![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, ఎందరో ప్రశంసలు అందుకుంది. తాజాగా హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకోవడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే పంచుకున్నారు.
హాలీవుడ్ కి చెందిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ ఫారెన్ ల్యాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్(నాటు నాటు) విభాగాల్లో ఆర్ఆర్ఆర్ అవార్డులు గెలుచుకుంది. ఈ అవార్డుల వేడుకలో ఎందరో హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ పాల్గొంది. 'టైటానిక్', 'అవతార్' వంటి అద్భుత చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళి, కీరవాణి తో కాసేపు ముచ్చటించి 'ఆర్ఆర్ఆర్'పై ప్రశంసలు గుప్పించారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసి ఎంతో నచ్చడంతో, తన సతీమణితో కలిసి మళ్ళీ రెండోసారి చూశారట జేమ్స్ కామెరాన్. అలాగే కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట. అంతటి గొప్ప దర్శకుడు తమ సినిమా గురించి, తమ పని గురించి మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందంటూ రాజమౌళి, కీరవాణి తమ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
![]() |
![]() |