"గ్రాఫిక్స్‌తో పని లేకుండా సీజీ పనివాళ్లు తన సెట్‌లో అడుగుపెట్టకుండా ఉండే కథ చెప్పమని రాజమౌళి అడుగుతున్నాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నా" అని ఆమధ్య ఓ సందర్భంలో చెప్పారు రాజమౌళి తండ్రి, సీనియర్ రైటర్ వి. విజయేంద్రప్రసాద్. సినిమాని ఇంతదాకా వినోద సాధనంగానే రాజమౌళి చూస్తూ రావడం వల్ల సామాజిక ప్రయోజనం లేని కథలనే కుమారుడికి అందిస్తూ వచ్చారు విజయేంద్రప్రసాద్. అయితే తొలిసారి 'ఆర్ఆర్ఆర్'కు అందుకు భిన్నమైన కథను ఆయన సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వీరపుత్రుల పాత్రలతో ఒక కల్పిత కథను ఆయన సృష్టించారు. మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు, గోండువీరుడు కొమరం భీమ్ యువకులుగా ఉన్నప్పుడు ఇల్లు వదిలి మూడేళ్ల పాటు అజ్ఞాతంలో ఎక్కడ గడిపారు, ఏం చేశారనే ఊహాజనిత కథను ఆయన అల్లారు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేశ్‌తో సినిమా చేయడానికి రాజమౌళి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి దెబ్బ కొట్టడంతో, నాలుగు నెలల నుంచీ ఖాళీగా ఉన్న ఆయన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో తండ్రితో కలిసి కథా చర్చల్లో పాల్గొంటున్నారు. రాజమౌళి ఫామ్‌హౌస్‌లోనే తండ్రీకొడుకులు మహేశ్ కథ ఎలా ఉండాలి, ఆయన పాత్ర ఏ తీరున ఉండాలనే విషయంపై చర్చించుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా కథను అల్లుతున్నారు విజయేంద్రప్రసాద్. సాధారణంగా తండ్రి ఇచ్చిన కథకు తగ్గట్లు ఆర్టిస్టులను ఎంచుకోవడం రాజమౌళి అలవాటు. 'ఆర్ఆర్ఆర్' దాకా అదే పద్ధతి నడిచింది. తొలిసారిగా మహేశ్‌ను దృష్టిలో ఉంచుకొని వారు కథ సిద్ధం చేస్తుండటం విశేషం. 'ఆర్ఆర్ఆర్'కు కూడా గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నందున ఇప్పుడు మహేశ్ కోసం సిద్ధం చేస్తున్న కథలో గ్రాఫిక్స్ వాడాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.
విజయేంద్రప్రసాద్‌కు కథలు రాయడం ఒక్కటే బాగా తెలిసిన పని. ఇప్పటికే ఆయన బాలీవుడ్ కోసం 'రౌడీ రాథోడ్' (తెలుగులో 'విక్రమార్కుడు')కు సీక్వెల్ స్టోరీని రెడీ చేశారు. అయితే అక్షయ్‌కుమార్ దాన్ని చేస్తున్నాడా, లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు ఆయన కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తోన్న జయలలిత బయోపిక్ 'తలైవి'కి కూడా రచన చేస్తున్నారు.