![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన కొణిదెల తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. వారికి త్వరలో పండంటి బిడ్డ పుట్టనున్నారు. రామ్ చరణ్‌కు వారసుడు పుట్టాలని రామ్ చరణ్ తరువాత ఆయన లెగసీని అందుకోవాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. గత ఏడాది చివరలో చరణ్-ఉపాసనలు తల్లిదండ్రులవుతున్న తీపి కబురు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తాజాగా రామ్ చరణ్ అక్క సుస్మిత కొణిదెల మాట్లాడుతూ, "రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కావడం చాలా సంతోషాన్నిస్తోంది. త్వరలో మా కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు రాబోతున్నారు. కొడుకు పుట్టినా కూతురు పుట్టినా మాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే మా కుటుంబంలో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి ఈసారి అబ్బాయి అయితే బాగుంటుందని మేమంతా ఆశిస్తున్నాం" అని చెప్పుకొచ్చింది.
మొత్తానికి పెళ్లయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన పలు పుకార్లకు చెక్ పెడుతూ తల్లిదండ్రులు కావడంపై మెగా అభిమానులు మెగా ఆనందంతో ఉన్నారు. ఇక సుస్మిత విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తోంది. తాజాగా విడుదలైన 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి వింటేజ్ లుక్ అంత అద్భుతంగా రావడానికి కారణం సుస్మిత అని చెప్పాలి.
దీనిపై ఆమె మాట్లాడుతూ, "దర్శకుడు బాబీ తనకు చిరంజీవి గారి వింటేజ్ లుక్కు కావాలి అన్నారు. మేము మా నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాం. కాబట్టి దీనికోసం మేము పెద్దగా కష్టపడలేదు. మా పని చాలా తేలికగా పూర్తి చేశాం. ఇందులోని మా నాన్నగారి కాస్ట్యూమ్స్ అందర్నీ మెప్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అని చెప్పింది.
![]() |
![]() |