నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ సమర్పించిన 'మహానటి' మూవీ జాతీయ స్థాయిలో ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందో మనకు తెలుసు. సావిత్రి పాత్ర పోషణతో కీర్తి సురేశ్ ఏకంగా ఉత్తమ నటిగా రాష్ట్రపతి నుంచి నేషనల్ అవార్డ్ అందుకుంది. అలాంటి సినిమా షూటింగ్ సమయంలోనూ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటి.. మహానటి సెట్స్‌పై వెటరన్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ప్రత్యక్షమవడం. ఆ కథేమిటంటే...
'మాయాబజార్' డైరెక్టర్ కె.వి. రెడ్డి ఒక సీన్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. శశిరేఖ పాత్రధారి సావిత్రి, ఘటోత్కచుడు పాత్రధారి ఎస్వీ రంగారావు అభినయిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్ట్ చదివి వినిపిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో తోట తరణి వేసిన సెట్లో ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అదెలా సాధ్యం?! 'మహానటి' సినిమా కోసం మాయాబజార్ సీన్‌ను రిక్రియేట్ చేస్తున్నారన్న మాట! 'మాయాబజార్'ను రూపొందించింది కె.వి. రెడ్డి కదా.. తెరపై ఆ పాత్రను దర్శకుడు క్రిష్ పోషిస్తుంటే, సావిత్రిగా కీర్తి సురేశ్, ఘటోత్కచునిగా మోహన్‌బాబు అభినయిస్తున్నారు. ఇక సింగీతం పాత్రను చేస్తోంది 'పెళ్లిచూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్. స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా సీనియర్ నరేశ్ కనిపిస్తున్నారు.
విశేషం ఏమంటే.. ఈ సన్నివేశాలకు అప్పటి ప్రత్యక్ష సాక్షి సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణలోనే వాటిని చిత్రీకరించడం! తెరపై తన పాత్రను మరొకరు పోషిస్తుండగా, ఒక దర్శకుడు ఆ సన్నివేశాల్ని పర్యవేక్షించడం అనేది అత్యంత అరుదైన సంఘటన. ఇలాంటి ఎన్నో అపురూప సన్నివేశాలు, సంఘటనలకు వేదికగా మారింది 'మహానటి' చిత్ర నిర్మాణం. జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక మధుర జ్ఞాపకంగా గుండెల్లో నిలిచిపోయింది.