గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించారు. నాటి స్వర్ణయుగ చిత్రాల నుండి నేటి ఆధునిక కాలం వరకు ఆమె పాడిన పాటలు ఎప్పటికీ నిత్యనూతనంగానే నిలిచిపోతాయి. అప్పట్లో క్లాసికల్ పాటలతో పాటు జానపద, రొమాంటిక్ మరియు క్లబ్ డాన్స్ సాంగ్స్ పాడటంలో జమునా రాణి గారిది ఒక ప్రత్యేకమైన శైలి. "ఆశల ఊయల ఊగే నా మనసు", "ఏమిటో ఈ మాయ" వంటి లెక్కలేనన్ని మరపురాని పాటలు ఆమె గాత్ర వైభవానికి నిదర్శనంగా నిలుస్తాయి. నాటి అగ్ర నటులు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేషన్, ఎంజీఆర్ చిత్రాలలో ఆమె పాడిన పాటలు చలనచిత్ర రంగాన్ని ఊపేశాయి. సంగీత దర్శకులు ఆమె గొంతులోని స్పష్టత, భావోద్వేగం మరియు వైవిధ్యానికి పెద్దపీట వేసేవారు. తరాలు మారినా ఆమె గొంతులోని ఆకర్షణ కొద్దిగా కూడా తగ్గకపోవడం విశేషం. ఆమధ్య జమునా రాణి ఇచ్చిన ఓ ఇంటర్వూలో నేటి సంగీత పోకడలు మరియు నూతన గాయకుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటి కాలంలో పాటల రికార్డింగ్ విధానం చాలా కఠినంగా ఉండేదని, ఒక్క చిన్న తప్పు జరిగినా ఆర్కెస్ట్రా మొత్తం మళ్లీ మొదటి నుండి వాయించాల్సి వచ్చేదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ క్రమశిక్షణ, సాధన మరియు అంకితభావం వల్లనే నాటి పాటలు దశాబ్దాలు గడిచినా శ్రోతల మనస్సులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయని అభిప్రాయపడ్డారు. నేటి తరం సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతోందని, పాటలో భావం కంటే సౌండ్ ఎఫెక్ట్స్ మరియు మిక్సింగ్లకే ప్రాధాన్యత పెరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. న్యూ ఏజ్ సింగర్స్ మరియు ఆటో-ట్యూన్ టెక్నాలజీపై స్పందిస్తూ, నిజమైన ప్రతిభకు సాధన, గొంతులో ఉండే స్వచ్ఛత అత్యంత ముఖ్యమని జమునా రాణి స్పష్టం చేశారు. లైవ్ రికార్డింగ్ రోజుల్లో గంటల తరబడి చేసిన సాధనే తమను మహోన్నత కళాకారులుగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. సంగీతంలో సాధించిన అత్యున్నత విజయాలకు గాను ఆమె లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో పాటు ఎన్నో గౌరవాలను అందుకున్నారు. నాటి లతా మంగేష్కర్, పి. సుశీల, ఎస్. జానకి వంటి దిగ్గజ గాయనీ మణులతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, సంగీతం అనేది కేవలం వ్యాపారం కాదు, అదొక పవిత్రమైన సాధన అని నేటి తరానికి ఆత్మీయ సందేశాన్ని అందించారు.
Aug 3, 2026 6:22PMఎస్.వి.కృష్ణారెడ్డి సినిమాను సౌందర్య రిజెక్ట్ చేశారు.. ఎందుకో తెలుసా?
మీ సినిమా చిన్న సీన్ అయినా ఇవ్వండి, క్యారెక్టర్ ఏంటి, ఎవరి పక్కన చెయ్యాలి.. ఇలా దేని గురించీ అడగను. మీ సినిమాలో నటించాలి అంతే.. ఈ మాట ఎవరు, ఎవరితో అన్నారో తెలుసా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య, ఫ్యామిలీ డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డిని ఈ విధంగా వేడుకున్నారు. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నెంబర్‌వన్ వంటి సూపర్‌హిట్ సినిమాలతో హీరోయిన్గా సౌందర్యకు మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. అంత మంచి కాంబినేషన్ తర్వాత కృష్ణారెడ్డి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సౌందర్య హీరోయిన్గా నటించేందుకు ఒప్పుకోలేదు. దానికి కారణం ఏమిటి? వీరిద్దరి మధ్య ఏం జరిగింది? మళ్లీ కృష్ణారెడ్డి దగ్గరకి సౌందర్య ఎందుకు వచ్చారు? చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను ఇవ్వండి ప్లీజ్ అని ఎందుకు ప్రాధేయపడ్డారు? దీని వెనుక ఒక కథ ఉంది. కర్ణాటకకు చెందిన సౌందర్య చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మొదట కన్న సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మనవరాలి పెళ్లి సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డిను సౌందర్య అందం, అభినయం ఆకట్టుకుంది. అలా తను డైరెక్ట్ చేస్తున్న రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మాయలోడు, నెంబర్‌వన్ సినిమాల్లో కూడా సౌందర్య హీరోయిన్గా నటించింది. ఆ మూడు సినిమాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణారెడ్డి అలీతో యమలీల చిత్రం ప్లాన్ చేశారు. సౌందర్యను హీరోయిన్గా అనుకున్నారు. అయితే అప్పటికే హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉన్న సౌందర్య కమెడియన్ అలీ పక్కన హీరోయిన్గా చేసేందుకు ఒప్పుకోలేదు. ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు అలీ పక్కన హీరోయిన్గా చెయ్యొద్దని చెప్పడమే దానికి కారణం. చేసేది లేక యమలీల చిత్రంలో ఇంద్రజను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హీరోగా అలీకి, హీరోయిన్ ఇంద్రజకు, దర్శకుడుగా ఎస్.వి.కృష్ణారెడ్డికి చాలా మంచి పేరు తెచ్చిన సినిమా అది. తనకు మూడు సూపర్‌హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ మాటను కాదన్నందుకు సౌందర్య ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత కృష్ణారెడ్డిని కలిసిన సౌందర్య ఆయన డైరెక్ట్ చేసే సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో శుభలగ్నం చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు కృష్ణారెడ్డి. ఎవరి పక్కన అయితే హీరోయిన్గా నటించేందుకు సౌందర్య ఒప్పుకోలేదో అదే అలీతో చినుకు చినుకు అందెలతో.. అనే పాటలో సౌందర్య నటించి మెప్పించారు. అలా తను చేసిన తప్పును సరిదద్దుకొని మళ్లీ ఎస్.వి.కృష్ణారెడ్డితో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత టాప్ హీరో, ప్రేమకు వేళాయెరా వంటి సినిమాల్లో సౌందర్య హీరోయిన్గా నటించారు.
Jul 31, 2026 1:49PMనందమూరి బాలకృష్ణ తొలి సినిమా నిషేధం వెనుక సంచలన నిజాలు.!
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతాలు, సంచలనాలు నమోదయ్యాయి. అయితే 1974లో విడుదలైన ఎన్టీఆర్ అపురూప చిత్రం 'తాతమ్మ కల' సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. కుటుంబ నియంత్రణకు, భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఈ చిత్రంలో సంభాషణలు ఉండటం ఆ కాలంలో పెద్ద దుమారమే లేపింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిషేధానికి గురైన తొలి సినిమాగా ఇది నిలిచింది. ఈ వివాదం ఎంత దూరకెళ్లిందంటే, ఏకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సైతం దీనిపై చర్చ జరగడం విశేషం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని అంశాలను మార్చి, చిత్ర నిర్మాతగా ఎన్టీఆర్ స్వయంగా వివరణ ఇచ్చి మళ్లీ సెన్సార్ అనుమతి పొందిన తర్వాతే ఈ చిత్రం రెండోసారి విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో ఇన్ని అడ్డంకులను ఎదుర్కొని, రీరిలీజ్ అయిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇన్ని వివాదాలు, సంచలనాల మధ్యే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 రోజులు ప్రదర్శించబడి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, వివాదాలు చుట్టుముట్టినా ఉత్తమ కథగా నంది అవార్డును సొంతం చేసుకోవడం ఈ చిత్ర ప్రత్యేకత. నటసార్వభౌమ ఎన్టీఆర్ లాంటి మహానటుడు స్వయంగా నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించి, తానే తాతమ్మ భర్తగా, మనవడిగా ద్విపాత్రాభినయం చేసినప్పటికీ, ఈ సినిమాకు అసలు సిసలైన హీరో మాత్రం నటి భానుమతే. ఎన్టీఆర్ అంతటి దిగ్గజ నటుడి ఎదుట ఏమాత్రం బెదరకుండా, ఆమెకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎన్టీఆర్ గొప్పతనానికి నిదర్శనం. భానుమతి ధైర్యానికి, ఆమె నటనకు ఈ సినిమా ఒక పెద్ద పీఠం వేసింది. ఎన్టీఆర్, భానుమతి మధ్య వచ్చే 'కోరమీసం కుర్రోడా' పాటలో ఇద్దరి పోటాపోటీ అభినయం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ చిత్రంలో తొలిసారి బాలకృష్ణ బాలనటుడిగా నటించడం విశేషం. అలాగే ఎన్టీఆర్, కాంచన, హరికృష్ణ, రోజారమణి, రాజబాబు, మాడా వంటి ప్రముఖ తారాగణం ఇందులో నటించారు. ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో కొసరాజు రాసిన పాటలు అప్పట్లో శ్రోతలను ఎంతగానో అలరించాయి. 'ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు', 'అయ్య లాలీ ముద్దులయ్య లాలీ', 'శెనగపూల రెయికాదానా జారుపైటా చిన్నదానా' వంటి అద్భుతమైన పాటలు ఈ సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. గ్రామాల్లో వ్యవసాయం చేయలేక బస్తీలకు చేరే ఆసాముల కథాంశంతో పాటు, కుటుంబ విలువలు, తాతమ్మ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడదగ్గ అరుదైన కళాఖండం.
Jul 23, 2026 7:53PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




.webp)

.webp)
.webp)



